మీదారి మీది నా దారి నాది అన్నాడు చెట్టంత కొడుకు. గాజుగ్లాసు చేతిలోంచి జారిపోయినట్టైపోయింది ఆమె హృదయం. కొడుకును పెద్ద చదువులు చదివించడానికి చేసిన అప్పు కొండలా పెరిగికూర్చుంది. మీరు వేరింట్లో ఉండండి, మిమ్మల్ని చూడ్డానికి వస్తూ ఉంటాను అన్నాడు ఒకప్పటి ఆ అమ్మకూచి. కన్నవాళ్ళను కాదనుకుని భార్యనే ఫాలో ఐపోయాడు. సంపాదించుకునే శక్తిలేని ఆ తల్లిదండ్రులు అప్పుడు ఏంచేశారు?
*****************************
ప్రశాంత వాతావరణం. చుట్టూ నిశ్శబ్దం. కానీ మనసులో మాత్రం సముద్రఘోషలా సంఘటనల అలలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి.సాగరమథనంలా అంతరంగం అల్లకల్లోలమైపోయింది. జీవితంలో ఇలాంటి క్షణం వస్తుందని ఊహించిన రోజు లేదు. కానీ వచ్చేసింది. వద్దన్నా వచ్చేసింది. కరగిపోయిన కాలాన్ని, జారిపోయిన శక్తిని ఈ వృద్ధాప్యంలో కొనితెచ్చుకోగలనా? కూర్చుంటే లేవలేని పరిస్థితి, ప్రయాణాలు చేయలేని దుస్థితి. వీటన్నిటినీ అధిగమించే అవకాశం తనకి ఉందా? వదులుకున్నదాన్ని మళ్ళీ పొందగలదా? కానీ పొందాలి. ఆ పట్టుదల తనలో పరవళ్లు తొక్కింది. ఆ ఆలోచనే తనలో లేని బలాన్ని అణువణువున వ్యాపింపచేసింది!అసలు తను కోల్పోయిందేమిటి?ఆ ప్రశ్న ఆమెను గతంలోకి తొంగి చూసేలా చేసింది.***ఒక చల్లని సాయంసమయంలో చక్రధర్ ఉన్నట్టుండి తన జీవితంలోకి ప్రవేశించాడు. అంతే తన జీవితం అంతా అతని చుట్టూనే చక్రభ్రమణంలా చుట్టుకుపోయింది. దానికి తానేమీ బాధపడలేదు. చక్కని సంసారం, అన్యోన్య దాంపత్యం అసలు ఎంతమందికి దక్కుతుందనే మురిపమే. ‘అభిలాష్’ అంటే తనకెంతో ప్రేమ. తమ ప్రేమ సామ్రాజ్యానికి వారసుడు కదా! ఉద్యోగంలో చేరితే, అభిలాష్‌కి సరైన న్యాయం చేయలేనని వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదులుకుంది తను. ఐనాగానీ, ఉన్నంతలోనే వాడి ప్రతిముచ్చటా తీర్చాలనే తాపత్రయం. ఎప్పుడూ తమ సుఖాన్ని పక్కన పెట్టి వాడి కోరికలు తీర్చాం. అదే ఇప్పుడు తమకు ఎసరు అవుతుందని ఏనాడూ అనుకోలేదు.తనకు సంపాదన లేదుగనుక, ఉన్నంతలోనే సంతృప్తిగా బ్రతకాలని మనసులో కోరికల చిట్టా తెరవకుండా జాగ్రత్త పడింది. గుట్టుగా సంసారం లాక్కొచ్చింది.
ఈ ప్రయాణంలో తన మనసుకు అత్యంత ఉత్సాహాన్నిచ్చేవి పాటలే. అందులో ఆత్రేయ మనసు పాటంటే చచ్చేంత ఇష్టం. తను కూడా ఒక్కపాటైనా అలా మనసుమీద పాడాలన్నది ఎదలోతుల్లో దాగి ఉన్న గాఢమైన కోరిక. అభిలాష్ అప్పుడు ఫిప్త్ క్లాసులో ఉన్నాడు. తమ ఇంటి పక్కనే సినీ నిర్మాత ‘నిరంజన్’ ఉండేవారు. అప్పుడే ఆయన తీస్తున్న ‘చంద్ర’ లో తనకో అవకాశం ఇస్తానన్నారు. అందుకు కారణం పాటంటే తనకున్న తాపత్రయమే! తన మాటల్లోనే సాహిత్యం పరవళ్లు తొక్కుతుందన్న ఆయన మాటలు నమ్మబుద్ధయ్యేది కాదు. తనలో అంత ప్రతిభ ఉందా? ఏమో? పోనీ ప్రయత్నిద్దామన్నా ఈ వ్యవహారంలో కనీసం నాలుగుసార్లన్నా హైదరాబాద్ రావల్సి ఉంటుందనీ, అందుకు ఇష్టమైతే ‘ట్యూన్’ ఇస్తానని ఆయన చెప్పేశారు.