బంగారుతల్లి వృద్ధాశ్రమం.‘మగవాళ్ళకు మాత్రమే ప్రవేశం!’ఆ బోర్డు చూసి ఆశ్చర్యం కలిగింది. తానెన్నో వృద్ధాశ్రమాలు చూశాడుగానీ, ఇలా మగాళ్ళకు మాత్రమే ప్రత్యేకంగా వృద్ధాశ్రమం నిర్వహించడం అంతులేని ఆశ్చర్యం కలిగించింది. ఆశ్రమం ఆవరణలోకి అడుగుపెట్టీపెట్టగానే దూరంనుంచే నన్నుచూసి లోపలినుంచి ఒక నడివయసు స్త్రీ పరుగున నా దగ్గరకు వచ్చింది.
‘‘ఎవరికోసం వచ్చారండీ’’ వినయంగా అడిగింది.‘‘నా కోసమే’’ చిన్నగా నవ్వుతూ అన్నాను. ‘‘మీ కోసమా?’’ ఆశ్చర్యపోయింది ఆమె.‘‘నేను ఇక్కడే ఉండాలని వచ్చానమ్మా’’ అన్నాను. నా మాట వింటూనే ఒక్కసారే నాకేసి ఎగాదిగాచూసి ‘‘రండిసార్, లోపలకు రండి’’ అంటూ నన్ను రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు తీసుకువెళ్ళింది.ఆఫీసు రిసెప్షన్లో అందమైన యువతి నాజూగ్గా తయారై కూర్చుంది. ఆ అమ్మాయినిచూస్తే కళ్ళు తిప్పుకోబుద్దికాలేదు. అంత అందంగాను, అంతకు పదిరెట్లు వయ్యారంగా తయారై ఉంది. నన్ను చూస్తూనే మర్యాదగా లేచి నిలబడింది ఆ అమ్మాయి.‘‘చెప్పండి సార్! నాన్నగారిని జాయిన్ చేద్దామనుకుంటున్నారా?’’ నమ్రతగా అడిగింది.‘‘కాదు. నేనే చేరాలనుకుంటున్నాను’’ చిన్నగా నవ్వుతూ అన్నాను.‘‘మీరా?’’ కళ్ళింత చేసుకొని ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోయింది.‘‘అవును మేడమ్! సారే జాయినవుతారట’’ నాతో వచ్చిన ఆమె చెప్పింది.
‘‘ఓకే సార్! మీకు గార్డియన్ కావాలి. మీ మంచిచెడ్డలు ఎప్పటికప్పుడు తెలియజేయడానికి మీ వాళ్ళెవరూ లేరా?’’ నాకేసి చూస్తూ కుతూహలంగా అడిగింది ఆ అమ్మాయి.‘‘అందరూ ఉన్నారమ్మా. అందుబాటులో ఉండాలికదా? ఎక్కడో ఊళ్ళల్లో ఉన్నారు’’ అంటూ నా దగ్గర పనిచేసిన అటెండర్ రంగా అడ్రస్ రాసిచ్చాను.మీకేమవుతారు? అన్నట్టుగా చూస్తూ ‘‘ఈయన...?’’ అంది అమ్మాయి.‘‘నా దగ్గర పనిచేసిన అటెండరమ్మా. అందరూ ఉన్నా ఎవరూలేని అనాథనమ్మా నేను’ బోరవిరుచుకుని నిలబడినవాణ్ణి ఒక్కసారిగా డీలాపడిపోతూ బేలగా అన్నాను.‘‘అయ్యో! మీలాంటి వాళ్ళకోసమేకదాసార్ మేమంతా ఉన్నది. మేమే మీ బంధువులమనుకోండి’’ ప్రేమపూర్వకమైన చిరునవ్వురువ్వుతూ అంది అమ్మాయి.