ఉదయం నుండి చదువుతున్న పేపర్నే మళ్ళీ ఒకసారి చేతిలోకి తీసుకున్నదామె. మరోసారి ఆమూలాగ్రంచదవడానికి ప్రయత్నం చేసింది. కళ్ళు అక్షరాల వెంటపరుగులు తీస్తున్నాయన్నమాటే కానీ ఆమె మనసు మాత్రంమనసులో లేదు. అసలామె మనసు స్థిరంగా నిలవడం లేదు.‘‘స్థిరతా నహి నహిరే మానస’’ అన్నట్టుగా వుంది ఆమె స్థితి.
ఇంకో పది నిమిషాలలో అతడు వస్తాడు. తన రాక ఎవరికీ ఆటంకం కలిగించడం ఇష్టం లేనట్లుగా మెల్లమెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ అతనొస్తాడు .. ముందు తలుపు మెల్లిగా తీసి లివింగ్ రూమ్లో ఆమె వున్నదీ లేనిదీ నిర్ధారణ చేసుకుంటాడు. అతను ఎంత మెల్లగా వస్తున్నా అతడి అడుగుల సవ్వడి ఆమె చెవులకు స్పష్టంగా వినిపిస్తూనే ఉంటుంది. అతడు తలుపు తీసుకుని వస్తాడు. అతడి రాకను గుర్తించినట్టుగా అతడి వంక చూసి నవ్వాలి అనుకుంటుంది. పోనీ .. మొహంలోకి నవ్వు కవళికలు తెచ్చుకోవాలి అనుకుంటుంది. కానీ ఏదీ చేయదు.‘ఎందుకిలా?’ తనను తాను చాలాసార్లు ప్రశ్నించుకుంది ఆమె. జవాబు వెతకడానికి కూడా మనసు సహకరించడం లేదు.
దట్టమైన మంచు కప్పుకున్న మల్లెపొదలా వుంది ఆమె మనసంతా.అతడు ముందు గది తలుపు తీస్తున్న చప్పుడు వినిపించగానే ఆమె లేచి పడకగదిలోకి వెళ్లిపోతుంది. మూడంకె వేసి పడుకుంటుంది. ఒక్కొక్కసారి ముసుగు కప్పుకుంటుంది. చాలీచాలని ఆ దుప్పటి మొహం కప్పివేస్తే కాళ్ళను బయట పెడుతుంది, కాళ్ళను కప్పివేస్తే మొహాన్ని బయటకు వెళ్లగొడుతుంది. ఆ దుప్పటి మార్చాలని ఆమె ఎప్పటికప్పుడు అనుకుంటుంది. కానీ ఆమె మార్చదు. మార్చలేదు. అప్పుడప్పుడు కొన్న దుప్పట్లు బీరువా నిండా చాలా వున్నాయి. కానీ ఆమె ఒక్క దుప్పటీ తీయలేదు. దుప్పటి కప్పుకోవడం కూడా అతని చూపుల నుండి తప్పించుకోవడం కోసమేనా?ఏమో ... జీవితం దుస్సహ దృశ్యం అంటే ఇదేనేమో! అతనంటే ఆమెకు చాలా ఇష్టం. శబ్దమూ, అర్థమూ లాగా తామిద్దరూ ఒక్కటే అనుకున్నదామె.
ఒకే పాటకు పల్లవీ, అనుపల్లవీ తామిద్దరమూ అన్నదామె. అతడితో తొలి పరిచయాన్ని ఇష్టంగా గుర్తు చేసుకున్నదామె. అతడిని మొదటిసారి చూసింది పెళ్లి చూపులలోనే. కానీ జన్మజన్మల బంధం ఏదో అతడితో వున్నది అనిపించింది. అతడు కూడా ఆమెను చూడగానే అలాగే అనుభూతి చెంది ఉంటాడు. ఆమెను చూడగానే అతడి కళ్ళు ఆనంద తరంగా లయ్యాయి. ఆల్చిప్పల్లాగా, విశాలంగా విచ్చుకున్నాయి. కళ్ళ చివర్లనుండి వెన్నెల ధారాళంగా కురిసింది. అతడి దేహ భాష ఆమెను చూసి సానుకూలంగా స్పందించింది, ఆ స్పందనను ఆమె క్రీగంటి చూపులతోనే గ్రహించగలిగింది.