చిక్కని వాన రోజులు. 

వసంతాన్ని మళ్ళీ కలుస్తానంటూ వొకే రాగంలో సుదూరంగా వినిపిస్తోన్న కోయిల పాట మహిత మనసులో అదేపనిగా గత గీతం..     
యూత్‌ ఫెస్టివల్‌. 
పాటల పోటీల్లో డ్యూయట్‌ విభాగంలో మైక్‌ ముందు నిలబడి ‘‘మనిషికో స్నేహం .. మనసుకో దాహం’’ పాటని మహితా, శ్రీకాంత్‌ కలిసి పాడారు. మొదటి బహుమతి. యిద్దరికీ కలిపి వొక్కటే కప్‌ అందించారు. 
వాళ్ళ పొదుపుని మనసులోనే చెరుగుతూ ‘‘నువ్వు పట్టుకెళ్ళు శ్రీకాంత్‌’’ అంది మహిత.
‘‘నువ్వే పట్టుకెళ్ళు. నాతో కలిసి పాడటానికి వొప్పుకోవటమే నాకు పెద్ద గిఫ్ట్‌’’ అన్నాడు శ్రీకాంత్‌. 
మహిత వెళ్ళబోతుంటే ‘‘ఆ కప్‌ మనిద్దరి యింట్లో వుండాలని నా కోరిక’’ అన్నాడు చప్పున.
మహిత ఆగింది ఆశ్చర్యంతో. ఆమె కళ్ళల్లో ‘నిజమా’ అనే వెలుగు. అదెలా సాధ్యమనే ప్రశ్న.
‘‘మనకీ వాళ్ళకీ మాటల్లేవని తెలుసు కదా. శ్రీకాంత్‌తోనే కాదు యే అబ్బాయితోనూ డ్యూయెట్‌లు పాడకు స్టేజ్‌ యెక్కి. పెళ్ళి కావాల్సిన పిల్లవి’’ అన్నారు కూతురుతో సరస్వతి. 
తల్లి మాటల్ని వింటున్నా ‘‘ఆ కప్‌ మనిద్దరి యింట్లో వుండాలని నా కోరిక’’ అన్న అతని మాటలు ఆమె హృదయాన్ని జైంట్‌ వీల్‌లా తిప్పుతున్నాయి.  
*********
 
‘‘పదహారేళ్ళకు... కోటి దండాలు’’ రెండు వైపులా రికార్డ్‌ చేయించిన క్యాసెట్‌ యిస్తే అదెక్కడ మిస్‌ అయిపోతుందోననే భయంతో రాత్రులు తలగడ కింద దాచేది మహిత.  
సంబంధాలు చూస్తుంటే యింట్లో వాళ్ళకి శ్రీకాంత్‌ విషయం యెలా చెప్పాలో తెలియక మహిత తన సమస్యని స్నేహితురాలు సుధారాణికి చెప్పింది. 
సుధారాణికి పన్నెండేళ్ళున్నప్పుడు నాలుగో కాన్పులో తల్లి పోయారు. బామ్మగారు పిల్లల్ని పెంచటం. ఆడపని మొగపనీ అని లేకుండా యింటికి కావాల్సిన పనులన్నీ వొంటి చేత్తో చేస్తూ, బామ్మకి తల్లో నాలుకగా వుండే సుధా రాణియే యీ స్నేహబృందానికి పెద్దదిక్కు.   
మహిత కళ్ళల్లో కదులుతోన్న బెంగని చూస్తూ ‘‘రేపు పెళ్ళి చూపుల్లో వాళ్ళు నిన్ను ‘వోకె’ అన్నా కంగారుపడకు. మీ ప్రేమ మీద నమ్మకముంచి మీ యింట్లో వాళ్ళతో మాటాడగలిగే పెద్దమనుషుల్ని వెతకాలి. వెతుకుదాం’’ అంది సుధారాణి.
*********
 
