‘‘గుడ్ఫ్రైడేతోపాటు రెండోశనివారం, ఆదివారం కలిపి మూడురోజులు సెలవులంటున్నారు. ఎటైనా సరదాగా వెళ్ళొద్దామండి’’ భర్త షర్టు గుండీలు సవరిస్తూ గోముగా అన్నది అర్చన.ఎప్పుడు ఏ ఊరు వెళదామన్నా ‘నాకు తీరికలేదు మీరు వెళ్ళిరండి’ అనే అర్థాంగి ఇవాళ ఇలా తనకుతానుగా అభ్యర్థించడం చూస్తే ఆశ్చర్యమేసింది హరికృష్ణకి. అందుకే కాదనడానికి మనస్కరించక ‘‘సరే, ప్రయాణానికి సిద్ధమవు’’ అన్నాడు భార్య భుజం తడుతూ.
అడగ్గానే మగడు అంగీకరించడంతో ఊరంత సంబరపడిపోయింది అర్చన. మరునాడు లేస్తూనే బ్యాగు సర్దేసి రెడీ అయిపోయింది.ఇరువురూ ఆటోలో స్టేషన్కి చేరేసరికి ఎక్కవలసిన రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది.గబగబా టిక్కట్లు తీసుకుని రెండో తరగతి బోగీలోకి ఎక్కికూర్చున్నారు.అర్చనకి ఈ ప్రయాణం హనీమూన్లా ఉంది. ఔను మరి పెళ్ళై పాతికేళ్లవుతున్నా ఎప్పుడైనా గుమ్మం దాటితేనా? అమ్మాయికి పెళ్ళి, అబ్బాయికి ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు సుదూర ప్రాంతాలకు తరలి పోవడంతో ఇన్నాళ్ళకి తీరిక దొరికింది.ఇంజను కూత పెట్టింది. బండి బయలుదేరింది.తునిలో ట్రైను ఆగగానే కిటికీలోంచి బయటకు తొంగి చూశాడు హరికృష్ణ.
తన సిగ్నల్కోసమే ఎదురు చూస్తున్నట్లు నవ్వుతూ బండెక్కారు ప్లాట్ఫారం మీద నిలబడిన భార్యాభర్తలు.‘‘ఇతడు నా కొలీగ్ కాంతారావు. ఈ మధ్యే ట్రాన్స్ఫర్ మీద తుని వెళ్ళిపోయాడు. ఆవిడ ఆయన అర్థాంగి అలివేణి’’ శ్రీమతికి పరిచయం చేశాడు హరికృష్ణ.అలివేణి అర్చన పక్కన కూర్చుంది.మిత్రులిద్దరూ ఆఫీసు విషయాలు చర్చించుకుంటున్నారు.‘‘మీరు ఎంతవరకు వెళుతున్నారు?’’ మాట కలిపింది అలివేణి.‘‘మేమూ విశాఖపట్నమే’’‘‘మనమంతా సరదాగా వైజాగ్ తిరిగొద్దామని మీ వారు ఫోన్ చేస్తే మేమూ బయలుదేరాం’’ అలివేణి చెప్పింది.