ఈ సమాజం దాదాపుగా నడిచేది నమ్మకం పునాదులపైనే. పరస్పర విశ్వాసం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ సమాజాన్ని, సమాజంలో మనుషులమధ్య ఉన్న బంధాలనీ నడిపిస్తూ ఉంటాయి. దూరంగా ఉన్నాగానీ వాటిని కాపాడుతూ ఉంటాయి. కానీ మన సమాజం నిజంగా అన్ని విషయాల్లోనూ నమ్మకంపునాదులమీద, ఒప్పందంమీద నడుస్తోందా? మరి స్ర్తీపురుషులమధ్య పెళ్ళిబంధం మాటేమిటి? అసలీకథలో జరిగిందేమిటి?
శంకర్, మాలతి పార్కులో ఓ ఏకాంత ప్రదేశంలో కూర్చున్నారు. వాళ్ళిద్దరూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అది వాళ్ళ పెళ్ళి విషయం. ఇద్దరూ కొన్నాళ్ళుగా స్నేహంగా, చనువుగా కలిసి తిరుగుతున్నారు. వాళ్ళు ప్రేమికులనే అనుకుంటున్నారు అందరూ. వాళ్ళుమాత్రం మేం స్నేహితులం అంతే, అంటున్నారు. స్నేహమైనా, ప్రేమైనా, పెళ్ళిబంధం లేకుండా కలిసి ఉందాం అంటాడు శంకర్. పెద్దల దీవెనలతో సంప్రదాయబద్ధంగా పెళ్ళి చేసుకునే కలిసిబతుకుదాం అంటుంది మాలతి.శంకర్ సిద్ధాంతం వేరు. ‘‘స్త్రీ, పురుషుడు ప్రేమతో కలిసి బతకటానికి పెళ్ళితంతు జరిపించాలా? ఇద్దరం స్నేహితులం. మనం ఇలాగే ఎప్పుడూ కలిసి ఉందాం అని బంధుమిత్రుల సమక్షంలో స్నేహితులు ఎక్కడైనా ప్రమాణాలు చేసుకుంటారా? ఆలోచించు మాలతీ’’ అంటాడు.
మాలతి అభిప్రాయాలు వేరు. ‘‘వివాహ వ్యవస్థ ఎన్నో ఒడిదుడుకులకు లోనై, శతాబ్దాల పరిశీలన తర్వాత, ఒక ఆదర్శ వ్యవస్థగా నిలదొక్కుకుంది. విదేశీయులు కూడా పెళ్ళి సంప్రదాయాన్ని గౌరవిస్తారు. పాటిస్తారు. మనకో సుస్థిరమైన వ్యవస్థ ఉండగా కొత్త ప్రయోగాలు ఎందుకు శంకర్?’ అంటుంది.శంకర్ అంటాడు ‘‘ఎన్ని ప్రమాణాలు చేసినా, ఎన్ని మంత్రాలు చదివినా, ఎన్ని ముళ్ళు వేసుకున్నా మనసులు కలవని దాంపత్యాలు మన కళ్ళ ముందే కూలిపోతున్నాయి. అన్నీ తెలిసి కూడా, మళ్ళీ అవే ఆర్భాటాలు, అవే మంత్రాలు, అవే శుష్కతతంగాలు అవునా?’’‘‘కాదు!’’ మాలతి ఠక్కున సమాధానమిస్తుంది.
‘‘పెళ్ళి వెనుక, ఓ బాధ్యత ఉంది, త్యాగం ఉంది. సమాజ సుస్థిరత ఉంది. ఆ పెళ్ళి ప్రమాణాలలో ఓ నిబద్ధత ఓ బంధం ఉన్నాయి. పవిత్రత ఉంది’’ఇద్దరూ విద్యాధికులే, తర్కంలో ఒకరికొకరు తీసిపోరు.శంకర్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ‘‘అందరిలాగే నేనూ బూజుపట్టిన కుర్రతనపు సంప్రదాయాలనే అనుసరిస్తే అది ఆత్మవంచనే అవుతుంది’’ శంకర్ బాధగా అన్నాడు. చివరకు, ‘‘మాలతీ, ఇద్దరం వాద ప్రతివాదాలతో అలసిపోయాం. నిన్ను ఒప్పించలేకపోయాను. అలా అని నా నమ్మకాలూ, వదులుకోలేను. మనం ఎవరి దారిన వాళ్ళు వెళదాం’’ అన్నాడు.