‘‘పాటలు  పాడుతుందా.. మా వాడికీ నాకు చాలిష్టం. యేది వో పాట పాడమ్మా’’ అని పెళ్ళి  చూపుల్లో పెళ్ళికొడుకు పెద్దమ్మ అడిగారు.
మరో రెండుసార్లు అడిగించుకొని ‘‘భలే భలే మొగాడివోయ్‌’’ అని మహిత మొదలు పెట్టేసరికి అప్పుడు యెవరి ముఖంలో యే భావాన్ని చూడాల్సి వస్తుందోనని మహిత యింటిల్లిపాదీ గట్టిగా కళ్ళు మూసేసుకున్నారు.
యీ సంబంధం వొద్దని కబురు పెట్టడానికి ముందే మహితని ఆ రాత్రి ఆమె తల్లి విషయమేమిటని గట్టిగా నిలదీశారు.
శ్రీకాంత్‌ విషయం చెప్పేసింది మహిత.
మౌనం యిద్దరి మధ్యా కొద్దిసేపు. 
‘‘వొక్కరూ వొప్పుకోరు. నువ్విలా పీకలలోతు ప్రేమలో కూరుకుపోయిన విషయాన్ని గమనించుకోలేదని నన్నంతా బ్లేం చేస్తారు. మీ నాన్నగారి ముందు తలొంచుకునేలా చెయ్యకు. ముఖ్యంగా మీ పెద్దమేనత్త ముందు నన్నో బాధ్యతారహితమైన తల్లిగా నిలబెట్టకు’’ బుగ్గల మీదకి కళ్ళనీళ్ళతో తల్లి. తనని బెదిరిస్తుందో, బతిమాలుతుందో, అభ్యర్థిస్తుందో తెలియనంత బేలగా వున్న అమ్మ స్వరానికి బెదిరిపోయింది మహిత.
*********
 
మహిత యింట్లో వాళ్ళతో సుధారాణి నాయకత్వాన స్నేహితులంతా మాట్లాడారు.   
శ్రీకాంత్‌నే చేసుకొంటానని బెదరకుండా ప్రకటించేసింది మహిత. 
అటూయిటూ అనేక వాదోపవాదాలు. ‘‘పాత మనస్పర్థలు యిప్పటికీ కొనసాగించాలా వారసత్వపు ఆస్తిలా’’ అన్నారో పెద్దమనిషి. చివరికి మనం మనం తెనాలి అనుకొన్నట్టు మనం మనం బంధువులం అనుకొన్నారు. స్నేహితులు, బంధువుల మధ్యవర్తిత్వంతో శ్రీకాంత్‌ మహిత పెళ్ళి శుభలేఖలు అచ్చయ్యాయి.
యిప్పుడా ప్రేమ కథంతా మహితకి ఆలాపనై పదేపదే వినిపిస్తుండటానికి కారణం సుధారాణి చిన్న కూతురు శ్రీవల్లీ మనోజ్ఞ. 
*********
 
శ్రీవల్లీ మనోజ్ఞ ట్రెక్‌కి వెళ్ళింది.
సాయంత్రం క్యాంప్‌ ఫైర్‌. అంతా పాటలు పాడుకొంటున్నప్పుడు హిందీ పాటల్ని పాడుతోన్నంత యీజ్‌తో దుష్యంత్‌ ఆమె వైపు చూస్తూ తెలుగులో ‘‘చూపే బంగారమాయేనే శ్రీవల్లీ ... మాటే మాణిక్యమాయేనే...’’ అని పాడుతున్నప్పుడు అతని కళ్ళలో యిష్టం మెరిసిన ఆ క్షణం యెలక్ట్రిఫైయింగ్‌గా అనిపించింది శ్రీవల్లీ మనోజ్ఞకి. 

