ఉదాహరణకు, ‘విప్లవాల వీరోచిత పొలికేకలు, తల్లడిల్లిన తల్లుల ఆర్తనాదాలు....’ అంటూ ‘తల్లి భారతి’ కవితలో కన్నతల్లుల ఆవేదనకు అక్షరరూపమిచ్చారు రామకృష్ణ. రాజకీయపుటెత్తులకు ఓటుహక్కు వజ్రాయుధం లొంగిపోతే భవితకు తూట్లు పొడిచినట్టే.....’ అంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడమని తన ‘21వ శతాబ్దపు ఓటరు’ కవితలో పిలుపునిస్తారు రామకృష్ణ.‘నిశ్శబ్దంగా తనలో తను వైరాగ్యగీతం ఆలపిస్తోంది చెట్టు/నిన్ను నిలువునా వేయివ్రక్కలు చేసినా/మౌనంగా మానవసేవే నీ ధ్యేయం అని చెప్పడానికన్నట్టు చెట్టు నిన్ను పిలిచింది...’ అంటూ మనకు కర్తవ్యబోధ చేస్తారు ‘చెట్టు పిలిచింది’ కవితలో.విశాఖనగరం కాలుష్యం కోరల్లో చిక్కుకుందన్న వార్తలకు స్పందించి ‘విశాఖ@2020’ అనే శీర్షికతో ఆయన రాసిన దీర్ఘకవిత అందరిమన్ననలను అందుకుంది. కాలుష్యం కోరల్లో విశాఖనగరం ఎలా చిక్కుకుందో, దాని నివారణోపాయాలేమిటో ఆ దీర్ఘకవితలో వివరిస్తారాయన. 

‘కవితారథం’ ఆయన వెలువరించిన కవితాసంపుటి. మరొకటి ‘వాడిని జయించాలి’ దీర్ఘ కవిత’.సామాజిక కోణాన్ని ఆవిష్కరించిన కథలుమానవజీవితంలోని విభిన్న సామాజిక కోణాలను కథలరూపంలో ఆవిష్కరించారాయన. ఇప్పటివరకు ఆయన రాసిన డెబ్భై కథలూ సమాజాన్ని పరిశీలించి, పరిశోధించి, అనుభవపూర్వకంగా అవగతం చేసుకున్న అంశాలే.తన అన్నగారు చిదానందమూర్తి స్ఫూర్తితో బాల్యం నుంచే కథారచన చేయడం ప్రారంభించారు రామకృష్ణ. 1965లో ఆయన రాసిన తొలి కథ ‘ద్వేషించుకున్న పండితులు’ బాలబంధు మాసపత్రికలో వెలువడింది. 1966లో ‘దేశానికి కానుక’ కథ ప్రజామత పత్రికలో వచ్చింది. అప్పటినుంచీ ఆయన రాసిన కథలన్నీ ఆంధ్రజ్యోతి, నవ్య వీక్లీ, ఈనాడు, ఆంధ్రప్రభ, ఇండియాటుడే లాంటి పలు పత్రికల్లో వెలువడ్డాయి.17కథలతో 2001లో వెలువడిన ఆయన తొలి కథాసంపుటి ‘కథాంజలి’, 16 కథలతో 2011లో వెలువడిన ‘అడపా రామకృష్ణ కథలు’ మలి సంపుటికాగా, నలభై కథలున్న ‘దేశమేగతి బాగుపడునోయ్‌’ సంపుటి త్వరలో రాబోతోంది.

‘‘నీతి నిజాయితీలే మానవ మనుగడకు మూలస్తంభాలు’’ అంటారు రామకృష్ణ.‘‘ఒకప్పుడు మనుషులు నిజాయితీపరులుగా పేరు పొందడానికి ఎంతో తపన పడేవారు. అందుకోసం జీవితాంతం ఆ మార్గంలోనే నడచేవారు. కానీ ఇప్పుడు అవినీతి, లంచగొండితనం, దానవత్వం, స్వార్థం అణువణువునా జీర్ణించుకున్నాయి. విలువలు పతనమయ్యాయి. వాటినే వస్తువులుగా తీసుకుని అనేక కథలు రాశా, రాస్తున్నా’’నంటారు ఆయన.సొంతింటి కల నెరవేర్చుకునేందుకు పైసా పైసా కూడబెట్టి రియల్‌ ఎస్టేట్‌ చేతిలో మోసపోయిన ఒక సామాన్యుడి దీనగాథ ఆయన రాసిన ‘అవినీతి పడగ నీడలో’ కథ. నేటి ఆసుపత్రుల ధనదాహాన్ని ఎత్తి చూసే కథ ‘ప్రాణం ఖరీదు’. టెస్టులు, ఆపరేషన్ల పేరుతో రోగిని చావుకేక పెట్టించిన అమానవీయతకు దర్పణం పట్టే కథ. మరోకథ ‘కర్మణ్యే వాధికారస్తే’ అనారోగ్యంతో ఉన్న భార్యను కోల్పోయిన వైద్యుడి నిర్లక్ష్యం, ధనాశను చాటిచెబుతుంది.పూజించే తమ గురువు మోసగాడని తెలిస్తే ఆ విద్యార్థుల మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పే కథ ‘గురుసాక్షాత్‌’.

నలుగురికీ మేలుచేసేవాడికి మనుగడలేకుండా చేసేందుకు కోర్టుకీడ్చితే, ఆ వేదన భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి న్యాయస్థానం అనుమతి కోరిన ఒక వృద్ధుడి కథ ‘ఆహుతి’. పిల్లల్ని చూసి భయపడే తల్లిదండ్రుల దుస్థితిని కళ్ళకుకట్టే కథ ‘దుర్దశ’. పనిప్రదేశంలో డబుల్‌ మీనింగ్‌ భాష భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేసిన ఒక ఉద్యోగిని కథ ‘డబుల్‌ మీనింగ్‌’. మానవ సంబంధాలను, బంధుత్వాలను తమ స్వార్థానికి వినియోగించుకునే నేటితరం యువత నైజాన్ని వెల్లడించే కథ ‘ఆతిథ్యం’.