తండ్రిపోయి నెల రోజులు కాలేదు. అప్పుడే తల్లికి కన్నబిడ్డల ఒత్తిడి! చేసేదిలేక తను చెయ్యాల్సిన కర్తవ్యం పూర్తిచేసింది. అందరినీ సంతోషపెట్టింది. కానీ ‘పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా...’ అంటూ వేమన కాబట్టి కొడుకుల్ని ఘాటుగా దునుమాడాడుగానీ, ఆ తల్లి మాత్రం అలా చెయ్యలేకపోయింది. కడుపుచించుకుంటే కాళ్ళమీద పడుతుందని గుడ్లనీరు కుక్కుకుని గుట్టుగా ఉండి పోయింది ఆ తల్లి!!
‘‘అయితే ఏం చేద్దామంటావు?’’ అడిగాడు పోలీసు సబ్ ఇన్స్పెక్టరు సత్య.‘‘ఇంక చెయ్యడానికి ఏముంది? ఇచ్చిన కంప్లైంట్ వాపసు తీసుకుంటాం’’ అన్నాడు సత్య స్నేహితుడు శ్రీరామ్.‘‘అలా అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను’’ అన్నాడు సత్య.‘‘మేమిచ్చిన కంప్లైంటే కదా. వెనక్కి తీసుకోవడానికి అబ్జెక్షన్ ఏమిటి?’’‘‘అబ్జెక్షన్ లేదు గాని ప్రొసీజర్ ఉంటుంది కదా’’.‘‘అలాగే, కానీ మన స్నేహాన్ని పురస్కరించుకుని నువ్వు నాకు సహాయం చెయ్యాలి’’.‘‘తప్పకచేస్తాను. నువ్వు నాకు ఫేవర్ ఏమీ అడగటం లేదు కదా. ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకుంటున్నావు. అంతే కదా’’‘‘అవును. నా వైపు నుంచి నేనేం చెయ్యాలో చెప్పు, చేస్తాను’’.‘‘నువ్వేం చెయ్యనక్కర లేదు. అంతా నేనే చూసుకుంటాను. మా సి.ఐకి చెప్పాలి.
ఐతే, వెంటనే ఒప్పుకునే మనిషి కాదుగానీ, అయినా ఫరవాలేదు నేను ఒప్పిస్తాను’’.‘‘చాలా థాంక్స్ సత్యా, ఇలా జరగడం చూసి అమ్మ చాలా బాధపడుతోంది’’‘‘ఏం చేస్తాం? కాలం ఇలా మారిపోయింది. ప్రతిరోజూ మేం ఇలాంటి విచిత్రాలు చూస్తూనే ఉంటాం. అమ్మకు చెప్పు. కాని అసలు విషయం చెప్పకు. బాధపడుతుంది’’.‘‘చెప్పను. అందుకే కదా గుట్టుచప్పుడు కాకుండా కేసు క్లోజ్ చేస్తున్నాం’’.‘‘ఎస్’’‘‘థాంక్యూ వెరీమచ్ సత్యా’’‘‘ఇట్స్ ఓకే’’‘‘ఓకే వస్తాను’’ అని బయల్దేరాడు శ్రీరామ్.
కొద్దిరోజుల తరువాత,‘‘బాబూ ఇల్లు అమ్ముదాం అనుకున్నాం కదా. రేటు వచ్చింది ఓ.కె. చేశాను’’ అంది శ్రీరామ్ తల్లి శివపురం నుంచి ఫోను చేసి.‘‘నువ్వునుకున్న రేటు వచ్చిందా అమ్మా’’ అడిగాడు శ్రీరామ్.‘‘వచ్చింది నాన్నా’’.‘‘అయితే సరే’’ అన్నాడు శ్రీరామ్.‘‘మీ నాన్నగారు చనిపోయి నెలకూడా కాలేదు కదా అని ఆలోచిస్తున్నాను’’.‘‘నాకు అదే అనిపిస్తోందమ్మా’’.‘‘ఎప్పుడైనా అమ్మాల్సిందే కదా నాన్నా’’.‘‘అవుననుకో. కొంతకాలం ఆగి అమ్మితే బావుంటుందేమో’’.