‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ... కొంగట్టుకు తిరుగుతూ... నా కొంగట్టుకు తిరుగుతూ... ఏవో ప్రశ్నలడుగుతూ గలగలమని నవ్వుతూ కాలం గడిపేవు..’ పాలగుమ్మి విశ్వనాథంగారి లలిత సంగీతం పాటని నెట్లో వింటూ హ్యాపీగా ఫీలైపోతున్నాడు సీనియర్ ఇంటర్ చదువుతున్న విక్రమ్. నైన్త్ చదువుతున్న పావని అప్పుడే స్కూల్ యూనిఫారంలోవచ్చి విక్రమ్‌ని అడిగింది, ‘‘మా అమ్మేది...’’ అని. ఇయర్ ఫోన్ తీయకుండా, ఆమె ఏమడుగుతుందో వినిపించుకోకుండానే భుజాలెగరేశాడు విక్రమ్. ఆ అమ్మాయి అతని చెవికి దగ్గరగావచ్చి బిగ్గరగా, ‘‘మా అమ్మేదీ...’’ అని అరచి ఎంటర్‌కీ నొక్కేసింది. ‘‘మీ అమ్మని చూడకుంటే నీకు బెంగ! మరి మా అమ్మని చూడకుంటే నాకు బెంగ ఉండదా?’’ బుంగమూతి పెట్టి ప్రశ్నించింది పావని.
‘‘ఏందే మా వాడితో సరసాలు, మీ అమ్మ కళ్ళుతిరిగి కిందపడితే గాంధీ ఆసుపత్రికి తీస్కొనిపోయారు మీ బస్తీ జనాలు’’ సూర్యకాంతం టైపులో అరుస్తూ, వెనకనించి పావనిని గదమాయించింది విక్రమ్ తల్లి.‘‘ఒరేయ్ విక్కీ అది పనిదాని కూతురు. దాంతో ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండాలి తెలిసిందా’’ అని కొడుక్కి వార్నింగ్ ఇచ్చి మరీ నిష్క్రమించింది తల్లి.పావని తల్లి యాదమ్మ. విక్రమ్ ఇంట్లో పనిమనిషి. యజమాని మాధవరావు రియల్ ఎస్టేట్ వ్యాపారంచేసి, ప్రస్తుతం అది లాభసాటిగా లేదని రాజకీయాల్లోకి ప్రవేశించాడు. యాదమ్మ కూతురు పావని చదువు ఖర్చంతా తనే భరిస్తున్నాడు. పావని తెలివితేటలకి మురిసిపోయిన మాధవరావు, ఇంట్లోవాళ్ళతో పావని ఎంత చనువుగా ఉన్నా పెద్దగా పట్టించుకోడు. అమ్మ, ఆసుపత్రి..అనే పేర్లు వినగానే ఏడుస్తూ ఇంటికి పరుగుతీసింది పావని.