పిచ్చుకల కిచకిచల్ని అనుకరిస్తూ కాలింగ్ బెల్ మోగింది. హాల్లో పేపర్ చదువుతున్న నేను పూజగదిలో ఉన్న ప్రగతికేసి చూశా, తలుపుతియ్యడం నీ డ్యూటీ అన్నట్టు.మర్యాద ఏమాత్రం తగ్గకుండానే విసుక్కుంటూ,మంత్రాలు నోట్లోనే చదువుకుంటూ నన్నుదాటుకుని వెళ్లి తలుపు తీసింది.
‘‘నమస్తే అమ్మా .. నమస్తే సర్’’ అంటూ బుజ్జి లోపలికి వచ్చి, చేతిలో క్యారేజ్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి, కవర్ మాత్రం నా చేతిలో పెట్టాడు.బుజ్జి ఓ క్యాటరర్. ఎప్పుడు చూసినా అప్పుడే స్నానం చేసినట్టు, కవరులోంచి తీసిన కొత్త సబ్బులా శుభ్రంగా ఉంటాడు. తెల్ల బట్టలు, నొసటిన విభూతితో, అతన్ని చూస్తే మర్డర్లు చేసేవాడు కూడా మారు మాట్లాడకుండా మారిపోయేంత ప్రశాంతంగా, పాజిటివ్‌గా ఉంటాడు.విశాఖపట్నం సిటీకి ఉత్తరం వైపు పది కిలోమీటర్ల దూరంలో మా మావగారు నాకో స్థలం ఇచ్చారు. రెక్కలొచ్చిన రియల్ ఎస్టేట్‌లో ఏ గద్దో తన్నుకు పోకుండా నా నాలుగొందల గజాల కోడిపిల్లని కాపాడుకోడానికి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి ఓ రెండు గదుల షెడ్డు వేశాను. అందులో ప్రస్తుతం బుజ్జి తన మెయిన్ కిచెన్‌ని నడుపుతున్నాడు. అక్కడి నుంచే తన క్యాటరింగ్ అంతా సప్లయ్ చేస్తూ ఉంటాడు.
ప్రతీనెలా అతను రెంటు ఇవ్వగానే క్యాలెండరులో నెల మార్చుకోవచ్చు. అంత ఠంచనుగా రెంట్ ఇవ్వటం వల్ల నాకూ, అదే చేత్తో ఆరోజు చేసిన వంటలతో ఓ చిన్న క్యారేజీ తెచ్చివ్వటం వల్ల నా భార్యకూ అని కాకుండా.. నిజంగా అతను మంచివాడు, నెమ్మదస్తుడు. సర్వీస్ బాగా చేస్తాడని ఊర్లో కూడా మంచి పేరుంది.క్యారేజీ లోంచి వచ్చే ఘుమఘుమలతో ఓ గంట ముందే ఆకలి మొదలైంది. ప్రగతి మొహం చేటంతయింది. రెంట్ కవర్ జేబులో పెట్టుకున్నా. బుజ్జి ప్రగతి ఇచ్చిన కాఫీ తాగుతూ ఉండగా నెమ్మదిగా ...‘‘ఏం బుజ్జీ, నే చెప్పినదేం చేశావు. వేరే ఏదైనా చూసుకున్నావా?’’ అడిగాను కొంచెం బాధగానే.సిటీలో అపార్ట్మెంట్ బాగా ఇరుగ్గా ఉంది. అందుకే ఆ స్థలంలో ఓ మంచి డూప్లెక్స్ ఇల్లు కట్టుకుందామని ప్లాన్ అప్రూవల్ చేయించా. బుజ్జికి ఖాళీ చెయ్యమని పోయిన నెల్లోనే చెప్పేశా. అదే విషయం మళ్ళీ ఓ సారి