‍వినదగునెవ్వరు చెప్పిన...అన్నారు పెద్దలు. ఎవ్వరు ఏం చెప్పినా విజ్ఞులకు అందులో నేర్చుకోదగిన గొప్ప విషయాలు కనిపిస్తాయి. చెప్పేవాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, తనకన్నా తక్కువస్థాయివాళ్ళు కావచ్చు, తెలివితక్కువవాళ్ళు కావచ్చు, వాళ్ళ మాటల్లోనూ మనకు ఉపయోగపడే గుణపాఠాలో, తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకునే విషయాలో ఖచ్చితంగా ఉంటాయి. ఈ కథలో కూడా నివేదిత ఆ విషయాన్నే గుర్తించింది. అదేంటటే...

 

 ‘‘నీ పనిలో నువ్వు కనపరిచే నైపుణ్య ఎదుటివారికి నచ్చకపోతే వారికోసంచేసే ఆ పనినుంచి తప్పుకోవడం నీ తక్షణకర్తవ్యం’’ డైరీలో రాసుకున్న ఆ కొటేషన్‌ చదువుకుంటూ తనలో తన మధనపడసాగింది నివేదిత.ఎప్పుడో రాసుకున్న ఆ వాక్యాలను ఇప్పటికీ ఆచరించలేని తన అసమర్థతకు తనమీద తనకే అసహ్యం కలిగింది. ‘గొప్పపదాలను, వాక్యాలను అందరూ కోట్‌ చేస్తారు.

 

 

వాటిలోని నీతిని, సూక్తిని అమలుపరిచే నిక్కచ్చితనం మాత్రం కొందరికే ఉంటుంది. తనలాంటి పనికిమాలినవాళ్ళు వాటిని ఆచరణలో పెట్టలేక నజ్జుగుజ్జులాడుతారు. తనలాంటి పిరికిపందలకి ఇలాంటి సూక్తుల్ని సేకరించే అర్హతలేదు.అలాంటప్పుడు ఎందుకీ సేకరణ! డైరీలో పేజీలను పరాపరా చించేయబోయి ఆగిపోయింది నివేదిత. ఆచరించనంత మాత్రాన మంచిమాటలను మననం చేసుకోకూడదనేమీ లేదుకదా! ఆచరించే అవకాశం అందరికీ కుదరకపోవచ్చు’ తనని తానే సమాధానపరచుకునే ప్రయత్నం చేసింది.ఎందుకో, అది అంతరాత్మను మభ్యపెట్టుకునేందుకు చేసే యత్నంలాగానే అనిపించింది. అసహనంగా తల విదిల్చి పనిలో పడదామనుకున్న నివేదితకు అదిసాధ్యపడలేదు. బలవంతాన కంప్యూటర్‌ స్క్రీన్‌మీద దృష్టిసారించినా మనసుమాత్రం చేయాల్సిన పనిమీద లగ్నం కాలేదు. పదే పదే ఇందాకటి సంఘటన తలపుల్లో మెదిలి అశాంతికి హేతువైంది.కళ్ళు మూసుకుని కూర్చున్నచోటే విశ్రాంతిగా వెనక్కివాలింది.

*********************************

‘‘ఇంకెప్పుడూ ఇలాంటి పొరబాట్లు దొర్లకుండా చూసుకోండి. ఎన్నేళ్ళు సర్వీస్‌ చేశామన్నది ముఖ్యంకాదు. పనితీరులో ఎంతటి పరిణతి సాధించాం అన్నదే ముఖ్యం. చేస్తున్నపనిలో అంకితభావం లేకపోతే ఇలాంటి తప్పులే జరుగుతాయి. ఈ విషయమై మరోసారి నాచేత పాయింట్‌ ఔట్‌ చేయించుకోకండి. మీరిక వెళ్ళొచ్చు’’ తలవాచేలా చీవాట్లు తిన్న తరువాత మేనేజర్‌ క్యాబిన్‌లో నుంచి బయటకు వచ్చింది నివేదిత.ఉబికి వస్తున్న కన్నీటిని కనురెప్పల మాటున అణచేసి, ఏమీ జరగనట్టు మామూలుగా ఉండడం ఎంత అసాధ్యమో ఆమెకు అనుభవపూర్వకంగా తెలిసొస్తోంది. తన ఆక్రోశాన్నంతా బయటకు వెళ్లగక్కాలన్నంత బాధగా ఉందామెకి గుండె బరువు దిగిపోయేలా భోరున ఏడవాలనిపిస్తోంది.