‘‘అమ్మా...అమ్మా’’ అంటూ చిన్నారి శ్వేత మూలుగుతోంది.పాప ఒంటిమీద చేయివేసి ఉలిక్కిపడింది స్నేహ.ఒళ్ళు కాలుతోంది.‘అమ్మో ఎంత వేడిగా ఉందో?’టైం చూసింది. రాత్రి రెండు.‘ఇంత రాత్రివేళ ఎక్కడికెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఎవరు నాకు తోడు?’ఒక్కసారిగా స్నేహకు దుఃఖం ముంచుకొచ్చింది.
ఏడిస్తే పాప మరీ బెంగపడుతుందనుకుని తన్ను తాను సమాళించుకుంది. లేచి పక్కనే షెల్ప్లో ఉన్న మందుల్లోంచి జ్వరం సిరప్ తీసి శ్వేతను లేపి కూచోబెట్టి నిదానంగా మందు తాగించింది.పాప అలాగే స్నేహ ఒళ్ళోనే ముడుచుకుని పడుకుంది.పక్కనేవున్న దుప్పటితీసి కప్పి మెల్లగా జోకొట్టింది.మందు ప్రభావంతో శ్వేత నిదానంగా నిద్రలోకి జారుకుంది.బాగా నిద్రపోయినపోయిన తర్వాత మెల్లగా తలను తీసి దిండుపైకి మార్చి ఆ పక్కనే తనూ ఒరిగింది స్నేహ.నిద్రలో కదిలిన శ్వేత, రెండూ చేతుల్తో తల్లి చేయిని గట్టిగా పట్టుకుంది.పాప తల నిమురుతూ తదేకంగా చూస్తూ మెల్లగా కళ్ళు మూసుకుంది స్నేహ.
ఆ మూసిన కనురెప్పల వెనక లోతైన కథ ఉంది. స్నేహ, మిత్రలది ప్రేమ వివాహం. మొదట ఇద్దరు ఓ రెండు మూడేళ్ళు వరకు చాలా అన్యోన్యంగా, స్నేహ అంటే మిత్ర, మిత్ర అంటే స్నేహ అన్నట్టు ఒకేమాట మీద ఉండేవారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరికీ చెరో అరవైవేలు జీతం. వీరిద్దరి వివాహానికి స్నేహ వాళ్ళింట్లో ఒప్పుకున్నారు గాని, మిత్ర ఇంట్లోవాళ్ళకి మహాపట్టింపులు. ససేమిరా అన్నారు. దాంతో వాళ్ళ వివాహం తర్వాత మిత్ర కుటుంబ సభ్యులతో తెగతెంపులయిపోయాయి.ఇక స్నేహకు సలహాలు, సంప్రదింపులు, నిర్ణయాలు, అన్నీ తన తల్లితోనే.