అతని మనవరాలు పురిటికొచ్చింది. ఆమెకు బుడం అటుకులంటే తగని ఇష్టం. మనవరాలికి ఇష్టంకదా బుడం వడ్లు ఎక్కడైనా దొరుకుతాయేమోనని ఆరా తీయసాగాడతను. రాఘవ ఇంట్లో బుడం వడ్లు దొరుకుతాయని వాళ్ళింటికి వెళ్ళాడు. కానీ రాఘవ ఇంట్లో లేడు. రాఘవ భార్య విశాలను అడుగుదామంటే అతనికేమో మొహమాటం. ఆమెను అడగలేక, మెల్లగా వెనుదిరిగాడతను.
ఆ తరువాత...‘‘అబ్బాయ్ లేడా...?’’ మెల్లగా గేటు తీసి లోపలికి వచ్చి మెట్ల మీద కూర్చుంటూ అడిగాడు సుబ్బరామయ్య.ఎవరా? అని ఎసట్లో బియ్యం వేసేదల్లా చుట్టింట్లోంచి తొంగి చూసింది విశాల.‘‘నువ్వా మావయ్యా.! రా... కూర్చో! ఆయన లేరు మామయ్యా...! ఏదో తగువుంది, తీర్చాలి రమ్మంటే మా అన్నయ్యగారి ఊరు చంద్రపాలెం వెళ్ళారు. రెండు మూడ్రోజులు పడుతుంది వచ్చేసరికి. ఎసట్లో బియ్యం వేసి వస్తాను, కూర్చో...! మంచినీళ్ళు తాగుతావా?’’ మాట్లాడుతూనే ఎసట్లో బియ్యం వేసేసి తెడ్డుతో తిప్పుతూ అరిచినట్టుగా అంది విశాల.
‘‘ఇవాళా రేపూ అందరూ కరెంటు కుక్కర్లే వాడుతున్నారు కదమ్మా? ఇంకా ఎవరు వార్చు తున్నారు?’’ నవ్వుతూ అన్నాడు సన్నగా పొడి దగ్గు దగ్గుతూ.‘‘ఉంది మావయ్యా...! ఎప్పుడో కొన్నాం. పిల్లలొచ్చినప్పుడు తప్ప దాన్ని వాడను. కరెంటు మాత్రం తక్కువ కాలుద్దా ఏంటి? చేలో కొబ్బరి డొక్కలో, పొగాకు మోళ్ళో, కంది కంపో ఏవో ఒకటి ఉంటాయ్ కదా! మేమిద్దరమే కదా అని...’’‘‘అంతేలే! నువ్వన్నదే రైటు’’ అని కాసేపు అటూ ఇటూ చూసి ‘‘సర్లే! పన్లో ఉన్నట్టున్నావ్. చూసుకో! నేను మళ్ళీ వస్తాను’’ అంటూ లేవబోతున్న సుబ్బరామయ్యతో ‘‘ఉండు మావయ్యా... ఇప్పుడే గదా వచ్చావ్? వెళ్ళి ఏం చేస్తావ్? కాఫీ తాగుతావా?’’ అంటూ అతన్ని ఆపేసింది విశాల.
‘‘వద్దమ్మా. తాగే వచ్చాను’’ అని కాసేపు అటూ ఇటూ చూసి,‘‘రత్నం నీకు తెలుసుకదా, మా ఆఖరమ్మాయి. కావలిలో ఉంటోంది. దాని కూతురికి ఏడో నెల. పురుటికి తీసుకొచ్చింది అమ్మాయి. నాన్నా ఒకసారిరా, పది రోజులుండి వెళుదువు గానీ... అని రత్నం ఒకటే గొడవ. నేనూ పెద్దవాణ్ణి అయిపోయాను. ఎక్కడికీ తిరగలేక పోతున్నాను. ముందు ముందు ఈ మాత్రమైనా తిరగ్గలనో లేదోనని, కాలూ, చెయ్యీ బాగా ఆడుతున్నప్పుడే వెళ్ళి రావాలని సరేనన్నాను. మీ అత్తయ్య మనవరాలి కోసమని ఏదో వండే పనిలో ఉంది. ఏమీ తోచక, నాలుగడుగులు వేస్తే కాస్తంత కాళ్ళయినా సాగుతాయని ఇటు వచ్చాను’’ అని అంతలోనే,