‘‘గురువులకు ప్రణామాలు! స్వామీ, చాతుర్వైద్య ధర్మాల్లోకెల్లా సంక్లిష్టమైనదీ, ప్రామాణికమైనదీ గృహస్థాశ్రమమంటారు కదా. ఈ వైతరిణిని దంపతులిద్దరూ కలిసి సంతోషంగా దాటడం ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో చాలా క్లిష్టమైనదిగానూ, అసంభవంగానూ గోచరిస్తూన్నది.ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని అసూయా ద్వేషాలకతీతంగా దంపతులిద్దరూ జీవితపర్యంతం కలిసిమెలిసి కొనసాగించాలంటే ... వారిద్దరూ ఎలా మెలగాలో సెలవిచ్చి, సకల లోక గృహస్థులకు మోక్షం కలుగుటకు మార్గం చూపించగలరని మనవి.’’ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం ఆవరించింది.ఎప్పుడూ జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో, పేరిన్నికగన్న కళాశాల ప్రాంగణాల్లో, ఉన్నతశ్రేణి వర్గాలకు చెందిన సమూహాల్లో అట్టహాసంగా జరపబడే ఈ వేదికలు, మొట్టమొదటిసారిగా మధ్యతరగతికీ, దిగువ మధ్యతరగతికీ చెందిన వారి కోసం నిర్వహిస్తున్న సభ అది. ఎక్కడా ఇటువంటి ప్రశ్నని ఎదుర్కోని సద్గురు లిప్త పాటు భ్రుకుటి ముడిచి, ప్రశ్న సంధించిన మధ్య వయసు గృహస్థుని ఆపాదమస్తకం పరికించి, చిరునవ్వు లొలికించాడు.
దివ్య తేజస్సూ, స్ఫురద్రూపి, పెదాలపై చెదరని చిరునవ్వుతో, ఎల్లప్పుడూ తన వాగ్ధాటితో, అనర్గళంగా ఆంగ్లంలో చమత్కార సంభాషణ చేస్తూనే తనపై వెల్లువెత్తిన ప్రశ్నల శరపరంపరను ఎదుర్కుంటూ, చిద్విలాసంగా ప్రత్యుత్తరమిస్తున్న సద్గురంటే అందరికీ గౌరవం, పూజనీయ భావం. అతడ్ని ఒక స్వామీజీగా కంటే కూడా ఒక స్నేహితుడిలా, హితుడిలా, ఇంట్లోని సభ్యుడిలా భావిస్తారందరూ.సోషల్ మీడియాతో సమస్త యువతరాన్ని తన వైపు మరల్చుకోవడమే కాకుండా, వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని వారి జీవన విధానంలోని స్థితులను, వృత్తులను ఉదహరిస్తూ, ఉటంకిస్తూ అలవోకగా, తమలపాకు నుండి తొడిమను వేరుచేసినంత సులభంగా పరిష్కరిస్తూ, సర్వరంగాల్లోని వారినీ, సర్వమతాల వారినీ ఆకట్టుకునే చిద్విలాస సుందరమూర్తి సద్గురు.తన చిక్కటి, నల్లటి నయనాలతో నవ్వులు వెదజల్లుతూ... ప్రశ్నని సంధించిన గృహస్థుని క్రీగంట చూస్తూ చెప్పడం ప్రారంభించారు.‘‘నిగూఢమైన ప్రశ్న ఇది. సర్వసంగ పరిత్యాగినైన నన్ను ఈ సమస్యకి పరిష్కారం అడగడం ఎంత వరకు సమంజసం?’’సభంతా నవ్వులతో నిండిపోయింది.‘‘సరే! ఈ ప్రశ్నకి జవాబివ్వడం అంత సులువేం కాదు. అట్లాగే కష్టతరం కూడా కాదు. కానీ, జవాబు ఊరికే అలా చెప్పేస్తే మీ మెదళ్ళలోకి ఇంకించడం కొంచం కష్టం. కాబట్టి ...’’