రంజాన్ పండగ.ఈద్గా వదిలారు. పిల్లలంతా బిలబిల మంటూ బయటికి ఉరికారు. తమ్ముడు ‘ఈద్ ముబారక్ భయ్యా..’ అంటూ అలాయ్ బలాయ్ ఇచ్చాడు. ప్రతిగా అంతే స్వచ్ఛంగా ఈద్ ముబారక్ చెప్పి వాడి నుదుటిన ముద్దు పెట్టాను. తర్వాత తమ్ముడు అలాగే కిందికి వంగి ఇసుకలో పరిచిన జానీ నమాజ్ విదిలించి సంకలో పెట్టుకున్నాడు.ఇద్దరం ఈద్గా మైదానం నుంచి బయటికి దారితీశాం. దార్లో కొందరు అడ్డంగా నిలబడి ఒకరికొకరు అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటున్నారు. తెలిసిన ముఖమా.. తెలియని ముఖమా.. అని చూడటం లేదు. చేతులు చాచిన వారందరినీ ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంటున్నారు.చిన్నపిల్లల సందడైతే కొదవ లేదు. తెల్లటి డ్రస్సుల్లో రంగుల టోపీలు పెట్టుకుని ఒకర్నొకరు ముబారక్ చెప్పు కుంటున్నారు. మెల్లగా కనిపించిన వాళ్లకంతా అలాయ్ బలాయ్లు ఇచ్చుకుంటూ ఒక్కొక్క అడుగూ ముందుకు వేసుకుంటూ ఈద్గా గేటు దాటి బయటపడ్డాం.బయట ఒకటే అరుపులు.‘బా... ఖైరాత్ కరోబా..’ అని ఒకరు, ‘అయ్యా...ధర్మంచేయి..’ అని మరొకరు.. తోసుకుంటూ మీది మీదికి వచ్చేస్తున్నారు.అది ఉర్దూ గొంతా.. తెలుగు గొంతా.. అన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఆ గొంతులోని దారిద్ర్యాన్ని మాత్రమే చూస్తున్నారు. దారిద్ర్యానికి భాషా భేదం ఏముంటుంది? అది అందర్నీ ఒకేలా చూస్తుంది. అందుకే చేయి చాచిన వారికల్లా చిల్లర పంచుకుంటూ ముందుకు కదులుతున్నారు ఈద్గా జనం. వారి వెనకాలే మేమూ నడుస్తున్నాం.తమ్ముడు ప్యాంటు జేబులోంచి చిల్లర పొట్లం తీసి నాకు సగమిచ్చాడు. ఇది దానాల రోజు. దానం చేయాల్సిన రోజు. ఎదుటి వాడి కష్టాన్ని పంచుకోవాల్సిన రోజు. ఉన్నంతలో కొంత ఇచ్చుకుని ఆ ఇచ్చుకోవడంలోని ఆనందాన్ని మనస్ఫూర్తిగా అనుభవించాల్సిన రోజు. ఆ ఆనందాన్ని పోగొట్టుకుంటే అంతకు మించిన దారిద్య్రం లేదని బాధపడాల్సిన రోజు.చేతిలో చిల్లర చూడగానే నాకు మా నాయన గుర్తొచ్చాడు.‘రేయ్.. నాయనేడిరా..’ అన్నాను.‘ఇందాకనే నమాజ్ సదివేటప్పుడు మొదుటి ఒరసలో కనిపిచ్చినాడే’ అన్నాడు తమ్ముడు.ఆయన ఈద్గాకి ముందే వచ్చేశాడు. అందుకే ఆయనకు నమాజ్ చదవడానికి మొదటి వరుసలోనే స్థలం దొరికింది. ‘సైకిల్ ఉంది కదా..’ అని మేము కావాలనే కొంచెం నిదానంగా వచ్చాం. వచ్చే సరికే ఈద్గా నిండి పోయింది. చేసేది లేక చివరి వరుసలోనే జానీ నమాజు పర్చుకుని ప్రార్థన చేసుకున్నాం. నాయన ఎప్పుడూ అంతే. ఎక్కడికెళ్లినా ఒక అడుగు ముందే ఉండాలంటాడు.