భర్తకు సడన్‌గా అనారోగ్యం.. చచ్చుబడిపోయిన రెండు కాళ్లు.. ఎంత వైద్యం చేసినా ఫలితం లేదని తేల్చిన డాక్టర్లు.. సరిగ్గా అదే సమయంలో భార్య వింత ప్రవర్తన చూసి భర్తకు షాక్.. ఆమె మాట్లాడేది విని.. ఆమె తీరును చూసి ఏం చేయలేక నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయిన భర్త.. అసలేం జరిగిందంటే.. 

**************************

‘‘అయ్యగారూ....’’ నడుము వంచి నిలబడిన బండోడు తన స్వరంలో కొంచెం వినయాన్నిపెంచి ప్రాధేయపూర్వకంగా పిలిచాడు. వాడి అసలుపేరు బండి వెంకన్న. మనిషి రివటలా ఉన్నా నలుగురు చేసే పనిని ఒక్కడే చక్కబెట్టెయ్యగలడు! అంత బండచాకిరీ చేస్తాడనే అందరూ ‘బండోడా’ అని పిలుస్తారు. ఆ పిలుపుకి వెంకన్న అలవాటుపడిపోయాడు. వాడు కూడా ఆ పిలుపుని ఒక బిరుదులా భావించి మురిసిపోతుంటాడు.

 

కోటలాంటి ఆ ఇంటి వసారాలో సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని ముందున్న ముక్కాలిపీటపై కాళ్ళు బారచాపుకున్న అయ్యగారి అసలుపేరు సింగన్న. ఒక తాతగారి పేరే కాకుండా చిన్నప్పుడే తనలో ఉట్టిపడుతున్న రాజసాన్ని గమనించి తల్లిదండ్రులు తనకు ఆ పేరు పెట్టి ఉంటారని ఆయనకో నమ్మకం!కొంచెం పెద్దయ్యాక ‘సింగన్న’ అనే పేరు సింపుల్‌గా ఉండి దర్జాగా లేదనిపించి ఇంకో తాతగారిపేరులోని ‘భూపతి’ ని కూడా చేర్చుకుని తనపేరును సింగన్నభూపతిగా మార్చేసు కుని సంతృప్తిపడ్డాడు.ఇంకొంచెం పెద్దయ్యాక, పెత్తనం చేతికి వచ్చాక ఇంటి ప్రహరీగోడపై గేటుకి అటూ ఇటూ సింహాల బొమ్మల్ని పెట్టించి తన పేరుకి తగ్గట్లు తన ఇంటికి కూడా రాచటీవిని తేగలిగానని సంతోషపడ్డాడు.

తల్లిదండ్రులు వారసత్వంగా ఇచ్చిన నలభై ఎకరాల్నీ తన హయాంలో రెట్టింపు చేయగలిగిన తన సామర్థ్యంపై ఆయనకు చాలా నమ్మకం, గర్వం! అందుకు కఠినవైఖరి అనే తన చేతికర్రే బాగా ఉపయోగపడిందనేది ఆయన ఉద్దేశంకూడా. ఏ పరిస్థితిలోనైనా సరే దానిని విడవకూడ దనేది ఆయన గట్టి అభిప్రాయం.బండోడివైపు తలతిప్పి నిర్లక్ష్యంగా చూస్తూ ‘‘ఊ... ఏంట్రా.....’’ అన్నారు పెద్దగా సింన్నభూపతి. పాలేర్లతో మామూలుగా కాకుండా గట్టిగా, పెద్దగా మాట్లాడినప్పుడే తన గొంతు సింహగర్జనలా ఉండి వాళ్ళు భయభక్తులతో ఉంటారనేది ఆయన నమ్మకం!