సృష్టిలో అందానికి ప్రతిరూపం స్ర్తీ. బొట్టు, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ...లాంటివన్నీ ఆ అందానికి మరింత మెరుగులు దిద్దుతాయి. సహజసిద్ధమైన ఈ అలంకరణ పుట్టుకతో స్ర్తీ సొంతం. తాళికట్టిన భర్తకూ ఈ అలంకరణలకు సంబంధం లేదనే స్ర్తీలే ఇప్పుడు ఎక్కువ. అందుకే ఈ కథలో రమణికి, తన ఇంట్లో, రోట్లో పసుపు దంచి శుభకార్యం ప్రారంభించడానికి ఎవర్ని ముత్తైదువలుగా భావించాలో అర్థం కాలేదు. అప్పుడు ఆమె తల్లి ఏం చేసిందంటే....
********************
ఇల్లంతా హడావిడిగా ఉంది.రమణి మనసులో ఉత్సాహమూ ఉంది. పిసరంత అసంతృప్తీ ఉంది. అందరికీ ఫోన్లుచేసి చెప్పింది. తోటికోడలు వచ్చింది. ఆమె ఇద్దరు కూతుళ్ళూ రావాల్సి ఉంది. ఆమె పెద్ద కూతురు తులసి మొగుడు ఈ మధ్యనే పోయాడు. ఆమె వస్తే ఎలాగా అని సంశయం పీకుతోంది. రెండో కూతురు జ్వరం వచ్చి తగ్గింది, అయినా వస్తాలే అంది. వస్తుందో రాదో తెలీదు. కనీసం ముగ్గురు, నలుగురు ముత్తైదువులు వస్తే, పసుపుకొట్టి పెళ్ళి పనులు మొదలుపెడదామని రమణి అనుకుంటే ముత్తైదువలే కరువయ్యారని విసుగుపుడుతోంది. ఆరాటంగా అటూయిటూ తిరుగుతూ, కావలసినవి సమకూరుస్తూ ఆలోచించుకుంటోంది.ఈ మధ్య చాలామంది ఆడవాళ్ళు మొగుడుపోతే ఏం? పుట్టుకతో వచ్చిన పసుపు–కంకుమ, పువ్వులు ఎందుకు తీసెయ్యాలి? అంటూ వాదన చేస్తున్నారు. అందుకే బొట్టుమాత్రం పెట్టుకుని, నలుగురిలో ఎబ్బెట్టుగా ఉండకూడదని తాపత్రయ పడుతున్నారు.ఇలాంటి విషయాల్లో రమణికి స్పష్టమైన అభిప్రాయాలంటూ ఏమీలేవు.
‘‘పసుపు దంచడానికి ముత్తైదువలే ఉండాలని మనసంప్రదాయంలో ఎందుకు పెట్టారో, ఏమో! ఆ విషయాలమీద ఒకటే ప్రశ్నలు వేస్తూ వాదించటం నాకిష్టం వుండదు’’ అంటూ తెగేసి చెబుతూ ఉంటుంది రమణి.ఇంతకీ రమణి భర్తపోయి పాతికేళ్ళైంది. బొట్టుపెట్టుకోదుగానీ, పట్టుచీరలు, నగలూనట్రా పెట్టుకుంటుంది. అయినా ఆమెకి భర్తపోయినవాళ్ళమీద పెద్దగా సింపతీ వున్నట్లు కనిపించదు. ఆడబడుచు కూతురు, వయసులోచిన్నదే. భర్త పోయాడు. అయినా రమణికేం బాధవుండదు. ఏంచేస్తాం? నుదుటిరాత అంటుంది. ‘పైగా తనకి మాత్రం భర్తపోయేనాటికి ముప్పైఐదేగా. తనమీద ఎవరు కనికరం చూపించారని? తనిప్పుడు అందరిమీదా జాలిపడిపోవాల్సిన పనేమీలేదు’ అనుకుంటుంది కసిగా. తను అనుభవించిన అవమానాలు ఎదుటివారికి రాకూడదు అనే భావన ఆమెకి అప్పుడప్పుడు కలిగినా వెంటనే తోసిపారేస్తుంది.