మేము ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు గంటకు డెబ్భై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది.చూస్తుండగానే అనంతపురం దరిదాపులకు వచ్చేశాం. తిరుపతిలో ఎమ్.ఎ చదువుతున్నప్పుడు నాలుగురోజులు సెలవులొస్తే ఇంటికి అనంతపురం పరుగెత్తేదాన్ని.
రైలు ఊరుని సమీపిస్తుండగానే మనసంతా ఏదో తెలియని ఆనందంతో ఉద్విగ్నమైపోయేది. అది ఊరుమీది మమకారమో, నాన్నగారిమీద ప్రేమో మరి. ఎక్కడికి పోయాయి ఆ రోజులు, ఆ అనుబంధాలు!ఇన్నేళ్ళుగా అప్పుడప్పుడు ఊరుకి వస్తూనేవున్నా. కానీ నేనెరిగిన అప్పటి అనంతపురం కాదిది. ఊరు పెరిగింది. జనం పెరిగారు. ఇళ్ళు, అపార్ట్మెంట్లు లెక్కలేనన్ని పెరిగాయి. ‘నేను పి.జి. ఫైనలియర్ చదువుకున్న, సత్యసాయి మహిళాకళాశాలలో నాలుగేళ్ళు నేను లెక్చరరుగా పనిచేసిన ఊరేనా ఇది?’ అని ఆశ్చర్యం కలుగుతుంది.అప్పటి శ్రీకంఠ టాకీసు ఏది? కాశ్మీర్ సిల్క్ దుకాణం ఏమైపోయింది? టవర్ క్లాక్, ఓవర్ బ్రిడ్జి, కోర్టురోడ్డు మాత్రం గుర్తు పట్టగలను అంతే మిగతా ఊరు కొత్తగా అనిపిస్తుంది.దూరంగా గుడి కనబడుతోంది.
పాపను ఒళ్లోకి తీసుకున్నా ‘‘అదిగో అటుచూడు, నాలుగుగుర్రాలు లాగుతున్న రథం కనబడుతోందా? అది కృష్ణుడి గుడి...’’ అంటూ కారు కిటికీలోంచి పాపకు చూపించాను. అది ఇస్కాన్వాళ్ళు కట్టిన గుడి!‘‘అమ్మా! లుక్ ఎట్ ది హార్సెస్’’ అంటూ వాళ్ళ అమ్మకు చూపిస్తోంది..దాని కళ్ళు మెరుస్తున్నాయి. కారు వేగం తగ్గించాడు డ్రైవర్.‘‘నీకు కృష్ణుడు అంటే ఇష్టం కదా! పాప తల వెంట్రుకలు వెనక్కి తోస్తూ అంది వాళ్ళమ్మ.‘‘యా! ఐ లవ్ లార్డ్ కృష్ణ...అండ్ ఐ లైక్ ఛోటా భీం టూ’’ అంది అంది.కారు కల్యాణదుర్గం దారిపట్టింది. సాయంత్రంలోగా చిక్మంగళూరు చేరాలని మా ఆలోచన. అక్కడ ‘గ్రాండ్ కృష్ణా’ హోటల్లో గదులు తీసుకున్నారు.