‘‘క్యూట్ ఫేస్’’‘‘బ్యూటిపుల్ స్మైల్’’‘‘ప్రొవోకింగ్ స్ట్రక్చర్’’‘‘ఐ లవ్యూ డార్లింగ్’’ఫేస్బుక్ చెక్ చేస్తున్న అపూర్వకి పక్కనే కాలేజ్‌మేట్ నీరజ ఉండడంతో ఎంబ్రాసింగ్‌గా ఉంది. ఇద్దరూ విద్యానగర్‌లోని ఆంధ్రమహిళా కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఒకేకాలనీలో ఉంటున్నందుకు ప్రతీరోజూ సాయంత్రాల్లో కలుసుకుంటూ కులాసాకబుర్లు చెప్పుకుంటారు. ఇవాళకూడా కాలేజీ అయినతర్వాత కాసేపు ఇంట్లో ఫ్రెషప్ అయి అపూర్వ దగ్గరికి వచ్చింది నీరజ. అప్పటికే తన లాప్టాప్లో ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తోంది అపూర్వ.
‘‘ఏంటే చూస్తున్నావ్?’’ అంటూ చొరవగా కంప్యూటర్ స్క్రీన్‌మీద ఓరకంటితో ఓ లుక్కేసింది నీరజ. ఆ తర్వాత– ‘‘కామేష్, రాజు, సుకుమార్, సుదర్శన్...’’ పేర్లన్నీ వరుసగా చదువుతూ ‘‘ఎవరే వీళ్లంతా?’’ అడిగింది అమాయకత్వం ప్రదర్శిస్తూ.‘‘మరీ అంత అమాయకత్వం నటించకే. ఫేస్బుక్ అకౌంట్ ఉంటే, ఇదిగో ఇలా ప్రతీ అనామకుడూ కాళ్లకి అడ్డంపడుతుంటాడు. ఇంత చిన్న విషయం నీకు తెలీదా?’’ అడిగింది అపూర్వ.‘‘ఎలా తెలుస్తుందమ్మా? నేనేమైనా ఫేస్బుక్ అకౌంట్ తెరిచానా ఏంటీ?’’ గొణిగింది నీరజ. ఇదే విషయం ఇంతకుముందు చాలాసార్లు వారిమధ్య చర్చకు వచ్చింది. ‘‘ఏం? నువ్వూ ఫేస్బుక్ అకౌంట్ స్టార్ట్ చేయొచ్చుకదా!’’ అని అడిగేది అపూర్వ.
ఆడదానిగా పుట్టినందుకు ప్రపంచంలో బాధలన్నీ తనకే సొంతమన్నట్టు, ఆ మాటకే నైరాశ్యం ప్రదర్శిస్తూ, ‘‘ఇప్పటికే ఉన్న కష్టాలు చాలవని ఇక కొత్తగా ఫేస్బుక్ వేధింపులు కూడానా? అంత సాహసం చేయలేనే’’ అనేది నీరజ.‘‘అంటే, ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా సాహసమేనా?’’ అర్థం కానట్లు చూసేది అపూర్వ. ఆ చూపులకే రెట్టించిన ఉత్సాహంతో తనకు తెలిసినవీ, తెలియనివీ ఎన్నో విషయాలు కలగలిపి, ఫేస్ బుక్కయి ఇక్కట్లపాలయ్యేవాళ్ల కథనాలు వరుసగా చెప్పుకొచ్చేది. ‘‘ఆధునికమహిళవి, అమ్మమ్మలా మాట్లాడకు’’ అని ఆమె వాగ్ధాటికి ఆనకట్టవేయాలనిపించినా, ‘తా పట్టిన కుందేలుకు మూడేకాళ్లన్నట్టు’ వాదించే ఆమెతో గెలువలేనని భావించి ఓ శ్రోతలా మిగిలిపోయేది అపూర్వ.