పుట్టుకతో అందరూ నిరక్షరాస్యులే. ఎదిగి లోకాన్ని అర్థం చేసుకున్న తర్వాతే అక్షరజ్ఞానం, నాగరికత, మంచి చెడులూ అన్నీ నేర్చుకుంటారు ఎవరైనా. కాకపోతే కొందరు వేగంగా అర్థం చేసుకుంటే, మరికొందరు కొంచెం ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. అది వారి వారి అనుభవాలనుబట్టే ఉంటాయి. ఈ కథలో కూడా ఓ పచ్చి పల్లెటూరు నుంచి భార్యాభర్తా మొదటిసారి విమానం ఎక్కి కొడుకు దగ్గరకు అమెరికా బయలుదేరారు. అప్పుడు ఏమైందంటే....
న్యూయార్క్ జె.ఎఫ్.కెన్నెడి ఎయిర్‌పోర్ట్.లండన్‌నుంచి వచ్చిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం అప్పుడే లాండ్ అయింది. ప్రయాణికులు ఒక్కొక్కరూ నెమ్మదిగా లేచి వారి సీట్ల పైనున్న హ్యాండ్ బ్యాగేజి తీసుకుంటున్నారు. అందరూ దిగినతర్వాత నెమ్మదిగా దిగొచ్చనే ఉద్దేశ్యంతో దశరథ్ ఇంకా సీట్లోంచి కదలకుండా కూర్చునే ఉన్నాడు. అతని పక్కనే ఉన్న మిసెస్ దశరథ్ కూడా కదలలేదు.
ఇటుపక్క సీట్లోంచి లేచిన వరదరావు పైనుంచి తన బ్యాగేజీని తీస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా తీసినా ఆ బరువుకి దింపుతుంటే కాస్తంత ఆ పెట్టె కొన దశరథ్ భుజానికి రాసుకుంది. కంగారుపడుతూ ‘‘సారీ సర్...’’ అని చెప్పి, దిగడానికి లైన్‌లో నిలబడ్డాడు వరదరావు.దశరథ్‌కి చిరాకనిపించింది. ‘‘హు...ఎక్కడినుంచి వస్తారో వీళ్ళంతా, ఈ మధ్య ఎయిర్‌ట్రావెల్ కూడా ఎర్రబస్సెక్కినట్టే ఉంది’’ అన్నాడు. నెమ్మదిగా భార్యకి మాత్రమే వినిపించేలా.అతని భార్య విశాలి కూడా అంతే నెమ్మదిగా ‘‘విమానం ఎక్కుతున్నవాళ్ళు కూడా ఎర్రబస్సెక్కే వాళ్ళేకదా! అలాకాక ఇంకెలా ఉంటుందీ?’’ అంది.వాళ్ళు ఎంత నెమ్మదిగా మాట్లాడుకున్నా ఆ మాటలు వరదరావుకి, అతని వెనకున్న అతని భార్య వరలక్ష్మికి వినిపించనే వినిపించాయి.
చిన్నబుచ్చుకున్నట్టైపోయాయి వారి మొహాలు.ఇమ్మిగ్రేషన్‌లో అమెరికన్ ఆఫీసర్ అడుగుతున్న ప్రశ్నలేమిటో వరవరరావుకి అర్థం కావటంలేదు. అతనిభార్యకి మరీ అయోమయంగా ఉంది. ఇమ్మిగ్రేషన్ క్యూలో నిలబడిన దశరథ్, తమ ఆలస్యానికి కారణమౌతున్న వరదరావుని చూస్తుంటే ఒళ్లంతా కారం రాసుకున్నట్లనిపించింది. విజిటర్స్ వీసామీద వచ్చిన వాళ్ళిద్దరినీ యు.ఎస్.లో ఉన్నవాళ్ళు మీకేమవుతారని ప్రశ్నిస్తున్నాడు అధికారి. ఆఫీసర్ ఇంగ్లీష్ యాక్సెంట్ వరదరావుకి ఎంతకీ అర్థం కావడంలేదు. ఇక ఆలస్యాన్ని సహించలేని దశరథ్ ముందుకెళ్ళి ఆఫీసర్ అడుగుతున్నదేమిటో వరదరావుకి వివరించి చెప్పాడు. ‘‘ఆయ్..! మా అబ్బాయేనండి...’’ అన్నాడు దశరథ్ చేసిన సహాయానికి సంబరపడిపోతూ వరదరావు. దాన్నే ఆఫీసర్‌కి ఇంగ్లీషులో చెప్పాడు దశరథ్. అది విని స్టాంప్స్ వేసి వాళ్లని పంపించేశాడు ఆ అమెరికన్ ఆఫీసర్.