నన్ను చూడగానే ‘‘బాబాయ్....!’’ అంటూ పరుగెత్తుకుంటూ వచ్చి నా హృదయానికి హత్తుకుపోయింది మౌనిక చిన్నపిల్లలా.మౌనిక ఆప్యాయతతో నన్నలా పిలుస్తుందేతప్ప నేను ఆమె బంధువును కాదు.మౌనిక ఒక బిడ్డకు తల్లి. వృత్తిరీత్యా డాక్టర్ కూడానూ. మౌనిక స్పర్శతో సుదూరంలోవున్న నా కూతురు గుర్తుకువచ్చి చలించిపోయాను.
‘‘ఎంతకాలమైంది బాబాయ్ మిమ్మల్నిచూసి?’’ అంటూ నా భుజంమ్మీద తలపెట్టి కన్నీళ్ళు పెట్టుకోసాగింది. నా కళ్ళూ చెమర్చాయి. అవి ఆవేదనాశ్రువులో, ఆనందభాష్పాలోగానీ, లిప్తకాలం మౌనంగా ఉండిపోయాను. అవును దాదాపు పదిసంవత్సరాలు దాటిందికాబోలని మనసు లెక్కలేసుకోసాగింది. పెదవులు విచ్చుకున్నాయి. నన్ను హత్తుకుపోయిన మౌనిక వీపును తట్టాను ప్రేమగా.మౌనిక కడకొంగుతో కళ్ళుతుడుచుకుంటూ సాదరంగా తన ఇంట్లోకి ఆహ్వానించింది.నా చేతులను తన చేతుల్లోకి తీసుకుని కళ్ళకద్దుకుంది. గతంలో నా ఎదపై చెరగని ముద్రవేసిన ఇలాంటి దృశ్యమే గుర్తుకు రాసాగింది. ఆరోజు ఆదివారం.ఉదయం పేపరు చదువుతూ హాల్లో కూర్చున్నాను.
ఎవరో గేటు తీసిన అలికిడి! పేపరు టీపాయ్ మీద పడేసి గుమ్మం తలుపులు తెరిచాను.‘‘సార్ టు లెట్ బోర్డు చూసి వచ్చాం’’ అన్నాడతను వినయంగా.నేను ఎగాదిగా చూశాను అతనికేసి. బహుశా పాతికేళ్ళుంటాయి. అతని వెనకాలే ఒక అమ్మాయి.‘‘ఎవరెవరుంటారు ఇంట్లో’’ అడిగాను.‘‘మేమిద్దరమే సార్. నా పేరు మురళి. ఈమె నా గర్ల్ ఫ్రెండ్ మౌనిక’’‘‘నీ వైఫ్ కాదా!’’ అంటూ ఆశ్చర్యంగా అడిగాను. అమ్మాయి కాలేజీ విద్యార్థినిలా ఉందితప్ప, పెళ్ళైన యువతిలా కనబడలేదు.‘‘కాదు సార్, జస్ట్ ఫ్రెండ్. మా చదువులింకా పూర్తి కాలేదు. మౌనిక ఇంటర్ పాసైంది. మెడికల్ ఎంట్రన్స్‌కు ప్రిపేర్ అవుతోంది. నేను ఎల్.ఎల్.బి. మొదటి సంవత్సరం చదువుతున్నాను’’