ప్రశాంతి హాస్పిటల్ లోపలికి అడుగుపెట్టాడు శివరాం.హాస్పిటలంతా రోగులతో, వాళ్ళకి సహాయంగా వచ్చినవాళ్ళతో కిటకిటలాడుతోంది. ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా నీరసం వచ్చింది శివరాంకి. ఒక్కక్షణం వెనక్కి వెళ్ళిపోదామా అనిపించింది. వెనక్కి తిరిగాడు కూడా.కానీ.., షాక్ కొట్టినట్లు ఆగిపోయాడు. అతని భార్య స్వాతి మాటలు గుర్తొచ్చాయి.
‘‘ఈ రోజు హాస్పిటల్కి మీరు వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టే’’ స్వాతి కోపంగా అరుస్తోంది.తేరుకున్నాడు శివరాం. ‘‘అమ్మో!...’’ అని మళ్ళీ వెనక్కి తిరిగి లోపలి జనాన్ని తోసుకుంటూ అతికష్టం మీద రిసెప్షన్ దగ్గరకి చేరుకున్నాడు.అతన్ని చూసి పలకరింపుగా నవ్వింది రిసెప్షనిస్ట్.‘‘టోకెన్ ఇస్తారా?’’ అడిగాడు శివరాం.మళ్ళీ నవ్విందామె అందంగా. ‘‘మీకు టోకెన్ ఎందుకుసార్? లోపలి పేషెంట్ రాగానే మీరెళ్ళండి’’ అంది. డాక్టరుకి, శివరాంకి ఉన్న స్నేహం గురించి ఆమెకు తెలుసు.‘‘తప్పు, నా కన్నా వాళ్ళంతా ముందువచ్చారు. వాళ్ళని ఇబ్బందిపెట్టడం నాకిష్టంలేదు’’ అన్నాడు శివరాం.‘‘అదికాదు సార్, చూశారుగా ఎంతమంది జనం ఉన్నారో...’’‘‘ఫర్వాలేదు వెయిట్ చేస్తాను’’ అని అప్పుడే ఖాళీ అయిన కుర్చీలో కూర్చున్నాడు.
లోపల డాక్టర్ ప్రశాంత్ రోగులను పరీక్షిస్తూ మధ్యమధ్యలో ఫోన్కాల్స్కి జవాబిస్తున్నాడు. దాదాపు నాలుగుగంటల తర్వాత కూడా, అంతబిజీలో ఉన్నా, అతని ముఖంలో ఎక్కడా అలసటలేదు. నిర్మలంగా చిరునవ్వుతో అడిగేవాళ్ళకి ఓపిగ్గా సమాధానాలు చెబుతున్నాడు.అదే మాట బయట శివరాం ప్రక్కన కూర్చున్నతను కూడా అన్నాడు. ‘‘ఈ కాలంలో ఇలాంటి డాక్టరునని చూడలేదు. ఎంత సహనం? ఆయనతో మాట్లాడితేనే మనకున్న రోగాల్ని మర్చిపోతాం’’.శివరాం తలత్రిప్పి చూశాడు. తనకన్నా దాదాపు అయిదేళ్ళు ఎక్కువ వయసు ఉన్నతను తనని ఉద్దేశించే అంటున్నాడు.