చాలా రోజుల నుంచే నన్ను ఒంటరితనం ఆవరించి ఉంది. నేనే గమనించలేదు. ఎందరితోనో మాట్లాడుతున్నాను. ఎందరినో కలుస్తున్నాను. సభలకు సమావేశాలకు అటెండ్ అవుతూనే ఉన్న. మా బంధువుల ఇళ్లకు వెళుతున్న. ఫ్రెండ్స్ ఇళ్ళకు వెళుతున్న. సామూహికంలో ఒక నిర్వచించలేని ఒంటరితనం.ఎందుకో ఎవరూ సరిగా లేరనిపిస్తున్నది. అందరూ మనస్ఫూర్తిగా నవ్వడం లేదనిపిస్తుంది.
ఆ నవ్వు లోపల ఏదో దాస్తున్నరనిపిస్తుంది. ఆ నవ్వు అర్థతాత్పర్యాలు వేరనిపిస్తుంది. నా మనసు ఆ దాయబడిన నవ్వులను డీకోడ్ చేసి భాష్యం చెప్తుంది ప్రతిసారి, అందుకే ఈ ఒంటరితనం. అసలు చాలా రోజులుగా నా మనసు బందీ అయినట్టపించింది.. కాదు బందీ చేయబడింది.ఎందుకలా.. అందరిలా నవ్వుతున్నవు కదా తింటున్నవు కదా.. ఒంటరినని ఎందుకు అనిపిస్తుంది? ఏమో మొన్న ఒక ఫ్రెండ్ చెప్పింది, తన సైకియాట్రిస్ట్ ఫ్రెండ్ అందంట, ‘ముస్లిం ఏరియాల్లో కుప్పలుగా వస్తున్నరు హాస్పిటల్స్‌కు’ అని. ఎందుకు అనడిగా ఆశ్చర్యంగా, ఇదొక కొత్తకోణం. ‘ఎందుకేంటి ముస్లిం స్త్రీలు చాలా అభద్రతకు గురవుతున్నరని అర్థం. వాళ్లు ఒంటరిగా ఫీలవుతున్నరా.. లేక జీవితం అభద్రతగా తయారైందా తెలియదు. కానీ ముస్లిం పేషేంట్స్ ఎక్కువగా వస్తున్నరని ఆమె ఆ ఏరియాలో క్లినిక్ తెరిచింది.
వారంలో ఇదివరకు ఒకసారే వెళ్ళేది, ఇప్పుడు రెండు మూడు సార్లు వెళ్తుందంట.’ఇంకా కొంచెం డిస్ట్రబ్ కావడం.. ఎందుకిలా అన్నీ చుట్టేస్తున్నయి. ఎందుకిలా ఒంటరివాళ్ళమవుతున్నం..? అసలు ఎప్పుడు తను బందీ అవడం ప్రారంభమైంది? ఏమో..! బహుశా తను గుర్తించలేదు కానీ చాలా కాలం క్రితమే అయుంటుంది.తను తన కొలీగ్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని చెపితే ఇంట్ల ఎవరూ ఒప్పుకోలేదు. పైగా తిట్లు.. కొట్టడానికి రావడం.. ఆ ఇంటి ఆవరణలో పుట్టి పెరిగిన నా మనసు పువ్వులా నలిగి పోయింది. నేను అనుకున్నది జరగనందుకు కాదు, అసలు ఒక మతం మీద మరో మతం వాళ్ళకున్న ద్వేషం చూసి.. భరించలేకపోయాను. కేవలం ప్రేమించినందుకు మనుషులను చావు దాకా ఎందుకు తీసుకువెళ్తున్నరో.. మతం మనుషులను ఎందుకు గుడ్డివాళ్లను చేస్తుందో తెలియదు..? జీవితం వెనక్కు వెళ్లదు, పోనీ అక్కడే ఆగిపోదు కూడా.. ముందుకే. కనుక తను ఏదోలా ఒక దగ్గర మళ్లీ జీవించడం ప్రారంభించింది. అప్పుడు ప్రారంభమైంది బహుశా నా మనసుకు ఒంటరితనం.