మనం సమాజాన్ని ప్రేమిస్తే, తిరిగి మనకు ప్రేమనే పంచుతుంది. మనం సమాజంమీద పగబూనితే సమాజమూ మనమీద పగబూనుతుంది. గులాబీ విత్తనం నాటితే పూసేది గులాబీపువ్వే కదా! ‘తమలపాకుతో నువ్వొకటంటే, తలుపుచెక్కతో నేనొకటంగా’ అన్నచందంగా ఈ కథలో బ్రహ్మం విషయంలో అదే జరిగింది. కన్నుకు కన్ను, రక్తానికి రక్తం, సన్మానానికి సన్మానం! ప్రతీకారాన్ని ఎదుర్కోక తప్పదని ఋజువైపోయింది బ్రహ్మానికి!!
సంక్రాంతి, దసరా, దీపావళిలాంటి సంప్రదాయ పండుగలే మనందరికీ తెలుసు.ఆపైన జెండా పండుగ, రిపబ్లిక్ దినోత్సవంలాంటి జాతీయ పండుగలు కూడా తెలుసు. కానీ, బ్రహ్మంగారింట్లోమాత్రం రంగరంగవైభవంగా జరుపుకునే పండుగ ఒకటుంది. చుట్టుపక్కలవాళ్లు, చుట్టాలు పక్కాలు అదిరి, బెదిరిపోతున్నా ఆ పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అతడేమాత్రం వెనుకాడడు. మోమాటపడడు. రాకరాక ఇంటికొచ్చిన చుట్టాలు జన్మలో మళ్లీ ఈ గడప తొక్కమంటూ పూనకాలొచ్చినట్లు తమపైతామే ఒట్టువేసుకునిమరీ బ్రహ్మం చూపులకి, చేతలకి అందనంత దూరంగా పరుగులుతీసేలా ఆ పండుగ తీరుంటుంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారీ ఈ పండుగబారినపడ్డారు బ్రహ్మంగారి ఒక్కగానొక్క చెల్లెలు సునీత, ఆమె భర్త చలపతిరావు.
ఇక చూడండీ... వారి వేదన.రారండోయ్... ఆ వేడుక మనమూ చూద్దాం! ‘‘ఎప్పుడూ శాలువాయేనా? మనింటికొచ్చినందుకు బావగారు సిగ్గుపడుతున్నారన్నయ్యా. అత్తా రింటికెళ్లావు. బట్టలేం పెట్టారంటూ అడిగే ఆఫీస్ కొలీగ్స్ ముందు దర్జాగా తలెత్తుకోలేకపోతున్నారు. దయచేసి ఆ సన్మానాల శాలువాలిచ్చి మళ్లీ మళ్లీ ఆయన్ని అవమానపరచకు’’ బీరువాలో శాలువాల దొంతరని తేనెపట్టు కదిపినట్టు కదుపుతూ కావాల్సిన ఒకట్రెండు మంచి శాలువాల్ని ఎంచుతున్న బ్రహ్మం, తన చెల్లాయి సునీత మాటల్ని అస్సలు పట్టించుకోలేదు.
ఆ మాటలు తనను ఉద్దేశించి కావనే నిర్లక్ష్యాన్ని చేతల్లోనే వ్యక్తీకరిస్తూ తన పనిలో తను నిమగ్నమయ్యాడు బ్రహ్మం.‘‘అన్నయ్యా, నీకే చెప్పేది. ఈసారి బావగారికీ, నాకూ శాలువాలు పెట్టకు. నా మాట వినకుండా మొండికేసి మరీ ఆ శాలువాలు ఇచ్చినా ఇంటిదాకా మోసుకెళ్లకుండా నిరసనగా ఇక్కడే ఈ ఇంట్లోనే వదిలివెళ్తాను’’ ముక్కుపుటాలదరుతుండగా ఆవేశంగా అంది సునీత. అప్పటికి బ్రహ్మం వెనక్కితిరిగి ఒక్కక్షణం తీక్షణంగా సునీత వంక చూస్తూ ‘‘అసలేమైంది నీకు?’’ అని అడిగాడు తాపీగా.