అతని నుంచి ఆమె కళ్ళు తిప్పుకుంటుంటే అతను అదే పాటని హిందీలో కూడా రిపీట్‌ చేస్తుంటే నిశ్శబ్దంగా నవ్వుతోందామె. అతని వైపు చూసినప్పుడంతా అతను పలకరింపుగా కళ్ళెగరేస్తూ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చిరునవ్వుతో పాడుతుంటే కళ్ళల్లోంచి పాట గుండెలోకి ప్రవహిస్తుంటే మాటల్లో చెప్పలేని మనసున మనసైన యవ్వన వాగ్దానమేదో గుప్పెట్లో సీతాకోకచిలుకల్లా గిలిగింతలు పెడుతుంటే మిగిలిన ట్రెక్‌లో వచ్చిన యెత్తుపల్లాలలోనో, కొండంచు లోయల వెంటో నడుస్తున్నప్పుడు అప్పటి వరకూ జీవించిన జీవితాన్ని కలబోసుకొంటూ, నడుస్తోన్న దారి అందాలని వొడుదుడుకులని చెయ్యి చెయ్యి పట్టుకొని ముందుకు సాగుతోన్న వారిద్దరికీ తామిద్దరి ప్రొఫెషన్‌ వొక్కటి కాకపోయినా ఆసక్తులు, ఆకాంక్షలు, సరదాలు యిలా యెన్నో వొక్కటిగానే అనిపించాయి. ఆ కొద్దిరోజుల పరిచయంలోనే ప్రాక్టికల్‌గా మాటాడుకునేవి మాటాడుకొన్నారు. యిమోషనల్‌గా అనిపించినవీ పంచుకొన్నారు. 

 

 దుష్యంత్‌ వివరాలు చెప్పి ‘తామిద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నామని, నీకూ నాన్నగారికి పరిచయం చేస్తాన’ని తల్లికి చెప్పింది.  
‘‘మీ యిద్దరి చదువులు వేరు. వొకే విధమైన జాబ్‌ వుంటే లైఫ్‌ స్మూత్‌గా నడుస్తుంది. లేకపోతే చాలా క్లాషెస్‌ వొస్తాయి. అతనేమో యం.బి.యే. నువ్వేమో యింజినీర్‌వి. యూ.యస్‌.లో చదవమంటే వినకుండా క్యాంపస్‌ సెలెక్షన్‌లో జాబ్‌ వొస్తే జాయిన్‌ అయ్యావు. మీరిద్దరికీ యూ.యస్‌. వెళ్ళి చదువుకొనే ఆలోచన వున్నట్టు లేదు. అక్కలా నువ్వూ యూ.యస్‌.లో వుంటే బాగుంటుంది శ్రీ’’ లాలనగా అంది సుధారాణి.
‘‘వొకే చదువు.. వుద్యోగం.. య్యాంబిషన్స్‌ వున్నా అక్క తన క్లాస్‌మేట్‌ని చేసుకుంటానన్నప్పుడు వొద్దని కట్టడి చేసావు. యెందుకమ్మా?!’’ అడిగింది శ్రీవల్లి.  
చిర్రెత్తుకొచ్చి ‘‘వొద్దన్నాను. అక్కకి యెంత మంచి సంబంధం తెచ్చానో కదా. షీ యీజ్‌ ప్రిన్సెస్‌ మన కుటుంబాల్లో..’’ అంది సుధారాణి.
‘‘యెవరికి ప్రిన్సెస్‌?! నువ్వు క్వీన్‌గా ఫీల్‌ అవుతున్నావు కానీ అక్కకి  వున్న ఆ మిస్సింగ్‌ ఫీలింగ్‌ నీకెప్పుడూ అర్థం కాదు’’ అంది శ్రీవల్లీ మనోజ్ఞ.
‘‘మీ నాన్నగారు వొప్పుకోరు.’’
‘‘మగవాళ్ళు పవర్ఫుల్‌ అనిపించకపోవటానికి వొక కారణం మనిల్లేనమ్మా. మనింట్లో చర్చించి నిర్ణయాలు తీసుకోవటం నేనెప్పుడూ చూడలేదు. బట్టలూ, ఫుడ్‌, చదువులు ప్రతీదీ డిసైడ్‌ చేస్తావు. మా ముగ్గురం వాటిని ఆచరించటమే. అక్క యిష్టపడిన అబ్బాయిని వొద్దనటానికి కారణం నీ చాయిస్‌ కాకపోవటమే. మన బంధువులు, స్నేహితుల కంటే అన్నింటా యెక్కువగా వుండాలనే నీ కాంపిటేషన్‌లో నిన్ను గెలిపించటానికి మేం ముగ్గురం యెలా నలిగిపోతున్నామనే ఆలోచనే నీకెప్పుడూ రాదామ్మా?! యెప్పుడూ మా గురించే ఆలోచించే నీతో యిలా మాటాడాల్సి రావట మేమీ బాలేదు. అర్థం చేసుకో’’ అంది శ్రీవల్లి.
‘‘చూపే..’’ రింగ్‌ టోన్‌ శ్రావ్యం. శ్రీవల్లి మనోజ్ఞ కళ్ళల్లో చెమక్‌ చెమక్‌. 
‘‘వొకే.. నువ్వూ నాన్నగారు యెప్పుడు కలుస్తానంటే అప్పుడు దుష్యంత్‌ని మీకు పరిచయం చేస్తాను’’ అని మనోజ్ఞ హాల్లో నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. 
*********
 
