లెక్కలేనన్ని ఎలకపళ్లతో మెత్తగా దూకింది చలికాలం. తలుపు పక్కనో, గుమ్మం పక్కనో, గోడ మీదో పడుకుని నిశ్శబ్దంగా ఇంట్లోకి దూకిన తెల్లపిల్లిలా, కుర్చీలోంచి తలుపు ఊచల అవతలి ఉదయాన్ని మరోసారి చూశాడు వరదాచార్యులుగారు. భుజంమీద వంగపండురంగు శాలువా సవరించుకుని, లుంగీ మోకాళ్ళపైకి లాక్కుని, కాళ్ళు చిన్నపీటమీద పెట్టుకుని నిస్సహాయంగా నారాయణమూర్తిని తల్చుకున్నారాయన.
ఎండ వెచ్చగా మోకాళ్ళమీద పడుతోంది. (‘‘ఆహా. నారాయణమూర్తీ నాయనా’’) ఇంకెంతసేపు. మరోపావుగంటలో ఎండ కొత్తబ్లేడులా మోకాళ్లమీదపడి చురుక్కుమంటుంది. కుర్చీ పక్కనే ఆయనలాగే చల్లబడిపోయి కూచుంది కాఫీ గ్లాసు. మరి కొంచెం వెచ్చటి కాఫీ కావాలనిపించింది ఆయనకి. వరదగారి భార్య డైనింగ్ టేబుల్ దగ్గర కూచుని మెల్లిగా మోకాళ్ళు ఒత్తుకుంటోంది. (‘‘ఈ దిక్కుమాలిన పాట్లేవిటో’’) లేచివెళ్ళి స్నానంచేసి వంటపని చేసుకోవాలని ఆమె మనసు అంటున్నా మోకాళ్ళు మొరాయిస్తున్నాయి. వంటింట్లోంచి హాల్లోకి నడిచేసరికి నరకంమే. నారాయణమూర్తే కనిపిస్తున్నా రామెకు.‘‘ఇదుగో’’ పిలిచాడు వరదాచార్యులుగారు.
మోకాళ్ళు ఒత్తుకుంటూ వరదగారి గదివైపు చూసిందామె. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మోకాళ్ళు ఒత్తుకుంటోందని తెలుసాయనకి.‘‘ఊ అనవేవే? వినబడ్డం లేదా ఏం ఖర్మ?’’‘‘అదొక్కటే తక్కువ’’.‘‘ఊ అనొచ్చుగా. కొంచెం కాఫీ. వేడిగా ఉండాలి. సోడాలా గాదు’’‘‘సోడాలాగే పుచ్చుకుంటున్నారు గావును. వేడి మసుళ్ళు’’.‘‘కాఫీ పట్రా. నీ అరవకోడలి దగ్గర కాఫీ చెయ్యడం నేర్చుకోమంటే వినవు’’.‘‘అదొక్కటే తక్కువ నాకు. పోనీ మీరే వెళ్ళి అక్కడుండండి’’.‘‘కదిలిస్తే చాలు నస’’.‘‘మీరే కాదు. నేనూ లేవలేను. దిక్కుమాలిన కాళ్ళు. లేవలేను. కూచోలేను. అయినా ఆ మాత్రం కాఫీ కలుపుకోడం కూడా రాదు. కోడలి దగ్గిర కూచుని మీరే నేర్చుకోవాల్సింది మరి’’.