పరిశోధనాత్మక రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పింగళి చైతన్య.ఫిదా చిత్రంలో ‘ఊరుకోదు..ఊసుపోదు...’ అనే హిట్ సాంగ్‌తో గీత రచయిత్రి గా ఖ్యాతిపొందారు .ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పుష్కరకాలంగా ఆమెది చురుకైన పాత్ర.స్ర్తీల కోణంలో చరిత్ర రచన ఆమె ప్రత్యేకత.. సమానత్వం కోసమే ఆమె పోరాటం.సమాజంలో ఎక్కడ అణచివేత జరిగినా సిద్ధాంతాలు, ఆంక్షల చట్రాలకు అతీతంగా స్పందించి తన మద్దతు తెలియజేస్తారు పింగళి చైతన్య.సాహిత్యాధ్యయనం తో మానవ సంబంధాలు మెరుగుపడతాయంటున్న ఆమె ఇంటర్వ్యూ
జాతీయజెండా రూపశిల్పి, స్వాతంత్ర్య సమరయోధులు పింగళి వెంకయ్య మా తాతగారు.మాది విజయవాడ. మా నాన్నగారు పింగళి దశరథరామ్. ‘ఎన్‌కౌంటర్’ పత్రిక సంపాదకులు. ఆ పత్రిక నిర్వహణ క్రమంలో రాజ్యహింసకు బలయ్యారు.మా అమ్మ సుశీల. నాకు ఇద్దరు తమ్ముళ్ళు అన్వేష్, దశరథరామ్. నందిగామ కె.వి.ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. కాలేజీ మ్యాగ్‌జైన్‌కి ఎడిటర్‌గా ఉంటూ కవితలు రాసేదాన్ని. కాలేజీలో ఉన్నప్పుడు విద్యార్థి సమాఖ్యలో పనిచేశాను. హైదరాబాద్‌లో బి.ఎస్సీ ఎలక్ర్టానిక్స్ పూర్తిచేశాను. ఇంటర్మీడియట్ తర్వాత విపరీతంగా సాహిత్యం చదవడం ప్రారంభించాను. శ్రీశ్రీ మహాప్రస్థానం, చలం మైదానం చదివి చాలా ప్రభావితురాలినయ్యాను. చలం సాహిత్యం పూర్తిగా చదివాను.
పరిశోధనాత్మక రచనచిట్టగాంగ్ విప్లవ వనితలు
నేను రాసిన పరిశోధనాత్మక చారిత్రక రచన ‘చిట్టగాంగ్ వీరవనితలు’.2014లో ఈ పుస్తకం వెలువడింది. ఈ పుస్తకం ఒక థ్రిల్లర్ నవలలా ఉంటుంది. 11 మంది వీరవనితల గురించి ఈ పుస్తకంలో రాశాను. ఈ పుస్తకానికే 2016లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి యువ పురస్కారం లభించింది. ఈ పుస్తకం నేపథ్యం చెప్పాలంటే, నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సూర్యసేన్ గురించి చదివాను. 1920లో సూర్యసేన్ బ్రిటీష్‌వారిపై పోరాటం చేయడానికి ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ (ఐ.ఆర్.ఎ) స్థాపించారు. స్ర్తీలను బలహీనులుగా భావించి వారిని ఐ.ఆర్.ఏ లో చేర్చుకోలేదు. కానీ చివరకు బాగా చదువుకున్న, వితంతువులైన స్ర్తీలే ఈ సాయుధపోరాట దళంలో చేరి వీరవనితలుగా చరిత్ర సృష్టించారు.
ఈ పోరాట ఉద్యమంలో చేరారు. అలాంటివారిలో మొదటితరం వీరవనిత, సాయుధపోరాటంలో అమరురాలైన తొలి మహిళ ప్రీతిలత. బాంబులు తయారు చేసిన మొదటి మహిళ కల్పనాదత్. వంద సంవత్సరాల క్రితమే స్ర్తీలు ఈ విధంగా గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించారు. జండర్‌కు అతీతంగా ఎన్నో కష్టనష్టాలకోర్చి అండర్‌గ్రౌండ్‌లో పనిచేశారు. చిట్టగాంగ్‌ను విముక్తిచేసి, 1947కు ముందే మన జాతీయ జెండాను అక్కడ ఎగురవేశారు. నేను ఈ చరిత్రను అధ్యయనం చేస్తున్న సమయంలోనే ‘నిర్భయ’ సంఘటన జరిగింది. దాంతో స్ర్తీల గొప్పతనం, వారి ధైర్యసాహసాలు ప్రపంచానికి తెలియజేసేందుకు చిట్టగాంగ్ ఉద్యమంపై పరిశోధన ప్రారంభించాను. ప్రెగ్నెన్సీతో ఉండగానే బెంగాల్, చిట్టంగాంగ్ ప్రాంతాలన్నీ తిరిగి పరిశోధించి, సమాచారం సేకరించి ఈ పుస్తక రచన చేశాను.
కథలు
ఇప్పటిదాకా 15 కథల వరకూ రాశాను. మచ్చుకు చెప్పాలంటే, మారిటల్ రేప్ గురించి ‘ఏమో’ అనే కథ రాశాను. శ్శశానంలో నివసించే కాటికాపరికి పుట్టిన ఒక చిన్న పిల్లాడి మనస్తత్వాన్ని తెలియజేసే మరో కథ ‘చీకటి కాలిన రాత్రి’. ప్రతిరోజూ పగలూ రాత్రీ కాలుతున్న శవాలమధ్య తిరిగే ఆ పిల్లాడి మనస్తత్వాన్ని ఆ కథలో ఆవిష్కరించాను. ఈ కథ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. ఇటీవలే ‘మనసిజ విల్లు’ అనే కథ కూడా వచ్చింది. దేన్నైనా నేను జండర్ పర్స్‌పెక్టివ్‌లోనే చూస్తాను. ‘మనసులోని వెన్నెల’ నా కథల సంపుటి కూడా వెలువరించాను.