ఇప్పుడు మనచుట్టూ కనిపిస్తున్నవన్నీ స్ర్తీలపై అత్యాచారాలే. వీటికి అంతూపొంతూ ఉండటంలేదు. అందుకే ‘అత్యాచార భారతం’, ‘రేప్స్‌ ఇన్‌ ఇండియా’ అనే అంశాలపై దేశమంతటా విస్తారంగా చర్చ జరుగుతోంది. ఈ కథలో ఒక చదువుకున్న ఆడపిల్ల కూడా ఇలాంటి వలలో చిక్కుకుంది. కానీ ఆమె భయపడలేదు. లొంగిపోలేదు. ఏడుస్తూ కూర్చోలేదు. తన పరిధిలోనే తెలివిగా ఆలోచించింది. సాహసోపేతంగా ప్రవర్తించింది. ఆమె ఏం చేసిందంటే....

*************

‘‘ఇది రెండువేల పద్దెనిమిదా? లేక పద్దెనిమిది వందల రెండా?’’ హఠాత్తుగా వేసిన తులసిప్రశ్నకు ఉలికిపడి ఆమెకేసి చూసింది ప్రగతి. వాళ్లిద్దరూ కాలేజ్‌ క్యాంపస్‌లో లైబ్రరీ ఎదురుగా ఉన్న గార్డెన్‌లో జనానికి దూరంగా కూర్చుని ఉన్నాడు. తన మనసులోమాట చెప్పడానికి చాన్నాళ్లకు అవకాశం రావడంతో క్లాస్‌మేట్‌ ప్రగతి అక్కడకు తీసుకెళ్లింది తులసి.‘‘ఇంతపెద్ద సందేహం నీకెందుకొచ్చిందే?’’ అంది హేళన రంగరించిన చిరునవ్వుతో ప్రగతి.‘‘నిన్ను చూసి...’’‘‘నేనేమైనా వింత జంతువులాగో పాతరాతియుగం మనిషిలాగో కనిపిస్తున్నానా?’’‘‘నిస్సందేహంగా.నిన్నునువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నిన్ను చూసి నువ్వే మోహించేటంత, ముట్టుకుంటే డాగుపడేటంత అపురూపమైన అందాన్ని నీకు భగవంతుడు ఇచ్చాడు. కాని ఏం లాభం? దాన్ని అడివికాచిన వెన్నెల చేస్తున్నావ్‌.

ఈ వయసులో ఓ బోయ్‌ఫ్రెండూ బాడీగార్డు, ప్రేమ–విరహం, ఎఫైరూ ఎంజాయ్‌మెంటూ, థ్రిల్లూ–గిల్లూ...ఇలాంటివేమీ లేకుండా లైఫ్‌ను చప్పగా గడిపేస్తున్న నిన్ను చూస్తుంటే, కేవలం ఆశ్చర్యమే కాదు, జాలేస్తోంది కూడా!’’‘‘అయ్యోపాపం! జాలంతా ఒలకబోస్తూ ఇలా క్లాస్‌ పీకడానికా నన్నిక్కడకు తీసుకొచ్చింది?’’‘‘కాదు. నువ్వింత రిజర్వ్‌డ్‌గా ఉండడానికి కారణం తెలుసుకుందామని. తెలుసుకుని నీ ఫీలింగ్స్‌ షేర్‌ చేసుకుందామని. ఆ పైన తోచినసలహా ఇద్దామని. కాలంతో మారకుండా ఇలా మడిగట్టుకుని ఈ వసంతాన్ని వృథాచేసుకుంటే ఆ తర్వాత చేజార్చుకున్నదానికోసం బాధపడవలసివస్తుందని హెచ్చరిద్దామని’’‘‘అవసరం లేదు. నా జీవితం నాకు తృప్తిగా హ్యాపీగా ఉంది’’.

‘‘కాదు, నువ్వు అబద్ధాలు చెపుతూ ఆత్మవంచన చేసుకుంటున్నావు. నీ మనస్సాక్షిగా నిజంచెప్పు. నీకు రొమాంటిక్‌ డ్రీమ్స్‌ రావడం లేదూ? కనీసం బాత్‌రూమ్‌లోనైనా నీ లావణ్యానికి మురిసిపోతూ వచ్చీరానీ పిచ్చిపాటలు పాడుకోవడం లేదూ? హేండ్సమ్‌ గైస్‌ నీకేసి ఆరాధాన పూర్వకంగా అదేపనిగా చూస్తుంటే పులకింతలూ గిలిగింతలూ కలగడంలేదూ? ఇవి వయో ధర్మాలూ, మర్మాలూ...! ఉప్పుకారం తింటున్న యౌవనంలో ఉన్న ఏ ఆడపిల్లకైనా ఇలాంటి ఫీలింగ్స్‌ ఉండవంటే నేను ఛస్తే నమ్మను....’’