ఎప్పుడూ మౌనంగాఉండే ఒక ఎలుకకు ఓ రాత్రి ఉన్నట్లుండి ఓ సందేహం కలిగింది.‘ఈ మనుషులు కొండను తవ్వి ఎలుకను పట్టడానికైనా శ్రమిస్తారు కానీ ఎలుకను తవ్వి కొండను పట్టడానికి ఎందుకు ప్రయత్నించరు’ అని. ఈ సందేహాన్ని ఎవరు తీరుస్తారా అని కలుగునుండి బయటపడితన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
తలమీద గడియారంలేని మనిషిని వెదికే క్రమంలో కొన్ని సంవత్సరాలు ప్రయాణించి, చివరికి హిమాలయ పర్వత సానువుల్లో ధ్యానంలో ఉన్న ఒక సాధువుని కనుగొంది. ఆయన కళ్లు తెరిచేవరకు అలాగే మోకరిల్లి తర్వాత వినయంగా నమస్కరించి తన సందేహాన్ని వ్యక్తపరిచింది.కొండల్లోకి దిగుతున్న సూర్యుని వెలుతురు తెల్లని ఆయన పొడవాటి గడ్డం మీద బంగారుకాంతిలో మెరుస్తున్న ఆ సాయంత్రపు చివరి సమయంలో... ఎలుక వేసిన ప్రశ్నకు సాధువు ఉలిక్కిపడలేదు కానీ ఆసక్తి పడ్డాడు.‘వ్యర్థ ప్రయత్నానికి సామెతగా కొండను తవ్వి ఎలుకను పట్టాడు అంటారు. కానీ ఎలుకను తవ్వి కొండను పట్టడమేంటీ? ఈ ఎలుక తనను ఆట పట్టించడంలేదు కదా’.. అనుకుంటూ దాని ముఖంలోకి పరిశీలనగా చూసాడు. సూర్యుని చివరికాంతి హిమపర్వతాల్లోకి దిగిపోయాక ఒక్కసారిగా కమ్ముకున్న పరిసరాల నిశ్శబ్దంలో ఆయనకు దాని కళ్ళలో జిజ్ఞాసతో కూడిన వెలుతురేదో కనిపించింది.
ఈ రాత్రి ఎలుక చెప్పబోయే కథను వినడానికి తన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఆసక్తిగా సిద్ధమవుతున్నట్లు అనిపించింది.నిశ్శబ్దంగా వీచిన మంచు తెమ్మెర తన ముఖాన్ని తాకి ముందుకు వెళ్తున్న ఆ సమయంలో ఆయన ఎలుకని అడిగాడు.‘ఎలుకను తవ్వి కొండను పట్టడమేంటీ? అయినా ఎందుకు పట్టాలి?’‘ఎందుకు పట్టాలంటే..’ అని ఒక్క నిమిషంపాటు సాధువు తల వెనుక భాగాన దూరంగా పర్వతాల పైభాగంలో చీకటి కమ్ముకోబోతున్న ఆకాశంవైపు చూస్తూ -‘మీ పురాతన మానవుడు, మా పురాతన ఎలుక చేసిన ఒక ఆసక్తికరమైన ప్రయాణాన్ని తెలుసుకోవడం కోసం’ అంది ఎలుక. అప్పుడే దాని గొంతులోంచి పారవశ్యమేదో బయటికి ప్రవహించడం మొదలుపెట్టింది.‘ప్రయాణమా? అయితే తెలుసుకోవాల్సిందే. కానివ్వు’ అని తియ్యగా మూతలు పడుతోన్న కనురెప్పల్ని మూసుకొని, ధ్యానముద్రలో కూర్చొని, దృష్టినంతా ఎలుక పారవశ్యపు