వాళ్ళిద్దరూ విడదీయరాని జంట. యాదృచ్ఛికంగా ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. ఒకేసారి కలిసి ఆఫీసుకొస్తారు. కలిసి భోంచేస్తారు. కలిసి క్యాంటిన్‌కి వెళతారు. కలిసి మళ్ళీ ఇంటికెళతారు. షాపింగ్, బజార్..ఎక్కడికెళ్ళినా వాళ్ళిద్దరే. స్నేహితులకు, కొలీగ్స్కూ తావివ్వరు. నిజం చెప్పాలంటే, వాళ్ళిద్దరికీ ప్రత్యేకించి ప్రైవేట్ లైఫ్ అంటూ ఏదీ లేదు. ఇద్దరూ వాచ్‌డాగ్స్‌లా ఒకరినొకరు కాపలాకాసుకుంటూ ఉంటారు. కానీ...
‘‘ఇవాళ ప్రేమపక్షులు రాలేదోయ్’’ అంది ఉమ.మేమిద్దరం లంచ్ టైమ్‌లో క్యాంటీన్వైపు బయలుదేరుతుంటే.‘అవునా! ప్రైవేటు చానెల్స్‌లో వార్తలు ఎంత అవసరమో అంతే క్లుప్తంగా చెప్తున్నారంటే నమ్మొచ్చు. ప్రజలంతా మొబైల్స్ పారేసి ఉత్తరాలతో కమ్యూనికేట్ చేసుకుంటున్నారంటే నమ్మొచ్చు కానీ లలితా, భాస్కర్లు ఆఫీస్‌కి రాలేదంటే నమ్మడం ఎలా?’నేను ఇవాళ చాలా బిజీగా ఉన్నాను. ఆఫీసుకి వచ్చిన దగ్గరనుంచి వంచిన తలఎత్తకుండా పని చేస్తే ఇప్పుడు లంచ్ తినడానికి వీలు కుదిరింది. ఇయర్ ఎండింగ్ వల్ల అకౌంట్స్ డిపార్టుమెంటు వాళ్ళందరం బిజీగా ఉన్నాం.‘‘ఎందుకు రాలేదో తెలుసా?’’ కుతూహలంగా అడిగాను.‘‘లేదు కనీసం ఫోన్ అయినా చేయలేదు. పాపం ఏమైందో!’’ అంది ఉమ మళ్ళీ.లలితా, భాస్కర్ భార్యాభర్తలు. వాళ్ళకి పెళ్ళై రెండేళ్ళు.ఇద్దరూ మా ఆఫీస్‌లోనే పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకే ఆఫీసులో పనిచేయడం యాదృచ్ఛికం.
మేమందరం ఒకేబ్యాచ్లో సర్వీస్ కమిషన్ నుంచి అప్పాయింటయ్యాం. మేము ఆఫీస్‌లో చేరిన కొద్దిరోజులకే వాళ్ళ పెళ్ళైంది. అది కూడా పెద్దలు కుదిర్చిన పెళ్ళే.పెళ్ళి తరవాత నుంచి ఈ రోజువరకూ వాళ్ళిద్దరిని విడివిడిగా చూడలేదు. ఇద్దరు ఒకేసెక్షన్. ఉదయం ఇద్దరూ కలిసి బండిమీద ఆఫీసుకి వస్తారు. ఇద్దరూ కలిసి లంచ్ చేస్తారు. ఇద్దరూ కలిసి క్యాంటీన్‌కి వెళ్లి కాఫీ తాగుతారు. వాళ్ళు జంట చూసి అందరూ ముచ్చటపడి వాళ్ళకి చిలక గోరింక అని, ప్రేమపక్షులు అని రకరకాల పేర్లుపెట్టారు.ఆ సెక్షన్లో మేము మొత్తం ఐదుగురు ఆడవాళ్ళం. ఎంతో స్నేహంగా ఉంటాం. కలిసి లంచ్ చేస్తాం. ఒకళ్ళ బాక్స్‌లోంచి ఒకళ్ళు షేర్ చేసుకుంటాం. ఒకరికి ఇష్టం అని ఉప్మానో, ఇడ్లీనో, పులిహోరో తెస్తుంటాం. అప్పుడప్పుడు లలితని కూడా మాతో జాయినవమని పిలుస్తుంటాం. కానీ ఎప్పుడూ రాదు. ‘‘లేదండి మావారు ఎదురు చూస్తున్నారు నాకోసం’’ అంటూ తిరస్కరిస్తుంది.