చెప్పాపెట్టకుండా యింటికొచ్చిన సుధారాణిని అప్పుడే ఆఫీస్‌ నుంచి వచ్చిన మహిత సంతోషంతో పలకరించింది.     
టాబ్‌లో సినిమా చూస్తోన్న మహిత చిన్నకూతుర్ని ‘‘నువ్వెప్పుడు యూ.యస్‌. వెళ్ళుతున్నావు?!’’ అని సుధారాణి అడిగింది. 
ఆమె చెప్పింది పెద్దగా పట్టించుకోకుండా మనసులో ‘మహిత యెంత అదృష్టవంతురాలో పిల్లలిద్దరూ తల్లి మాట జవదాటరు. మహిత సక్సెస్‌కి శ్రీకాంత్‌ ఆలోచనా కూడా కాంట్రిబ్యూట్‌ చేశాడా?! యేమో... మురళీ బావ యే విషయంలోనూ కలగచేసుకోడు. మనోజ్ఞ తనని కాదని యీ పెళ్ళి చేసుకొంటే తన తోబుట్టువుల యింట్లో తననెవరు లెక్క చేస్తారు?!’ అనుకుంది.
‘‘శ్రీవల్లీ మనోజ్ఞ ట్రెక్‌ నుంచి బేస్‌ క్యాంప్‌కి వచ్చేసరికే మారిన ఫోన్‌ రింగ్‌ టోన్‌ వెనుక లవ్‌ స్టోరీ వుందని గ్రహించ లేకపోయాను. అసలు అర్థమేమైనా వుందా ఆ పాటకి. పాడినప్పుడు చాల అట్రాక్టివ్‌గా అనిపించాడంట. యిదేమైనా సినిమానా? దుష్యంత్‌ రాంగ్‌ ఛాయిస్‌ అని శ్రీ వల్లికి చెప్పాలని..’’ సుధారాణి అంటుంటే మహితా శ్రీకాంత్‌ వొకరి మొఖమొకరు చూసుకొన్నారు.
‘‘కంగారుపడకు రాణీ, ఆలోచిద్దాం. నాకూ పిల్లలు యే ప్రేమలో పడతారోనని భయం. అందుకే కాస్త త్వరగా పెళ్ళి చేసేశాను పెద్దదానికి’’ అంది మహిత. 

డిన్నర్‌ చేసి యింటికి బయలుదేరుతూ ‘‘శ్రీవల్లీకి యీ పెళ్ళి వొద్దని మనమంతా మాట్లాడాలి. యింటికి రండి. యీ లోగా మురళీబావకి కూడా తనతో యెలా మాటాడాలో చెపుతాను. కాదంటారా తండ్రీ కూతుర్లని బయటకు పొమ్మంటాను’’ అంది సుధారాణి. 

