పక్షుల కల కల నాదంతో మెలకువ వచ్చింది ఉమకి. బద్ధకంగా లేచి కిటికీ కర్టెన్స్ పూర్తిగా పక్కకు జరిపింది. కొన్ని వారాలుగా కాలుష్యాల ఉరవడి తగ్గి ప్రకృతి పరిశుభ్రపడుతోంది. ప్రపంచమంతటా ఒక అజ్ఞాత శత్రువుతో ఉమ్మడి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రకరకాల యుద్ధాలు చేస్తున్నారు.
భయంతో యుద్ధం, అభద్రతతో యుద్ధం, ఆకలితో యుద్ధం, ఆత్మతో యుద్ధం ...చేతి వేళ్ళను విరుచుకుని మొబైల్ చేతిలోకి తీసుకుని వాట్సాప్‌లో తల్లుల గ్రూప్‌లో గర్భిణుల మెసేజ్‌లు చూసి, వారికి సూచనలు, సలహాల్ని టైప్ చెయ్యసాగింది. ఇంతలో ఫోన్ మోగింది.‘‘డాక్టర్ గారూ! నేను ప్రశాంతిని. గ్రూప్‌లో మెసేజ్ పెట్టాను చూశారా?! నడుములోనూ, పొత్తి కడుపులోనూ నెప్పి వస్తోంది. గంట గంటకీ వాష్ రూమ్‌కి వెళ్ళాల్సి వస్తోంది. రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు. ఇంకో వారానికి గాని తొమ్మిదోనెల రాదు. నెలలవకుండానే పురుడొచ్చేస్తుందా? చాలా భయంగా ఉందండీ’’ ప్రశాంతి కంఠం గద్గదమయింది. వివరాల్ని తెలుసుకుని ఏమి చెయ్యాలో చెప్పింది ఉమ.‘‘తగ్గక పోతే ఏం చెయ్యమంటారు? హాస్పటల్ రావాలంటే ఎలా? ఆటోలు కూడా తిరగడం లేదు. మావారి బైక్ మీద కూర్చుని వచ్చేయొచ్చా? చాలా హాస్పటల్స్‌లో కేసుల్ని తీసుకోవడంలేదని మా ఫ్రెండ్స్ చెప్పారు.
మన హాస్పటల్‌కి మీరు వస్తారు కదా!’’ కంఠంలో ఆదుర్దా.‘‘సాయంత్రానికి సర్దుకోకపోతే ఒకసారి హాస్పటల్‌కి రా. నేను వచ్చి చూస్తాను. బాగా విశ్రాంతి తీసుకో. టెన్షన్ పెట్టుకోక.’’‘‘టెన్షన్ కాక ఏముంటుంది మేడమ్.. హాస్పటల్‌కి వస్తే కొరోనా సోకుతుందేమోనని భయం. మీరు చెయ్యేసి చూసి బిడ్డ, నేను బావున్నామంటే అదో ధైర్యం’’ దిగులుగా చెప్పింది ప్రశాంతి.‘‘ఇదొక కనీ, వినీ ఎరుగని ప్రత్యేక ఉపద్రవం. ఏంచేస్తాం! పరిస్థితికి తగినట్లు నడుచుకోవాలి కదా! కంగారు పడకు.’’‘‘నాకు కొరోనా సోకుతుందేమో, నానుంచి నాబిడ్డకు చేరుతుందేమో అనే భయం నన్ను నిలవనివ్వడం లేదు. అక్కడక్కడ గర్భిణిని కొరోనా వ్యాధి ఉందనే అనుమానంతో హాస్పటల్స్‌లో చేర్చుకోకపోవడం చేత ఆమె మరణించిన సంఘటనల గురించి టి.వి. లో చూస్తూంటే పిచ్చెక్కి పోతోంది మేడమ్’’ ప్రశాంతి ఎంతగా అలజడి చెందుతోందో ఆస్వరం చెబుతోంది.