డాక్టర్ ధన్వంతరి ఆహ్వానంపై ప్రఖ్యాత మెజిషియన్ మహేంద్ర ఇంద్రజాల ప్రదర్శన చేసేందుకు అక్కడకు వచ్చాడు. కరతాళధ్వనులమధ్య అతడి స్వాగత, పరిచయకార్యక్రమం ముగిసిన తర్వాత వేదికపై నిలబడిన మహేంద్ర తనఎదుట కూర్చున్న ప్రేక్షకులందరినీ పరిశీలనగా చూశాడు. అతని కన్నులు చెమ్మగిల్లాయి. భారంగా నిట్టూర్చాడు.రెండు క్షణాలు గడిచాక,ఆత్మీయులారా! నా ప్రదర్శనకోసం మీరందరూ ఎంతో ఆసక్తితో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ మీకో విషయం మనవి చేస్తున్నాను. రొటీన్‌గా నాకుగా నేనిక్కడ నా విద్యలు ప్రదర్శించను. మీరేది కోరితే వాటినే ప్రదర్శిస్తాను. ఓ.కే. అని అడగడంతో సమాధానంగా మళ్ళీ కరతాళ ధ్వనులు హోరెత్తాయి!
థాంక్యూ, ఇక నా ప్రదర్శన ప్రారంభిస్తాను అంటూ వేదికపైనుంచి క్రిందికి దిగాడు. స్త్రీలు పిల్లలు ఒకవైపు, పురుషులందరూ మరోవైపు ఉన్నారు. ముందుగా స్త్రీలను సమీపించాడు. వారిమధ్యలో ఉన్న ఒకామెను చూస్తూ ‘‘అమ్మా మీరు అందరికన్నా ఎక్కువ ఆసక్తితో ఉన్నట్టు కనబడుతున్నారు. గుడ్ ఎంకరైజింగ్! చెప్పండమ్మా. మీకేం కావాలి?’’ అని అడిగాడు.‘‘నాకా..నాకు.నాకు...’’ తడబడిపోతున్న ఆమెను ఉత్సాహపరిచేందుకు నవ్వుతూ అన్నాడు. ‘‘ఈ క్షణంలో మీకేదైనా పండుతినాలని ఉందా...? అంటే యాపిల్, బత్తాయి, అరటి, సపోటా లాంటివి ఏవైనా..?’’ ఆమె తలాడించింది.
‘‘ఏ పండు కావాలి? యాపిల్...!’’ అందామె.మహేంద్ర వేదికపైకి వెళ్ళి ఒక ఖాళీ ఆకుపచ్చసంచి తీసుకుని అందరికీ చూపించి దాన్ని గాలిలో ఆడించాడు. తర్వాత అక్కడున్న ఒక చెక్కపెట్టెతీసి అందరికీ చూపించాడు. అది ఖాళీగా ఉంది. దానిలో ఆ సంచినివేసి పెట్టెపై నల్లనిగుడ్డకప్పి అబ్రక దబ్ర..లాంటిదేదో అంటూ దానిచుట్టూ తన మ్యూజిక్హ్యాండ్ను తిప్పాడు! తర్వాత పెట్టె తెరచి లోపలున్న సంచి తీశాడు. ఆ సంచి బరువుగా వేలాడుతోంది. అందులోంచి ఒక పండు తీసాడు. అది యాపిల్’!.