కార్తీకమాసంలో ఆనవాయితీగా వచ్చే తుఫానులు, అల్ప పీడనాల మూలంగా పొద్దుట్నుంచీ ఆకాశమంతా మబ్బు పట్టింది. స్కూలు ఆడిటోరియం టీచర్లు, పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులతో ఉత్సాహంగా సందడిగా ఉంది. పిల్లలంతా వెలుగుతున్న ముఖాలతో నదిలో దీపాల్లా కదులుతున్నారు. ఆ టెర్మ్ పరీక్షా ఫలితాలు అందుకుందుకు పిల్లల తల్లిదండ్రులంతావచ్చి వెళ్తున్నారు.
టీచర్ శైలజ పక్కనే నిలబడి అవసరమైనవన్నీ అందిస్తోన్న ఆరవ తరగతి విద్యార్థిని చంద్ర, తన అమ్మ రాకని గమనించి ఆమె దగ్గరకు పరుగెత్తింది.‘‘మీ చంద్ర మదర్ థెరిసా అవుతానని చెబుతుంటుంది. అందుకు తగ్గట్టుగానే అందరికీ సహాయం చేస్తుంది’’ శైలజ మాటలకి చంద్ర తల్లి విమల ముఖంలో గర్వం కనిపించనీయకుండా ఉండేందుకు ప్రయత్నించింది.‘‘అందరితో స్నేహంగా ఉంటుంది. కానీ, తన వస్తువులు పొరబాటున ఎవరైనా తీసుకుంటే గొడవ చేస్తుంది’’ ఉన్న విషయం చెప్పేసింది శైలజ.విమల నొచ్చుకోవటం చూసి, ‘‘ఫర్వాలేదు లెండి, నేను మామూలుగా చెప్పానంతే. తన వయసుకి మించి అవగాహన ఉంది. అన్నట్టు, ఈసారి నవంబరు పద్నాలుగు పండుగ ప్రత్యేకంగా చేస్తున్నాం. మీరు తప్పకుండా రండి’’ నవ్వుతూ ఆహ్వానించింది శైలజ. ఆడపిల్లల కోసం నడుపుతున్న ఆ స్కూలు ప్రిన్సిపాల్ రమాదేవి, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉన్న వ్యక్తి. బాలల దినోత్సవాన్ని ఈసారి పిల్లల తల్లిదండ్రులను కూడా కలుపుకుని ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
స్కూల్లో రకరకాల పోటీలు పెడుతున్నారు. మూడు, నాలుగు తరగతి పిల్లలకి ‘మీకు ఇష్టమైన సంగతులు, ఇష్టం లేని సంగతులు’ రాయండి అని అడిగితే, చాలా మంది పిల్లలు అమ్మ చేసే ఐస్‌క్రీమ్ గురించి, రాత్రి నిద్ర పుచ్చుతూ నాన్న చెప్పే కథల గురించి, అమ్మమ్మ ఊరు వెళ్లటం గురించి రాశారు. పిజ్జా ఇష్టమనీ, సినిమాలంటే ఇష్టమనీ, అమ్మ మొబైల్‌తో ఆడుకోవటం ఇష్టమనీ కూడా రాసుకొచ్చారు.మూడు చదువుతున్న గౌరి నచ్చని విషయాలూ రాసింది. ‘హోమ్ వర్క్ తప్పులు చేసినప్పుడు అమ్మ కోప్పడినా, పక్కింటి అనిరుధ్ వాళ్లింట్లో అంకుల్ తనను ఎత్తుకుని ముద్దు చేసినా నచ్చవని చెబుతూ .. అనిరుధ్ మంచివాడే అయినా వాళ్లింటికి వెళ్లటం మానేశానని రాసింది’.