పాత వాక్మేన్లో పెట్టిన కేసెట్లోని టేప్‌లా బుర్రలోని ఆలోచనలన్నీ చిక్కుబడిపోయాయి. విడిపోయేమోనని పెన్సిల్ చెవిలో పెట్టి తిప్పుకున్నాను.కొలిమిలా ఎండ.ఏ వీధి నుంచి నడిచెల్లినా మాంసం ఉడికే మసాలా వాసనల ఆదివారపు మధ్యాహ్నం.
నేను మాత్రం ఊరి చివర ఉంటాను. ఏవో రెండూళ్ళ మధ్య అక్రమ సంబంధం కలిపే లూప్ లైన్ లాంటి రోడ్లో. ఆ రోడ్, హైవే కన్నా నాలుగు కిలోమీటర్లు పొట్టి. బయల్దేరిన ఊరు, వెళ్ళాల్సిన ఊరు తప్ప మధ్యలో ఉండే బోర్డులు వచ్చాయంటే వచ్చాయి వెళ్ళాయంటే వెళ్ళాయన్నట్లుండే సరికి వాటి పేర్లు ఎక్కువ మందికి గుర్తుండవు.సరిగ్గా అక్కడుంటాను నేను.
మా రియలెస్టేట్ వెంచర్, రోడ్ మీదే ఉందన్న భ్రమకలిగించే హోర్డింగ్ నీడలో చెమట్లు కక్కుతూ బ్రోచర్లు పైకెత్తి పట్టుకుని దుమ్మురేగ్గొట్టుకుంటూ వెళ్ళిపోతున్న కార్ల వైపు చూపిస్తూ ప్రయాసపడుతుంటాను. కార్లో వెళ్ళే వాళ్ళు కూల్‌గా కనిపించాలని నిక్కర్లేసుకుని వెళ్తుంటే మండుటెండలో నిలబడే నేను మాత్రం అవసరం లేకపోయినా టక్కేసి టై కట్టి అరిస్టోక్రటిక్ లుక్‌ని అమ్ముతుంటాను.ఎండలో నిలబడ్డా రంగు తగ్గకపోవడానికి నేనేమైనా ఎడ్వటైజ్మెంట్ హోర్డింగ్ మీద మహేష్ బాబునా?‘‘ఏనాడు నడచినావూ.. ఈ ఎడారులలోన..సలలిత ఆరామసీమలనెగానీ..ఏనాడు తలజూపితి ఈ ప్రచండపుటెండకు..అలగు మాణిక్య కాంతులకుగానీ..’’వాల్తేర్ క్లబ్‌కి చీమకుర్తి నాగేశ్వర్రావుగా పేరుబడ్డ మేనమామ అప్పలస్వామి చిన్నప్పుడెప్పుడో నేర్పిన పద్యాలు అప్రయత్నంగానే ఎండిన పెదాల మీద మెదిలాయి.
‘‘సరైన డూటీ, జీతం ఎటూ లేవు... ఇలా కాకిలా కర్రిగైపోతూ ఏం ముఖం పెట్టుకుని నా కూతుర్ని అడుగుతున్నావ్రా?’’ అని మామయ్యడిగినప్పుడు ‘‘ఆ కాకి ముఖమే’’ అన్నానని తల్చుకుని తల్చుకుని నవ్వుతుంది చందు.‘‘ఈ ఏడు అయినా సెటిల్ అవ్వు బావా... పెళ్ళి చేసుకుందాం. నా సేలరీ కూడా ఓ ఐదు వేలు పెరుగుతాది. సరిపోతాది’’ అంది చందు ఆ మధ్యెప్పుడో కాసేపు నిశ్శబ్దంగా నోరేసుకుపడి పోవడానికి ముందు.సెటిల్ అవ్వడానికి నేను చెయ్యని ప్రయత్నం ఏమైనా ఉందా? వాటర్ బబుల్స్ వ్యాపారం మొదలుపెట్టేను. అది కలిసి రాలేదు. క్రెడిట్ కార్డులమ్మేను. అందులో పెద్ద గ్రోత్ లేదు. కార్ సర్వీస్ సెంటర్లో చేరేను. డ్రైవింగ్ రాదని పదిరోజులకే తీసేసారు. హైద్రాబాద్‌లో కాల్ సెంటర్లో పని చేస్తున్నప్పుడు చందుకి వేరే సంబంధాలు చూస్తున్నారని చేస్తున్న పని మానేసి వైజాగొచ్చేశాను, రాజధానిలా.