 

తన మాటని యింట్లో యెవరు కాదన్నా సుధారాణీ విసిరే యీ యిమోషనల్‌ అస్త్రాన్ని సుధారాణినే చాల గర్వంగా చెపుతుంటుంది.
సుధారాణి వెళ్ళిపోయిన కాసేపటికి ‘‘అలాంటి ఆలోచనలతో పెద్దపాప పెళ్ళి చేసేయ్యాలని చేసేసావా?! నేనెందుకలా లొంగిపోయానని యిందాకట నుంచి ఆలోచిస్తున్నాను. నీలో యిలాంటి ఆలోచనలు వుంటాయని నాకెప్పుడూ తెలియనేలేదు’’ అన్నాడు శ్రీకాంత్‌. 
మహిత నిశ్శబ్దంగా శ్రీకాంత్‌ వైపుచూస్తోంది.
‘‘అప్పుడు మన పెళ్ళి కోసం వయస్సుకి మించిన బాధ్యత తీసుకొని అందరితో మాట్లాడిన సుధా యిప్పుడేమిటి యిలా ఆలోచిస్తోంది. ఆశ్చర్యం. ఆ తరువాత అలా వొకటో రెండో పెళ్లిళ్ళకి పెద్దరికం వహించింది. పోయిన యేడాది కూడా మీ ఫ్రెండ్‌ కూతురి ప్రేమ పెళ్ళికి రాయబారి తనే కదా. యిప్పుడు మనోజ్ఞ ప్రేమ పెళ్ళికి అభ్యంతరం చెపుతోంది. సుధా ఆలోచనల్లో యీ మార్పులు యెలా వచ్చాయి?! యెందుకొచ్చాయి?!
నువ్వెలా అయితే నిర్ణయాలు తీసుకొని కేవలం యిన్‌ఫర్మేషన్‌ కోసం నాకు చెపుతావో అలానే సుధారాణి కూడా మురళికి చెపుతున్నట్టనిపిస్తోంది. మన జీవితాల్లో డెమాక్రసీ వుండాలని కదా మనమంతా నమ్ముతాం. కానీ మీరిద్దరూ కూడా చాలా విషయాల్లో వన్‌ సైడెడ్‌గానే ఆలోచిస్తున్నారు. పిల్లలూ ఆలోచిస్తారనే ఆలోచనే మీరిద్దరూ చేస్తున్నట్టు లేరు. యెందుకలా మహీ’’ తన నమ్మకాలేవో గాయపడినట్టు బాధపడుతూ అడిగాడు శ్రీకాంత్‌.
మహిత ఆలోచిస్తూ ‘‘యింటినో వ్యక్తిగత జీవితాన్నో నడపటంలోని డెమాక్రసీ మీద నమ్మకం పోయినట్టుంది మాకు. మే బీ నాకు..’’ అంది.

అదిరిపడ్డాడు శ్రీకాంత్‌.

 

