ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? యథారాజా తథా ప్రజ అన్నారు కదా, బీర విత్తనం నాటితే బీరపాదే పుడుతుందిగానీ, ఆనప్పాదు పుడుతుందా? ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తననుబట్టే బిడ్డల తీరుతెన్నులు, వాళ్ళ బుద్ధులు రూపు దిద్దుకుంటాయిగానీ, వాళ్ళకేమైనా అతీతశక్తులు అబ్బుతాయా? కానీ ఈ కథలో మాత్రం అంతా రివర్సే! ఒక తండ్రి తన కొడుకుని ఆదర్శంగా తీసుకుని అతడినే ఇమిటేట్‌ చేశాడు. ఫలితంగా ఆ ఇంట్లో ఏం జరిగిందంటే.............

************************

ఎయిర్‌పోర్టు లోపలి నుంచి బయటకు రాగానే ఎదురుగా కనబడిన క్యాబ్‌ ఎక్కి అడ్రస్‌ చెప్పి పోనివ్వమన్నాడు శశాంక్‌. కంపెనీ పని మీద అమెరికావెళ్ళి ఆరునెలల తర్వాత తిరిగొస్తున్నాడు.అతను ఎన్నాళ్ళనుంచో చూస్తున్న అవకాశం, దీప్తి తన జీవితంలోకి రాగానే వచ్చింది. ఎంతో సంతోషంగా ఉండాల్సినవాడు, చాలా ఆదుర్దాతో ఉన్నాడు. తను వస్తున్నాడని దీప్తి ఎదురుచూస్తూ ఉంటుందని తెలుసు. కానీ, ప్రస్తుతం అతను కూర్చున్న క్యాబ్‌ ఆమె దగ్గరకు కాకుండా, తన తల్లిదండ్రులున్న ఇంటివైపు ప్రయాణిస్తోంది.ఇంతలో అతని సెల్‌ఫోన్‌ మోగింది. ఆన్‌ చేసి ‘‘హలో’ అన్నాడు. అటునుంచి దీప్తి.‘‘ఇప్పుడే కారెక్కాను. ముందు ఒకసారి మా పేరెంట్స్‌ని కలిసి వెంటనే వచ్చేస్తాను’’ అన్నాడు శశాంక్‌.ఆమెకు అది ఆశాభంగమే! ‘‘అదేమిటి?’’ అని ప్రశ్నించింది.‘‘వచ్చి చెబుతా ప్లీజ్‌...’’ అన్నాడు శశాంక్‌.‘‘నీ ఇష్టం’’ విసురుగా సెల్‌ ఆఫ్‌ చేసింది దీప్తి.

అతనికి అర్థమైంది దీప్తి అలిగిందని. అయినా అతను పెద్దగా పట్టించుకోలేదు.అతని ఆలోచనలన్నీ తల్లిమీదే. ఇప్పుడెలా ఉందో? తండ్రి ఫోన్‌లో విషయం చెప్పిన దగ్గర్నుంచి పదిహేనురోజులుగా ఆందోళన, అసహనంతోనే గడిపాడు శంశాక్‌. కానీ, పనికి అంతరాయం కలగకుండా తనలో తనే తమాయించుకుంటున్నాడు. అందుకే రాగానే మొదట తల్లిని చూడాలని బయల్దేరాడు.తను అమెరికాకి వెళ్ళేటప్పుడు పరిస్థితి అంతా బాగానే ఉంది.కానీ ఇప్పుడిలా....దాదాపు గంట తర్వాత కారు అతడి ఇంటిముందు ఆగింది. తనతో తెచ్చుకున్న పెద్ద సూట్‌కేసు కిందకుదించి దాన్ని తోసుకుంటూ గబగబా లోపలికి వెళ్ళాడు.తలుపులు తీసే ఉన్నాయి. లోపలికి అడుగుపెట్టడంతోనే ‘‘అమ్మా.... అమ్మా...’’ అని పిలుస్తూ తల్లి గదిలోకి వెళ్ళబోయాడు.