ఒకవైపు భారతదేశం స్వాతంత్ర్యగాలులు పీల్చిన శుభదినం. మరోవైపు తెలంగాణ నేలపై నిరంకుశ మైన అణచివేత. యూనియన్ సైన్యం ఊరూరా జల్లెడపడుతున్న సందర్భం. ఆ సమయంలో ఒక మారుమూల కుగ్రామంలో ఊరుజనం మధ్య మల్లయ్యను పెడరెక్కలు విరిచికట్టేశారు. అతడి నాలుకను, కొండనాలుకను సూదీదారంతో కలిపికుట్టేసి హింసిస్తున్నారు. ఆ ఘోరంచూడలేక అతడిభార్య నేలపైపడి పొర్లాడుతోంది. అప్పుడు....
నిజాంహయాంనాటి హైదరాబాద్ నగరం చుట్టుపక్కలున్న సబర్బన్ ప్రాంతం. ఆనాటి దానిపేరు ‘అత్రాఫ్ బల్దాజిల్లా. అదంతా నిజాంకు నేరుగా ఆదాయం సమకూర్చే ప్రాంతం. ఆ జిల్లాలోని పరిగి తాలూకాలో పిల్లాయపల్లి శివారుగ్రామం చింతలగూడెం. అంతా కలిపితే రెండువందల గడప.6 అక్టోబర్, 1948. సమయం సాయంత్రం నాలుగు దాటింది.ఊరి మధ్య పెద్దరావి చెట్టుకింద దాదాపు ఊరిజనం గుమికూడారు. అందరూ రైతు కూలీలే. దొర గడీకి వంతులవారీ వెట్టి చాకిరికి వెళ్ళాలె. దొర భూములను కాస్తు చేయాలె. ఏమైనా సమయం మిగిలితే, దొరదగ్గర తీసుకున్న తమ కౌలుభూములు దున్నుకుని వ్యవసాయం చేసుకోవాలె. ఎవడైనా ఎదురు తిరుగుతే ఖతం! చెప్పుకోడానికి ఎవ్వడూ మిగలడు.
అలాంటి సమయంలో దిక్కుమొక్కులేని జనానికి ‘‘మేమున్నాం, మీ కన్నీళ్ళు తుడుస్తాం’’ అని పుట్టుకొచ్చి పిడికెడు ధైర్యాన్నీ, స్నేహహస్తాన్నీ అందించింది ‘ఆంధ్రమహాసభ’. తర్వాత్తర్వాత ఆయుధాలిచ్చి వేలాది తెలంగాణగ్రామాల్లో లక్షలాదిమంది రైతుకూలీ జనాల్ని సంఘటితంచేసి వారికి బాసటగా నిలిచింది చరిత్రాత్మక ప్రజాసంస్థ ‘ఆంధ్ర మహాసభ’. చదువురాని బీదాబిక్కిజనం నోట ‘సంగం’గా పేరొందింది. అది దావానంలా నలుచెరగులా వ్యాపించి దళాలు దళాలుగా విస్తరించింది. దేశ్‌ముఖ్‌లు, దొరలు, దేశాయ్‌ల గుండెల్ని దడదడలాడించింది. రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీంరెడ్డి నరసింహారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, నల్లా నరసింహులు తదితర యోధులు, త్యాగమూర్తుల నాయకత్వంలో ఒక ప్రపంచస్థాయి తిరుగుబాటు చేసింది.
జమీన్దార్లు, నిజాం తొత్తులైన దేశ్‌ముఖ్‌లు, వేలమంది జనాన్ని ఊచకోతకోసిన రజాకార్ల, నిజాం పోలీసులతో తలపడి నిర్విరామంగా ఆరేడేళ్ళు చారిత్రక ‘తెలంగాణ సాయుధ పోరాటం’ నిర్వహించింది. దాదాపు 4,500 మంది వీరులు అమరులయ్యారు. లక్షా పదివేల ఎకరాలభూమిని విముక్తంచేసి భూమిలేని నిరుపేదలకు పంచింది ‘సంగం’ అని పిలుచుకునే ‘ఆంధ్రమహాసభ’. 15ఆగస్ట్, 1947న భారతదేశం ఒక స్వతంత్రదేశంగా అవతరించిన తరుణంలో, తెలంగాణనేల, నిరంకుశ నిజాం భయంకరమైన అణచివేతలో నలిగిపోతోంది. భారతదేశంలో విలీనమయ్యేందుకు ధిక్కరించిన నిజాంపై ‘ఆపరేషన్ పోలో’ పేరుతో 13 సెప్టెంబర్, 1948న పోలీస్ యాక్షన్‌ను ఆరంభించింది భారత యూనియన్. అది ప్రారంభమైన నాలుగోరోజునే, అంటే 17 సెప్టెంబర్, 1948న నిజాంను లొంగదీసుకున్న వాస్తవం ఒక చరిత్ర.