‘‘మగవాళ్ళకి డెమాక్రసీ అనే మాట మాటాడటం, ఆచరణలో పెడుతున్నట్టు కనిపించటంలో నిజానికి వాళ్ళు యేదో వొక రూపంలో లాభం పొందుతున్నారేమోనని నాకనిపిస్తుంది. ప్రజాస్వామికంగా మాటాడటం, వున్నట్టనిపించటం మగవాళ్ళకి చెల్లుతుందేమో కానీ మా ఆడవాళ్ళకి చెల్లదనుకుంటాను. యింటి విషయాలని యేదో వొక రూపంలో మా చేతుల్లో మా కంట్రోల్లో పెట్టుకోకపొతే మేం నష్టపోతామనే అనుమానం నాకైతే వుంది. పైకి యెంతో సమానత్వం వుందీ అని అనిపించినా, కనిపించినా కూడా నిజానికి గ్రౌండ్‌ లెవల్లో అలాంటిదేమీ లేదనే నాకనిపిస్తుంది. 
ప్రజాస్వామికంగా వుండటం అన్నది నీకు చెల్లుతుంది. నాకు చెల్లదు. యే యుద్ధాలు, కొట్లాటలు లేకుండా నీకు అన్నీ అమరుతాయి. ప్రతీదానికి పలురకాలుగా పోట్లాడితే తప్ప నేననుకున్నట్టు నాకు జరగదు. మా అమ్మకి యింట్లో తీసుకునే నిర్ణయాలపై యే అధికారం వుండేది కాదు. కానీ మేం కాస్త గాడి తప్పినా లేదా యింట్లో యే విషయంలో యే చిన్న తేడా వచ్చినా మా అమ్మే రెస్పాన్స్‌బుల్‌ అని మా నాన్నగారు మాటాడేవారు.
చాలా కుటుంబాల్లో ఆ పరిస్థితిని చూశాను. నా యింట్లో నిర్ణయాలపై నా పట్టు వుండాలని అనిపించిందనుకొంటాను. యిదంతా నాకు గత యిరవై యేళ్ళలో క్రమేపీ అర్థమవుతూ వచ్చిందనుకొంటాను. మే.. బీ.. సుధాకి కూడానేమో..’’ అని ఆగి శ్రీకాంత్‌ కళ్ళలోకి సూటిగా చూస్తూ ‘‘నీకు గుర్తుందో లేదో నిన్ను పెళ్ళి చేసుకోడానికి కూడా నేనే యుద్ధం చెయ్యాల్సి వచ్చింది. నువ్వు చేసిందేముంది?!’’ అంది మహిత.

శ్రీకాంత్‌కి మహిత కొత్తగా తోచింది.

 

‘‘కానీ శ్రీ, మీకు తెలియనిది వొకటుంది. యింటికి సంబంధించిన నా నిర్ణయాలని అమలుచేసేటప్పుడు బయటవాళ్ళ దగ్గరా బయట ప్రపంచంలో ‘‘మా శ్రీకాంత్‌ చెప్పాడు అనో మా శ్రీకాంత్‌ వొద్దన్నాడనో, నాన్నగారు వొప్పుకోరనో, మీ అబ్బాయి అన్నారనో చాలాసార్లు నీమీదకి తోసేస్తాను. భర్త మాటలకి నిర్ణయాలకి మన చుట్టూ వాళ్ళు గౌరవిస్తారు’’ అని నవ్వి
‘‘నా అభిమాన రచయితగారు భర్తల మీద భార్యలు యెలా తోస్తారోనని యెప్పుడో చెప్పార నుకో’’ అని ఆగి ‘‘మొత్తానికి నాతో నా లోపలి విషయాలన్నీ చెప్పించేశావు. యీ పెళ్ళి వొద్దని మనోజ్ఞని యెలా వొప్పించాలో ఆలోచించాలి శ్రీ. వెరీ యింపార్టెంట్‌’’ అంది మహిత.
*********
 
మహిత కారు డ్రైవ్‌ చేస్తోంది. శ్రీకాంత్‌ తన ఆఫీస్‌ కాల్‌లో వున్నాడు. కాల్‌ అవ్వగానే మహిత ‘‘శ్రీవల్లీని ఆ అబ్బాయి వొద్దని కన్విన్స్‌ చెయ్యాలి. మన పెళ్ళికి సుధా చాలా హెల్ప్‌ చేసింది. తనకిప్పుడు హెల్ప్‌ చెయ్యాలి శ్రీ’’   కృతజ్ఞత మహిత మాటల్లో స్పష్టంగా వినిపిస్తోంది.  
బయట ట్రాఫిక్‌ని చూస్తూ మౌనంగా వున్నాడు శ్రీకాంత్‌. 
‘‘మనల్ని కూడా పాటే కదా కలిపింది. ఆ అబ్బాయి పాడిన పాటతో యెట్రాక్ట్‌ అయితే మీయిద్దరికీ యెందుకంత చికాకేస్తోంది?’’ మహిత తనని కార్నర్‌ చేస్తున్నానని అనుకుంటుందోనని జాగ్రత్తగా వాక్యాన్ని ఫ్రేం చేసుకోడానికి ప్రయత్నిస్తూ నింపాదిగా అడిగాడు శ్రీకాంత్‌. 
‘‘వో.. జీవితం గురించి ఆలోచించుకోడానికి యేమంత లోతైన అర్థముందా పాటలో.?! ఆ వొక్కటీ చాలదా ఆ పిల్లవానికి జీవితం పట్ల డెప్త్‌ లేదని చెప్పడానికి. సుధా అన్నట్టు రైట్‌ చాయిస్‌ కాదేమో... ?!’’ అంది మహిత.
‘‘అరే.. సూపర్‌ హిట్‌ సాంగ్‌. యంగ్‌ థాట్‌. నేనిన్నిప్పుడు నిన్ను ప్రపోజ్‌ చేస్తే ఆ పాటే పాడతాను తెలుసా?!’’ నవ్వుతూ అంటూ ఆ పాటని హమ్‌ చేశాడు చిన్నగా.

