‘‘ఎందుకు నాన్నా? ఎందుకింత అకస్మాత్తుగా విమలకుపెళ్ళి చేస్తున్నారు? అది చక్కగా చదువు కుంటోందిగా?’’ తండ్రిని అడిగాడు కుమార్.చెల్లెలి పెళ్ళి ఏర్పాట్ల వార్త తెలిసి బయలుదేరి వచ్చాడు కుమార్.‘‘ఎందుకేమిటిరా దానికి వయసు వస్తోందిగా?’’ అన్నాడు కోదండం.‘‘విమలకి నిండా పద్దెనిమిదేళ్ళు కూడా లేవు. కనీసం దాని అభిప్రాయం అడిగారా?’’
‘‘ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. దాని జాతకం చూపించాను చేస్తే, ఈ ఏడాదిలోనే పెళ్ళిచెయ్యమన్నారు. లేకపోతే మరో ఐదేళ్ళవరకు ఆ ప్రస్తావనే తేవద్దన్నారు సిద్ధాంతిగారు’’ అన్నాడు కోదండం.‘‘సరే, పెళ్ళి చేస్తే చేస్తున్నారుగానీ, అదేమన్నా మంచి సంబంధమనుకున్నారా? అతనికి స్పిన్నింగ్ మిల్లులో ఉద్యోగం. ఏడాదికి కనీసం పదిసార్లు సమ్మెలతోనే సరిపోతోంది. జీతాలు సరిగ్గా యివ్వడంలేదట, నేను ఎంక్వైరీ చేశాను’’ అన్నాడు కుమార్. అతనికి తండ్రి మీద కోపం వస్తోంది.‘‘రోజులన్నీ ఒకేలాగా ఉంటాయా? మనం అనుకున్నప్పుడు మంచి సంబంధాలురావు. వాళ్ళది మంచి కుటుంబం. పెళ్ళికొడుకు మంచివాడు. ఏ చెడు అలవాట్లు లేవు. అందగాడు. అతని పేరుమీద ఇరవై ఎకరాలు పొలం ఉంది. అంతా అతనిదే. ఉన్న ఒక్క ఆడపిల్లకి పెళ్ళిచేసి పంపేశారు.
ఆ అమ్మాయికి పసుపు కుంకుమ క్రింద ఇవ్వాల్సింది భారీగానే ఇచ్చేశారుట. పైగా వీళ్ళిద్దరి జాతకాలు కలిశాయి’’.‘‘హు... జాతకాలు కాదునాన్నా, జీవితాలు కలవాలి’’ ఈసడింపుగా అన్నాడు కుమార్.ఇక లాభంలేదని హుకుం జారీచేశాడు కోదండం ‘‘నేను చెబుతున్నా ఈ పెళ్ళి జరగాల్సిందే. నాకు వెంకటాద్రి బాగా నచ్చాడు. మన అమ్మాయిని చేసుకుంటే, అతను గొప్ప అదృష్టవంతుడవుతాడని సిద్దాంతిగారు చెప్పారు’’.కోదండం ఆగ్రహం చూసి, మళ్ళీ మాట్లాడలేకపోయాడు కుమార్.అలా వెంకటాద్రి, విమల పెళ్ళైపోయింది. ఈ సంఘటన జరిగింది 1960లో.