ఎట్టకేలకు గణపతిరావ్ తీరనికోరిక తీరిపోయింది. ఉత్తమ ఉపాధ్యాయుడైపోయాడు! బెస్ట్ టీచర్ అవార్డు కొట్టేశాడు! దానికోసం పోటీపడిన మిగిలిన టీచర్లంతా నోళ్ళువెళ్ళబెట్టారు. తమ అక్కసు వెళ్ళగక్కారు. అవార్డు స్వీకరించాక గణపతిరావ్కిక సన్మానాలే సన్మానాలు, సత్కారాలే సత్కారాలు!! కానీ ఎటొచ్చీ ఇంట్లో కూడా అతడికి అప్పోజిషను ఎదురైంది. అతడి భార్యకి ఇదంతా నచ్చలేదు! నానాదెప్పుళ్ళూ దెప్పసాగింది. ఎందుకని?
‘‘గణపతిరావ్! ఇదేందయ్యా! ఇంగ్లీషు, లెక్కలు చెప్పడంలో ఘటికుడునని సర్టిఫికెట్లో రాసుకున్నావ్? నువ్వు స్కూల్లో పిల్లలకు చెప్పేసబ్జెక్టులు అవికావుగా?’’ అడిగాడు స్కూలు హెడ్మాస్టర్ పూర్ణానందయ్య.పూర్ణానందయ్యకి ఎమ్యెల్యే మునిస్వామి బంధువు. అందుకని తనకి బెస్ట్ టీచర్ అవార్డు యిప్పించమని రికమండేషన్ లెటర్ రాసిచ్చాడు. పూర్ణానందయ్య ఆల్రెడీ ఆ గౌరవం అందుకున్నాడు కాబట్టి ఈసారి తనకు యిప్పించమని వెంటపడ్డాడు గణపతిరావు. అందుకే ఈ సర్టిఫికెట్.‘‘సార్! మీకు తెలియంది ఏముంది? ఇంగ్లీషు, లెక్కలు చెప్పే టీచర్లంటేనే అందరికీ క్రేజ్. అందుకే నా క్వాలిఫికేషన్స్ సర్టిఫికెట్లో అట్లా రాసి తెచ్చాను. దానివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదులెండి. ఎమ్మెల్యేగారు రికమండ్ చేస్తే మినిష్టర్ పేషీ వాళ్ళు ఆటోమేటిక్గా అవార్డ్ ఇచ్చేస్తారు’’ చెప్పాడు గణపతిరావు.
‘‘లేనిపోని గొప్పలు రాసుకొచ్చావు. తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నన్నేమీ అనకూడదు’’ అన్నాడు పూర్ణానందయ్య.‘‘దీనిమీద వెరిఫికేషన్ ఏమీ ఉండదుసార్! గణపతిరావు పిల్లలకి ఇంగ్లీషు, లెక్కలు బోధిస్తున్నాడా లేదా? అని ఎవరూ ఎంక్వయిరీకి రారు సార్. నా మాటనమ్మండి’’ భరోసా ఇచ్చాడు గణపతిరావు.‘‘నాదేం లేదయ్యా! దీనివల్ల నీకేదైనా ప్రాబ్లం అవుతుందేమోనని నా సిక్త్స్ సెన్స్ హెచ్చరిస్తోంది’’ అంటూ పూర్ణానందయ్య గ్రీన్ కలర్ పెన్నుతో సంతకం పెట్టేశాడు.గణపతిరావు పరమానందపడిపోతూ ఎమ్మెల్యే మునిస్వామి ఇంటికివెళ్ళాడు.
తన బంధువు హెడ్మాస్టర్ పూర్ణానందయ్య పంపించాడనగానే ఆయన సాదరంగా ఆహ్వానించి ఆఫీసుగదిలో ఆశీనుడిని చేశారు ఎమ్మెల్యే. ఆయన ఆ యోగ్యతాపత్రం చదివి ఆనందించాడు.‘‘చాలా సంతోషమండీ గణపతిరావుగారూ! మీరు ఇంగ్లీషు, లెక్కలు బోధించడంలో ఘటికులనీ అందువల్లనే టెన్త్లో తొంభైశాతం పిల్లలు వుతున్నారనీ మా పూర్ణానందయ్య రాశాడు. మీకు బెస్ట్ టీచర్ అవార్డ్ ఇవ్వమని మినిష్టర్గారికి లేఖ రాస్తాను’’ అని చెప్పాడు.