‘‘ఎక్స్క్యూజ్ మీ!’’ అన్న పిలుపు నన్ను ఉలిక్కిపడి వెనక్కు చూసేలా చేసింది.లేకపోతే నూటనలభై కిలోమీటర్ల వేగంతో వెళుతోన్న రత్నాచల్ ఎక్స్ప్రెస్లోంచి గభాలున దూకేసేదాన్నే!కోపంగా చూస్తున్న నా వైపు, ‘అందుకు సిద్ధంగానే ఉన్నా’ నన్నట్టుగా అతని చిరునవ్వు జవాబిచ్చింది.‘‘ఎవరు మీరు?! ఎందుకు పిలిచారు!?’’ అప్పటివరకూ నాలో ఉన్న ఆవేశం, ఆక్రోశం తమపట్టు సడలించినట్టుగా తోచడంతో ఉక్రోషాన్ని అతనిపై చూపించాను.
తిరిగి అదే చిరునవ్వుతో అతను బదులిచ్చాడు. ‘‘మీరు కాసేపు లోపలికొస్తే నన్ను పరిచయం చేసుకుంటాను’’.నా కోపం మరింతగా హెచ్చింది. ‘‘ఎందుకు రావాలసలు నేను?’’‘‘ఎందుకు రాకూడదు?’’ ఏదో శక్తివంతమైన శతఘ్ని గుండెలను తాకినట్టు అతను ప్రశ్న సంధిస్తాడని నేనూహించలేదు.‘‘ఇదంతా నా పర్సనల్. మీకు అనవసరం’’ అరిచినట్టు చెప్పాను.‘‘ఓకే. అయితే దూకేయండి. నేను ఫొటో తీసుకుంటాను. ఇంత బాగా ఇదివరకెప్పుడూ ఎవరూ ఆత్మహత్యను ఫొటోలో చూపించిన దాఖలాలు లేవనుకుంటాను’’ నిదానంగా చెప్పాడతను.‘‘అసలు ముందు మీరు ఇక్కడినుంచి అవతలకువెళ్ళండి.
నా ఆత్మహత్యను చిత్రీకరించవలసిన అవసరం మీకులేదు’’ మనసులో పొంగుకొస్తున్న దుఃఖాన్ని అతికష్టంమీద కోపంగా మార్చుతుండడం నా గొంతులో నాకే వినిపిస్తోంది.‘‘మరెలా చెప్పండి. పోనీ జస్ట్ ఒక్క ఐదు నిమిషాలు నాకివ్వండి. నన్ను మీతో మాట్లాడనివ్వండి. ఆ తర్వాత మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి’’ అతనికంఠంలో ఓ మార్దవం. ఎదుటివారు తను చెప్పినట్టు చేయగల అయస్కాంత తత్వమేదో ఉన్నట్టుగా అనిపించింది.‘‘ఏం చెబుతారు? ఆత్మహత్య చాలా తప్పు. ఇంత చిన్న వయసులో చనిపోవడం అంతకన్నా పెద్దతప్పు. జీవితం ఎంతో విలువైనది. దాన్ని అర్థంతరంగా ముగించకూడదు. ఇవేగా మీరు నన్ను కూర్చోబెట్టి చెప్పబోయే ప్రవచనాలు!’’ ఆవేశంగా అతన్ని చూస్తూ చెప్పాను.