నీ ఇల్లు యేడనే చిలుకా..!?‘‘నచ్చడం అంటే ఏంటి సెప్పు? నాలుగు రాత్రులు పడుకోవడమా? బాగా సంపాదించి పెడతాడని బతుకంతా వాడికే అతక్కుపోవడమా? మనసు సెప్పాలి.. గుండె పలకాలి... నీకు తెలుసా వాడిలో బమ్మాండమైన కళ ఉంది. వాడు గొంతెత్తి పాడాడా... ఈ పపంచమే ఊగిద్ది... ఏదో జీర ఉంది వాడి గొంతులో. అదేరా నాకు పేనం. ఈడికంటే ముందు ఇద్దరితో పరిచయం ఉంది. కానీ ఈడు.. ’’

**********************

మార్కెట్‌ పంచలో పులిజూదం జోరుగా సాగుతోంది. ‘‘పులులు గెలుస్తాయా? మేకలు గెలుస్తాయా?’’ అని ఆడే సుబ్బులు, శేషయ్య కంటే చుట్టూ చేరినోళ్లకే ఎక్కువ ఆరాటంగా ఉంది. పై పందేలు కాసేవాళ్లు సైతం కళ్లు, పళ్లు బిగబట్టి చూస్తున్నారు. మార్కెట్లో చేపలోళ్లు, కూరగాయలోళ్లు, సోడాలోళ్లు, ఈరిపెన్లు చెక్కదువ్వెన్లు, మొలతాళ్లు అమ్మేవాళ్లు.. బురగంజ, ముంతమామిడి కాయలు, చాపలు, రొయ్యలు అమ్మేవాళ్లు.. కొనేవాళ్లు ఎవరి హడావుడిలో వాళ్లు ఉన్నారు.పంచకు ఎడంపక్కన ముసలయ్యగారి కట్టవను ఆనుకొని సరసి రాజేసిన పొయ్యి మీద సట్టిలో సవురుపక్కెల పులుసు సలసలా కాగుతోంది. ఆ వాసనకు మార్కెట్‌ అంతా ఘుమఘుమలాడుతోంది. సరసికి ఏమవుతాడో తెలియదు గాని జాలిగాడు పొయ్యిపక్కనే కూర్చొని గంజాయి కొడ్తూ ముల్లోకాల్లో తేల్తున్నాడు. రేకుల షెడ్‌ పై స్తంభానికి తగిలించి ఉన్న పంజరంలో చిలుక జామపండు తింటూ ఏవేవో మాట్లాడుతోంది.వీటన్నిటితో సంబంధం లేకుండానే పులి జూదం రంజుగా సాగుతోంది. అరగంట నుంచి సుబ్బులు పెళ్లాం కట్టవ దగ్గర నిలబడి కేకలేస్తున్నా ఆటలోపడి సుబ్బులు అసలు పట్టించుకోవడం లేదు.సరిగ్గా అప్పుడే మాబుగాడు ఎక్కడనుంచి వచ్చాడో వచ్చాడు.

రేకుల మధ్య దోపున్న బారాటి కర్రను తీసుకుని, పంచలో ఓ పక్కన మూటల్లో సర్దినట్లున్న సరసి, జాలి సామాన్లను చెల్లాచెదురు అయ్యేటట్లు కొట్టాడు. ఆవేశం తగ్గక మూటల్లో ఉన్న వాటిని బయటకు లాగి విసిరేశాడు. గుడ్డలు, అద్దం, విబూది, కుంకుమ, గంధం ఉన్న డబ్బాలు, వంకర్లు తిరిగిన కర్ర ... అన్ని చిందరవందర అయ్యాయి. జాలిగాడు తూల్తూ అడ్డం వస్తే వాడి మీదకీ కర్రెత్తాడు. ఆ దెబ్బ తగిలితే తల పగలడం ఖాయం అనుకున్న సుబ్బులు ఒక్క అంగలో ఆటదగ్గర నుంచి లేచొచ్చి మాబుగాడి చేతిలో ఉన్న కర్ర పట్టుకున్నాడు. సరసి భయంతో పరుగున వచ్చి మాబుగాడ్ని వెనక నుంచి వాటేసుకుంది. అయినా మాబుగాడు తప్పించుకొని పొయ్యి మీదున్న సట్టినికొట్టాడు. సట్టి పగిలి పులుసు పొయ్యినిండా పడింది. ఇట్టా కాదని మాబుగాడ్ని సుబ్బులు, శేషయ్య, ఇంకో ఇద్దరు పట్టుకున్నారు. అయినా మాబుగాడు చేతిలో ఉన్న కర్రను పంజరం కేసి కసిగా విసిరేశాడు. అదెళ్లి పంజరానికి గట్టిగా తగిలింది. పంజరం ఊడి కిందపడింది. దాని తలుపు తెరుచుకుంది. ఇదే సందు అన్నట్లు చిలుక ఎగిరిపోయింది.