‘‘అబ్బా.. నీకసలు సుఽధ బాధ పట్టటం లేదు’’ విసుక్కుంది మహిత.

 

‘‘కూల్‌ బేబీ కూల్‌.. అయినా మనిద్దరం యిష్టపడినప్పుడు మనిద్దరికీ మన గురించేమర్థమయిందో చెప్పు. కలిసి బతకటం మొదలు పెట్టాకే కదా యిద్దరం మెల్లమెల్లగా వొక అర్థవంతమైన జీవితంలోకి వచ్చాం. ‘‘మనిషికో స్నేహం .. మనసుకో దాహం’’ అనే పాటని డ్యూయెట్‌గా పాడటం మన మనసుల్ని విప్పుకునేట్టు చేసింది. ‘‘పదహారేళ్ళకి నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకి కోటి దండాలు’’ అనగానే చాలా మందిలానే మనమూ కనెక్ట్‌ అయిపోయాం. మనమప్పుడు ‘‘భ్రమలో లేచిన తొలి ఝాములకి, సమయం కుదిరిన సంధ్యవేళలకూ’’ అంటే యేమిటని ఆలోచించామా?! 

‘‘మన మూడ్‌కి ఆ పాటలు మనిద్దరి ఆకర్షణని యెండార్స్‌ చేశాయి. పాట మనసులని వెలిగిస్తుంది. ‘‘మనసున మల్లెల మాలలూగెనే’’ అంటే మన పెద్దవాళ్ళు,  ‘‘మనిషికో స్నేహం’’ అనో మనమూ, ‘‘కమ్మనీ యీ ప్రేమలేఖ అనో’’, ‘‘యింకేమి కావాలీ..’’ అనో ‘‘నువ్వు చాలునే’’ అంటేనో ‘‘చూపే బంగారమాయేనే’’... పాట యాంకర్‌ అంతే. యెవరి జీవితపు పడవని వారే ముందుకు తీసుకుపోవాలని మనందరికీ తెలుసు. చిన్నప్పుడే ఆ యింటి బాధ్యతలు తీసుకొన్న సుఽధ సక్సెస్‌ ఫుల్‌గా వాటిని నిర్వర్తించటంతో సుఽధలోని పవర్‌ డెమాక్రటిక్‌గా ఆలోచించటాన్ని మింగేసి కాస్త డిక్టేటర్‌గా ప్రవర్తించటం నేర్పించిందనుకొంటాను. 

 

రాత్రి నువ్వు చెప్పిందీ అదే కదా నీ గురించి. సుధా కోరుకున్నట్టు మనం శ్రీవల్లీకి నచ్చ చెప్పటం కాదు. శ్రీవల్లి మనోజ్ఞ, దుష్యంత్‌లు కోరుకున్నట్టు వాళ్ళ పెళ్ళి చెయ్యమని మనం సుధకి నచ్చచెప్పాలి’’  స్థిరమైన గొంతుతో స్పష్టంగా అన్నాడు శ్రీకాంత్‌.
‘మనిషికో స్నేహం .. మనసుకో దాహం’’ లేతసవ్వడిగా వినిపిస్తూనే వుంది.
 
*********
9866316174