జీవకోటిలో ఆలోచించగల అదృష్టం, నోరు తెరచి మాట్లాడగల అదృష్టం ఉన్నది మనిషికి మాత్రమే. ఆ నోటితోనే మన పుణ్యభూమిలో ఎందరో మహనీయులు ఎన్నో గొప్ప విషయాలు చాటి చెప్పారు. పొరుగువారికి ప్రేమను పంచమని ఆపన్నహస్తం అందించమని ఎలుగెత్తి చాటారు. కానీ ఇప్పుడు చాలామందికి నోరు పారేసుకోవడంతప్ప ఆపన్నహస్తం అందించడం తెలియదు. కానీ ఈ కథలో ఒక నోరులేని దివ్యాంగుడు ఏం చేశాడంటే

బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ అనంతపురం స్టేషన్‌ చేరుకుంది.అప్పటికే అక్కడ అంబులెన్స్‌, మెడికల్‌ స్టా్‌ఫ్‌ రెడీగా ఉన్నారు.రాత్రి పదకొండు గంటలు. బాగా వర్షం పడుతోంది. ఆ జోరువర్షంలోనే పేషెంట్‌ని బోగీలోంచి స్ర్టెచర్‌మీద దింపారు.ఆరుపదులున్న ఆ పేషెంట్‌ వెంట అతడి భార్య, మరో యువకుడు ఉన్నారు. అంబులెన్సు హాస్పిటల్‌ చేరుకోగానే, సిబ్బంది రోగిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. రోగి వెంట వచ్చిన యువకుడు తన ఐడికార్డు చూపించగానే, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిట్‌ చేసుకున్నారు. రోగి భార్య నాగరత్నాన్ని పిలిచి క్లినికల్‌ హిస్టరీ ప్రిపేర్‌ చేశారు.నాగరత్నంగారు చాలా దుఃఖపడుతున్నారు. యువకుడు ఆమెను ఓదార్చాడు. నేనున్నాని ధైర్యంచెప్పాడు. వాళ్ళబ్బాయికి ఇన్ఫార్మ్‌ చెయ్యమన్నాడు. ఇంతలో డాక్టర్లు పిలిచారు.‘‘భావోద్వేగం, తీవ్ర ఒత్తిడికి గురైనందువల్ల డిస్నియా (dyspnea) షార్ట్‌నెస్‌ బ్రీత్‌ (ఆయాసం)కి గురైయ్యాడు మరో బ్లాక్‌ ఏర్పడింది. ఇన్‌టైంలో తెచ్చారుకాబట్టి సరిపోయింది. ఇంకా ఆలస్యం జరిగితే, గతంలో వేసిన రెండు స్టెంట్స్‌కు కూడా ముప్పువచ్చి చాలా సీరియస్‌ అయ్యేది’’ వివరించాడు డాక్టర్‌. ఆ యువకుడికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు నాగరత్నంగారికి. చిన్నవాడైనా చేతులెత్తి దండంపెట్టింది. కంటి తడిపెట్టుకుంది.బయట చెరో బెంచీ మీద రాత్రంతా ఇద్దరూ నిద్రలేకుండా కూర్చున్నారు. నాలుగోఝాము నాటికి చిన్న కునుకుపట్టింది నాగరత్నంగారికి. రాత్రి ట్రైన్లో జరిగిన సంఘటనలు గుర్తుకు రాసాగాయి.

**************************

బెంగుళూరు – కాచిగూడ రైలు బయలుదేరటానికి సిద్ధంగా ఉంది.వరుసగా నాలుగురోజుల పండుగ సెలవులు రావటంతో అన్ని రైళ్ళూ కిక్కిరిసిపోయాయి. బెంగుళూరు వంటి ఐటి సిటీలో అంటే మరిక చెప్పనవసరం లేదు. ‘ఎప్పుడు సెలవులొస్తాయా ఇంటికిపోదామా’ అని ఎదురుచూస్తుంటారు టెక్కీలు. ప్లాట్‌ఫారం వచ్చిపోయే జనాలతో రద్దీగా ఉంది.