ఆ రోజు గురు పౌర్ణమి. తామిరిపల్లి బాబా గుడిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల రాక పెరుగుతోంది.అరిచేతుల్ని తీక్షణంగా చూస్తూ గర్భగుడిలోకి పోకుండా, గుడి మండపంలో ఆందోళనగా కూర్చున్నాడు కెప్టెన్ ప్రతాప్.‘‘వాడ్ని చూడండి. దేవుడికి దంణ్ణం పెట్టుకోకుండా ఎలా కూర్చున్నాడో’’ అంది ప్రతాప్ తల్లి భర్తతో బాధగా.
‘‘నీ మొక్కు తీర్చడానికి గుడికొచ్చాడు. సంతోషంచు. వాడేదో మానసకింగా అప్సెట్ అయ్యాడు. తరచి తరచి అడిగి వాడికి తలనెప్పి తెప్పించకు’’ భార్యకు సర్దిచెప్పాడు రామ్మూర్తి.‘‘మిలట్రీ నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి వాడ్ని గమనిస్తున్నా. అంతకు ముందు కంచంలో ఏది వేసినా చేతినిండా కలుపుకుని నోటి నిండా తినేవాడు. అలాంటివాడు...’’‘‘దానికెందుకే అంత ఇదైపోతావు. వాడికిష్టమైయినవి చేసిపెట్టు. వాడే లొట్టలేసుకుంటూ తింటాడు..’’‘‘అది కాదండి. ప్రాణాలతో బయటపడ్డానన్న సంతోషం లేకుండా ఈ మౌనవ్రతం ఏమిటండీ? దేవుడంటే వాడికి ఎంతో భక్తి. ఉదయం లేవగానే అరిచేతిలో శ్రీ రాసుకుని కళ్ళకి అద్దుకునేవాడు. అలాంటిది ఎప్పుడూ ఆ చేతుల్నే చూసుకుంటూ వాడిలో వాడే ఏదో గొణుక్కుంటున్నాడు..’’‘‘నువ్వు చిన్నప్పుడు చేసిన అలవాట్లు షష్ఠి పూర్తి వరకూ కొనసాగాలంటే ఎలా?’’‘‘మిలట్రీలో ఏం ఘోరం జరిగిందో, ఏమిటో? మసీదునుంచి నమాజ్ సైరన్ వినబడితే చాలు, యుద్ధ సైరన్ విన్నట్టుగా వాడి చేతులు ఒణుకుతున్నాయి.
గదంరగోళం పడిపోతున్నాడు. మొహంలో చెమటలు పడుతున్నాయి. పోనీ మన డాక్టరికి ఒకసారి చూపిద్దామా?’’‘‘గొప్ప గొప్ప మిలట్రీ డాక్టర్లు వాడికి ట్రీట్మెంటు చేసి పంపారు. వాడి ఆరోగ్యం విషయంలో ఆందోళన పడకు. మెల్లిగా వాడే మనుషుల్లో పడతాడు.’’‘‘అందుకేగా భగవంతుడి మీద భారం వేసి, వాడికి నచ్చచెప్పి గుడికి తీసుకొచ్చా.’’‘‘సరేలే, ఈ కబుర్లకేం గాని వాడ్ని దర్శనానికి తీసుకెడదాం పద.’’తల్లీ, తండ్రీ తన గురించి ఏమననుకుంటున్నారో కెప్టెన్ ప్రతాప్‌కి తెలుసు. ఒక్కోసారి తన బాధ వాళ్ళతో పంచుకోవాలనిపిస్తుంది. మరుక్షణం ఎలా? ఏమని? పంచుకోవాలి అని కూడా అనిపిస్తుంది. తన ఆలోచనలు తెలుసుకుంటే వాళ్ళు అసహ్యించుకుంటారేమో అన్న అనుమానం. జరిగిన సంఘటనలు చేతుల్లో చక్రాల్లా గిరగిర తిరిగాయి ప్రతాప్లో.