సంఘ సేవంటే చెవికోసుకుంటుందామె. చాలా యాక్టివ్. తమ ఫ్లాట్స్‌లో సేవా సంఘానికి ఆమే అద్యక్షురాలు. అలా ఒకానొకరోజు వరద బాధితుల సహాయకార్యక్రమం చేపట్టింది ఆమె. అందరూ సేకరించి తెచ్చిన రకరకాల వస్తువులన్నింటినీ తమ ఫ్లాట్‌లోనే సెల్లార్‌లో డయాస్‌మీద వేలం వేసిందామె. అందరికంటే ఎక్కువ విలువైంది తన వంతుగా సహాయం చెయ్యడం ఆమెకు ఇష్టం. అందుకే ఆమె తన మెడలో మంగళసూత్రాలు తీసి వేలంపాటకు పెట్టింది?!! అప్పుడు.....

************************

‘‘ఎలక కన్నమంత ఇల్లు కట్టి అందులో ఏనుగుల్ని తెచ్చి కట్టెయ్యమంటే ఎలా?’’అన్నయ్య ఇంటిముందు డోర్‌ దగ్గర నిలబడి మర్యాదగా డోర్‌బెల్‌ కొట్టబోతున్న నాకు వదిన మాటలు కొంచెం గట్టిగానే వినిపించాయి.‘అమ్మో...! వాతావరణం వేడిగా ఉన్నట్లుందే!’ అనుకుంటూ ‘బెల్‌ కొట్టడమా, మానడమా’ అని ఆలోచిస్తున్న నాకు అన్నయ్య కంఠం అంతకన్నా గట్టిగా వినిపించింది.‘‘నువ్వేమైనా అనుకో, అది మటుకు నువ్వు ముట్టుకోడానికి వీల్లేదంతే...’’‘వదినని ఏది ముట్టుకోవద్దంటున్నాడు అన్నయ్య...?’ నాలో కుతూహలం పెరిగిపోయి బెల్‌ కొట్టాను. లోపల మాటలు ఆగిపోయాయి. వదిన వచ్చి తలుపు తీసింది. కళ్ళు తడితో, ముక్కు ఎర్రబడి ఉంటుందనుకున్న వదిన మొహం మామూలుగానే కనిపించింది. ‘అంటే, సమస్య అంత తీవ్రమైంది కాదా?’’ అనుకుంటూ ‘‘ఆలస్యమైందా వదినా నేను రావడం?’’ అంటూ లోపలికి అడుగుపెట్టాను.

నా చేతిలో ఉన్న చిన్న బ్యాగ్‌ చూస్తూ, ‘‘ఏం తెచ్చావు?’’ అంది వదిన ఆసక్తిగా. ‘‘నా దగ్గర ఏముంటాయి వదినా! చిన్నవైపోయిన పిల్లలబట్టలు నాలుగుజతలూ, నావి రెండూ పోలియెస్టర్‌ చీరలునూ..’’ అన్నాను కాస్త సిగ్గుపడుతూ.వాళ్ళ ఫ్లాట్స్‌లోవాళ్లందరూ కలిసి పెట్టుకున్న సేవాసంఘానికి వదినే ప్రెసిడెంటు. ఫ్లాట్స్‌లోనూ, బయటా కూడా ఏ పనైనాసరే అందరినీ కలుపుకుని, చాలా బాగా ఆర్గనైజ్‌ చేస్తుంది వదిన. స్వార్థంలేకుండా, నిష్పక్షపాతంగా తన ఖాళీ సమయాన్నంతా ఈ సంఘం పనులకే వినియోగిస్తున్న వదిన ప్రయోజకత్వానికి అందరూకూడా చాలా మెచ్చుకుంటారు. అన్నయ్య ఈ అఖ్ఖర్లేని పనులు వదిన చేస్తున్నందుకు మధ్యమధ్యలో విసుక్కున్నా అందరూ వదినని మెచ్చుకోవడం చూశాక, తను కూడా ఏమీ అనడం మానేశాడు.

ఇప్పుడు కూడా వదిన వరదబాధితుల సహాయార్థం విరాళాలు వసూలు చేస్తోంది. అందుకోసం ఎవరికి ఏవి వీలుంటే అవి ఇమ్మని అడిగింది. కొంతమంది డబ్బూ, ఇంకొంతమంది బట్టలూ, మరికొంతమంది వండుకోడానికి సామానులూ.....ఇలా ఎవరికి తోచినవి వాళ్ళు ఇస్తున్నారు. నా వంతుగా నేను కూడా పిల్లలకి చిన్నవైపోయిన బట్టలూ, ఎంతకీ చిరగని రెండు పాలిస్టయర్‌ చీరలూ తీసుకు వచ్చాను. అందరూ ఇచ్చినవన్నీ చూసి వాళ్లందరికన్నా కాస్త ఎక్కువ ఉండేట్టే ఇస్తూ ఉంటుంది వదిన. అందుకే వదిన ఇలాంటివాటికి ఏమిస్తుందో, ఎంత ఇస్తుందో చివరిదాకా తెలీదు.