తనను ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులకు అవసానదశలో పెద్ద కష్టం వచ్చింది. ఇద్దరు అన్నయ్యలున్నాగానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవలు చేయడానికి వంకలుపెట్టి తప్పించుకుంటున్నారు వాళ్ళు. అన్నయ్యలుండగా వాళ్ళబాధ్యత తనెందుకు తీసుకోవాలని ఆలోచిస్తోంది ఆ కూతురు. వాళ్ళకు నచ్చజెప్పిచూసింది. ఆస్తులు పంచుకోవడానికితప్ప అమ్మకు సేవచేయడానికి వాళ్ళు ముందుకు రాలేదు. అప్పుడు ఏం జరిగిందంటే.....
*******************************
‘‘అమ్మా! ఆగు... వెళ్లకు...వెళ్లకు...ఆగమ్మా!’’నా మనసు ఆక్రోశిస్తోంది. రోదిస్తోంది. పైకి అరవాలనీ, అమ్మను ఆపాలనీ విశ్వప్రయత్నం చేశాను. గొంతుకు ఏదో అడ్డం పడినట్లు మాటలు పెగలడం లేదు.కళ్ళు నీళ్ళతో నిండి అమ్మరూపం మసకబారి నెమ్మదిగా అదృశ్యమవుతోంది. లేదు, అమ్మ వెళ్లడానికి వీల్లేదు. చివరిప్రయత్నంగా ‘‘అమ్మా...’’ అంటూ గొంతుచించుకుని అరిచాను. ఒక్కసారిగా ఎవరో కుదిపినట్టై మెలకువ వచ్చింది.‘‘ఏమిటా కలవరింతలు? పగలంతా ఏవో పనికిమాలిన పుస్తకాలు చదువుతావు. రాత్రుళ్లు పీడకలలతో పలవరింతలు. లే...లేచి మంచినీళ్ళు తాగి పడుకో’’ మాధవ్ విసుక్కున్నాడు.‘పీడకలా? ఇది కలేనా? ఎంతో స్పష్టంగా మెలకువ వచ్చేదాకా ‘ఇదికల’ అన్న స్పృహేలేనట్లు... ఇంతకుముందే జరిగిన సంఘటనలా అనిపిస్తోంది. నిజం కాదనుకోవడంఎట్లా? ఇంకా అమ్మమాటలు నా చెవుల్లో మార్మోగుతున్నాయే! ఏమంది అమ్మ?‘‘చిన్నా! ఏ తల్లికైనా పిల్లలు శాపాలు కాకూడదమ్మా! మనోధైర్యం కావాలి. కానీ నా దౌర్భాగ్యంచూడు. ఇన్ని కాన్పులు జరిగినా నేను గొడ్రాలినే’’ అమ్మ కళ్ళల్లో నీళ్ళు.
నిండుగా జరీచీర కట్టుకుని ఉంది. నుదట కాసంత బొట్టు, రవ్వల ముక్కుపుడక, తలనిండా పూలు. ఆ ముఖంలో ఎంతో తేజస్సు. కళ్ళల్లో మాత్రం అంతులేని ఆవేదన గుమ్మంలోనే నిలబడి ఉంది.‘‘అమ్మా! అక్కడే నిలబడ్డావేం? లోపలికి రామ్మా!’’ అన్నాను.‘‘ఆ మాట నువ్వు మనస్ఫూర్తిగానే అంటున్నావా?’’‘‘అయ్యో! ఎందుకమ్మా ఆ అనుమానం?’’‘‘ఎందుకో తెలీదూ?’’ నవ్వింది అమ్మ.‘‘అమ్మా! అలాగే నవ్వు. నవ్వితే ఎంత బావున్నావమ్మా! అబ్బ! ఎంత నిండుగా, ఆరోగ్యంగా ఉన్నావు!’’ అన్నాను సంతోషంగా.‘‘నా ఆరోగ్యం బావుందంటున్నావా చిన్నా? ఇదిగో, ఇవి చూడవే! ఇదీ నా ఆరోగ్యం’’ అంటూ చటుక్కున కప్పుకున్న చీరకొంగు తొలగించింది. కళ్ళు చెదిరాయి. గిర్రున తల తిరిగింది.అమ్మ గుండెనిండా తూట్లు. ఆ గాయాలనుండి రక్తం బొట్లు బొట్లుగా కారుతూ, భయంకరంగా ఉంది.