‘‘కాశీ నుండి బెంగుళూరు వెళ్ళే రైలు సాంకేతిక కారణాలవల్ల నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది’’ప్రకటన విని నేను వెయిటింగ్ రూమ్ వెతుక్కుంటూ వెళ్ళి చతికిలపడ్డాను.ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో తీపి గుర్తులు, మరచిపోలేని చేదు సంఘటనలు, అపరిమితమైన అవమానాలు...వాటన్నింటి కలయికే జీవితం.నాతో ఏడు అడుగులు వేసినందుకుగాను ఆరు దశాబ్దాలు నా కష్టాలన్నీ తన ఇష్టాలుగా తలచి కన్నీళ్ళు కార్చకుండా, క్రుంగిపోకుండా, ఆనందసమయాల్లో అహంకారం, ఆర్భాటాల అంచుల్లోకి వెళ్ళకుండా తనువు చాలించిన జీవిత భాగస్వామిపట్ల చివరి బాధ్యత నిర్వహించడానికి కాశీకి వచ్చా.
తీపిగుర్తులకంటే చేదు అనుభవాలే మననం చేసుకోవటం తేలిక. మా వైవాహిక జీవితంలో ఎందరినో మహానుభావులను కలిశాం. మా కళ్ళముందే ఉన్నతస్థాయికి వెళ్ళినవాళ్ళను, ఆర్థికంగా ఆకాశం అంచులు తాకినవారిని చూశాం. అలాగే అవకాశాలు రాకో, అదృష్టం లేకనో ఎదగలేకపోయినవారు తారసపడ్డారు. వీరందరికీ ఒకవిధంగా ఆప్యాయత పంచింది నా జీవితభాగస్వామి.ఆమె నిష్క్రమణ తన చుట్టాలను, చుట్టూ ఉన్నవాళ్ళను, స్నేహితులు, శ్రేయోభిలాషులను ఎంతగా కలవరపెట్టిందంటే, యాభై సంవత్సరాలక్రితం బళ్ళారిలో మా పక్క ఇంటిలో ఉన్నవారు ఆ వార్త తెలుసుకుని ఎనభైమూడేళ్ళ వయస్సును కూడా లెక్కచేయకుండా 700 కిలోమీటర్లు కారులో వచ్చి నివాళి అర్పించారు.
కీళ్ళనొప్పులతో కుర్చీలకు పరిమితమైన తన ఆడబడుచులు కూడా దూరప్రాంతాల నుండి వచ్చివెళ్ళారు.బళ్ళారిలో అక్షయపాత్రలాంటి వ్యాపారాన్ని భాగస్వామి మాట్లాడిన ఒకేఒక్కమాటతో మనస్థాపం చెంది నేను వదిలేకున్నాగానీ ‘‘ఒక్కసారి ఆలోచించండి’’ అని కూడా ఆమె నన్ను అనలేదు.ముగ్గురుపిల్లలతో వెళ్ళేది వనవాసానికో లేక రాణివాసానికో అని తెలియకుండానే నాతో రైలుఎక్కేసింది.చెన్నపట్నం దగ్గర పల్లెటూరులో పరిచయంలేని వ్యవసాయం చేసినా దానికి కావలసిన పెట్టుబడికోసం, తన ఒంటిమీద ఉన్న కాసినన్ని నగలు ఒలిచి ఇచ్చింది.