కాలేజీ రోజులనుంచీ వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకే కంపెనీలో వేరు వేరు చోట్ల ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు...అన్ని ముచ్చట్లూ తీరాయి. ఇప్పుడు ఒకేచోట బాస్‌–అసిస్టెంట్‌ హోదాల్లో వాళ్ళు పని చేయబోతున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళు ప్రాణస్నేహితులే. కానీ భార్యలు కాదు కదా! వాళ్ళ స్నేహం వర్థిల్లాలంటే భార్యలు కూడా సహకరించాలిగా! ఈ కథలో జరిగింది అదే. కానీ ఆకస్మికంగా ఒకసారి ఊహించని ఘటన జరిగింది. అదేంటంటే....

******************************

సెల్‌ రింగవుతుంటే తీసి ‘హాయ్‌ దిలీప్‌’ అంటూ మిత్రుణ్ణి ఆప్యాయంగా పలకరించాడు ప్రవీణ్‌.‘‘కంగ్రాట్స్‌. ప్రమోషన్‌మీద నువ్వు మా బ్రాంచి మేనేజర్‌గా వస్తున్నావని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. నిజమేనా?’’‘‘ఔను. నువ్వు విన్నది నిజమే. ఇప్పుడే హెడ్డాఫీస్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. నేనే నీకు ఫోన్‌ చేయాలనుకుంటున్నాను. అంతలో నువ్వే చేశావు. నా ఆప్తమిత్రుడివి ఈ శుభవార్త ముందుగా నీకే చెప్పాలి’’ అన్నాడు ప్రవీణ్‌.‘‘థాంక్స్‌ రా. ఇది నీకే కాదు. నాకూ గుడ్‌ న్యూసే. ఇక మీదట నా ఫ్రెండ్‌ దగ్గర పనిచేసే భాగ్యం నాకు కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నాడు దిలీప్‌.‘‘అదంతా నా మీద నీకున్న అభిమానం. ఇంతకీ నువ్వెలా ఉన్నావ్‌? మీరంతా బావున్నారు కదా! ఈ మధ్య పని ఒత్తిడివల్ల ఫోన్‌ చెయ్యలేకపోయాను.‘‘డోంట్‌ వర్రీ. మేమందరం చాలా బావున్నాం అది సరే, ఇంతకీ నువ్వు ఎప్పుడు వవస్తున్నావ్‌?’’.‘‘రెండు మూడు రోజుల్లో రిలీవై వచ్చేస్తాను. ఈ శుభవార్త మా చెల్లాయికి చెప్పు’’.‘‘ఎందుకు చెప్పను. ఆనందంతో గంతులేస్తూ మరీ చెబుతాను’’.

‘‘బై. ఉంటాను మరి. ఇక్కడ మా ఆఫీసులో నాకు గుడ్‌ విషష్‌ చెప్పడానికి స్టాఫంతా క్యూ కట్టుకుని నిలబడ్డారు’’.‘‘ఇదుగో నీకు ముందే చెబుతున్నాను. నువ్వు ఈ ఊరు రాగానే సరాసరి మా ఇంట్లోనే దిగాలి సుమా! నేనిప్పుడు ఇదివరకున్న ఇంట్లో లేను. ఇల్లు మారాను. నా ఎడ్రస్సు ఇప్పుడే నీకు ఎస్సెమ్మెస్‌ చేస్తాను. ఇక్కడ మా ఇంట్లో రెండ్రోజులు ఉన్నాక నీకు కేటాయించిన బంగ్లాకి షిఫ్ట్‌ అవొచ్చు. ఏమంటావ్‌? ఇన్నాళ్ళూ దూరంగా ఉండటంవల్ల ఫోన్లో ఊసులాడుకోవడమేతప్ప పర్సనల్‌గా మాట్లాడుకోలేకపోయాం’’ రిక్వస్టు చేస్తున్నట్టు అన్నాడు దిలీప్‌.