‘‘మీరు నా తరుపున కోర్టుకొచ్చి ‘సాక్ష్యం’ చెప్పమని అడగటానికి వచ్చాను’’రామనాథం గారింటికొచ్చిన నర్మద అడిగింది,‘‘సాక్ష్యమా’’ అన్నారు రామనాథంగారు.ఆయన తీరుచూస్తే అందుకాయన సుముఖంగా లేరని అనుమానం వచ్చింది నర్మదకు.
‘‘మిమ్మల్ని నేనేం అబద్ధపు సాక్ష్యం చెప్పమనటం లేదు. మీరు ఆఫీసు మేనేజర్. నేను అదే ఆఫీసులో ‘స్టెనో’. నాపై జరిగిన ఒక దురాగతానికి మీరు ప్రత్యక్ష సాక్షులు. కోర్టుకొచ్చి ఆ నిజం చెప్పి నాకు సాయం చేయమంటున్నాను. అది నాకు సాయం చేయటమే కాదు, ఒక పౌరునిగా మీ ధర్మమని మనవి చేస్తున్నాను. మీరు కాదనరనే నమ్మకంతో వచ్చాను’’ అంది నర్మద.అంతలోనే, ఆ వరండాలోకి వచ్చిన రామనాథంగారి భార్య జానకమ్మ నర్మదను చూస్తూనే ‘‘బాగున్నావా నర్మద’’ అని పలకరించారు ఆప్యాయంగా.లేదు ఆంటీ ఏమీ బాగాలేను అంది నర్మద.ఆ సమాధానం వింటూనే జానకమ్మ నర్మదను తేరిపారచూసింది.
‘అవును, ఈ నర్మద తానెరిగిన నర్మదలా లేదు. ఎప్పుడు నవ్వుతూ కనిపించే, ఆ మోమంతా, గజిబిజిగా ఉంది’ అనిపించింది.‘ఏం జరిగింది?’ అన్నట్లు చూస్తోన్న జానకమ్మతో రామనాథంగారు, ‘‘మరేంలేదులే ఏవో ఆఫీసులో ఒత్తిళ్ళు’’ అన్నారు.జానకమ్మ లోపలికి వెళ్ళిపోయింది. ‘‘అలా కూర్చో మాట్లాడుదాం’’ అన్నారు రామనాథంగారు కుర్చీచూపిస్తూ.నర్మద కూర్చుంది.‘‘చూడు నర్మద ఒక సంఘటనో, సమస్యో మనల్ని తాకినప్పుడు ఆవేశంతో కాక, ప్రశాంతంగా ఆలోచించాలి కదా’’ అన్నారు రామనాథం.
‘‘ఇందులో ప్రశాంతంగా ఆలోచించాల్సిందేముంది, అతడు నన్ను చాలా నీచంగాను, పాశవికంగానూ వశపరచుకునేందుకు, నా శరీరాన్ని ముట్టుకుని నన్ను అవమానపరిచాడు. ఆ క్షణాన మీరు అతని ఛాంబర్లోకి రాకుండా ఉన్నట్లైతే, అతడు నా శీలాన్ని నాశనంచేసి ఉండేవాడు. ఆ దుశ్చర్యకు అతడికి శిక్షపడేలా చర్య తీసికోవాలనుకోవటం ఆవేశమెలా అవుతుందో చెప్పండి’’ అడిగింది నర్మద.