ఎదుట లేకపోతే ఎరుక ఉండదు. మనుషులకే కాదు. దేశాలకీ వర్తిస్తుందిది.దాదాపు పన్నెండేళ్ళ తరువాత ఇండియా ప్రయాణం పడింది నాకు.అమెరికా వెళ్ళిన కొత్తలో ప్రతి రెండేళ్ళకొకసారి ఇండియా వెళ్ళేవాణ్ణి. పిల్లలు పుట్టి ఎదిగాక, ఎప్పుడైనా ఒకసారి వెళ్ళేవాణ్ణి. విజీ పేరెంట్స్ కూడా అమెరికాలో కొడుకు దగ్గరకే వచ్చేశారు.అమ్మ ఉన్నన్నాళ్ళూ రమ్మనమని పోరేది. ఆవిడ పోయాక ఆ అవసరం పడలేదు నాకు.ఇప్పుడు కూడా తప్పని పరిస్థితుల్లో వచ్చాను.కావాలని పెట్టుకున్న ప్రయాణం కాదిది.స్టీవ్ వెళ్ళమని పోరితే బయల్దేరాను కానీ, విషయం తెలిసినప్పుడు తర్వాత చూడచ్చులే అనుకున్నాను.
**********************************
శుక్రవారం మార్చి 15, 2013 డియర్ స్టీవ్:
ఎలా మొదలుపెట్టాలో తెలీడం లేదు.యాదృచ్ఛికంగా నువ్వు మీ నాన్న గురించి చెప్పినవి నన్నింకా వెంటాడుతూనే ఉన్నాయి. అమెరికా వేరు, ఇండియా వేరు అనుకున్నానుగానీ దాదాపుగా నాకూ అచ్చం అవే అనుభవాలూ అవే సంఘటనలూ. నీ అనుభవం నుండి రాసి పంపినవి కేవలం వాక్యాలు కావు.ఒక్కొక్కటీ ఒక్కొక్క జీవిత సత్యం. అవన్నీ నేను దాచిపెట్టుకున్నాను. వయసుమీదపడ్డాక జీవితం ఇంత దుర్భరంగా ఉంటుందా? అన్నది కళ్ళారా చూస్తున్నాను.అందుకే ప్రతిరోజూ నాకు కలిగిన ఫీలింగ్స్ నీకు రాయాలని నిశ్చయించుకున్నాను. రోజూ మెయిల్స్ పంపి నిన్ను సతాయించడం ఇష్టంలేదు. అన్నీ ఒకేసారి పంపుతాను, నేను బయల్దేరేముందు, ఇప్పుడు ఇలా నీకు మెయిల్ రాయడంలో నా స్వార్థం ఉంది. పేరుకు నీకు రాసినా ఇది నీ కోసం కాదు, నా పిల్లలకోసం! వాళ్ళకి ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, నాకు ఇంతవయసొచ్చాక అర్థమైనట్లుగానే, ముందుముందు ఎప్పుడైనా వాళ్ళు కూడా ఈ మెయిల్ చూస్తారన్న ఆశ. అర్థం చేసుకుంటారన్న ఆశ. అందుకే ఇంగ్లీషులో రాస్తున్నాను ఈ ఉత్తరం.