ఆకుపచ్చని అరకులోయ అడవితల్లి ఒడిలో పెరిగిన ముద్దుబిడ్డ ఆమె. ఈ పండుటాకు వయసులో జ్ఞాపకాల పందిరికింద కాలం గడుపుతోందామె. ఆమె జ్ఞాపకాలచెట్టుకు పూచినపువ్వులు ఆమె చుట్టూ ఉన్నవారిని కూడా అలరిస్తూ స్ఫూర్తినిస్తున్నాయి. పచ్చని అరకులోయ ఆమెకు ఎంతో సంస్కారం నేర్పింది. ఎన్నో ఆలోచనలిచ్చింది. కానీ ఇప్పుడా అడవితల్లి విలవిలలాడిపోతోంది. ఆవేదనతో ఆమె హృదయం గిలగిలలాడుతోంది.
మనసు విహంగమై విహరిస్తోంది. దాచుకున్న జ్ఞాపకాలు ఎవరో వలవేసి లాగినట్లు గట్లుతెంచుకుని పరుగుపెడుతున్నాయి. అమెరికా నుంచి బయలుదేరిన విమానం భరతభూమిని తాకేదాకా నాతోపాటు నా జ్ఞాపకాలబుట్టను మోస్తూ ఆకాశమే తనదన్న ఠీవిగా విమానం మహాసముద్రాలు దాటుకుంటూ గమ్యం దిశగా పయనిస్తోంది. పుట్టగానే అమెరికా పౌరసత్వం పొందిన మనవడిని ఆరునెలలపాటు పెంచి, ఆప్యాయత పంచి, పొత్తిళ్ళలోని పసివాడిని వదలలేక మనసుపడ్డ వేదన ఇంకా పచ్చిగా సలుపుతూనే ఉంది. మళ్ళీ ఎన్నాళ్ళకు చూస్తానో! కొన్న వస్తువులకే జీవితకాల హామీలేదు. ఎప్పుడు పుటుక్కుమంటుందో తెలియని ప్రాణాలకెక్కడ హామీ! ఆ ప్రాణాన్ని నిలుపుకుని జీవితంలో వాడి పూర్తి ఎదుగుదల చూస్తూ గడిపేయాలనే బలమైన కోరిక మేరుపర్వతమై నిలిచి ఏ ఆహారాన్ని చూసినా వద్దు తినకు ఆరోగ్యం జాగ్రత్త అని మనసుచేసే హెచ్చరికలు నాలో చిరునవ్వులు మొలకెత్తడం గమనించాడేమో.
‘‘ఏమ్మా, ఏమీ తినడం లేదు!’’ అని ఆసక్తిగా అడిగాడు పక్కసీటులో కుర్రాడు.‘‘పండ్లు తిన్నానుగా చాలు బాబు, అయినా అన్నీ తిని అరాయించుకునే వయసా మాది’’ అంటూ నవ్వాను.ఇక మేము నేసిన మాటలపందిరిలో ఆ అబ్బాయి పేరు సందీప్అనీ, పుట్టిన ఊరు విజయనగరమనీ, ఆంధ్రా యూనివర్సిటీలో చదివాడని తెలిసింది.‘‘మీ ఊరు ఏదండీ?’’ చప్పున అడిగాడు.‘‘ఏమని చెప్పాలి? ఏదని చెప్పాలి?’’‘విమానం చేరుకుంటున్న గమ్యమే నా ఊరని చెప్పనా! పుట్టిన స్థలంలోనే పురిటి వాసనలు మరచిన ఊరుపేరు చెప్పనా!’‘ఏమీ చెప్పకపోతే టెస్ట్ట్యూబ్ బేబి అనుకుంటాడేమో!’ అని నవ్వుకున్నాను.బదులివ్వకుండా నవ్వుకుంటున్న నా వైపు ఆశ్చర్యంగా చూశాడు.అతడి ప్రశ్న అర్థమైందన్నట్లు ఉపోద్ఘాతంగా తల ఊపి, చెప్పసాగాను.‘‘మరి నా జ్ఞాపకాలలో నిలిచిన ఊరే నా ఊరు. నేను పెరిగిన ఊరు. నా మనసుకు మెరుగులు దిద్దిన ఊరు’’.