అక్కడున్న వాళ్ళందరికీ, ఏ ఫోన్‌కాల్ ద్వారా ఏ పని దొరుకుతుందో వాళ్ళకే తెలియదు.వాళ్ళల్లో ఆడ, మగ కూడా ఉన్నారు. అందరి వయసు దరిదాపు నలభై లోపే. వయసుమీరినవాళ్ళని, ఆ ఇంటి యజమాని చంద్రమౌళి చేర్చుకోడు. ఆ కార్యాలయం పేరు ‘ఆదరణ హోం సర్వీసెస్’. ఆ హోంలో పని చేస్తున్నవాళ్ళలో ఎనభై శాతంమంది ఇరవై–ఇరవై ఐదేళ్ళ వయసువాళ్ళే.
నాలుగేళ్ళ క్రితం, ఏ ఆధారం లేకుండా హైద్రాబాద్ వచ్చినవాడే చంద్రమౌళి. తనూ ఇలాంటి ఓ హోమ్‌లో పని చేసినవాడే. వచ్చిన కొత్తలో రోజుగడవటానికి రకరకాలు పనులు చేశాడు. అందుకే ఈ వ్యవహారంలోని సులువులు,బరువులు బాగా తెలిశాయి. ఓసారి చేతికి అందివచ్చిన అవకాశాన్ని ఆసరగా చేసుకున్నాడు. తనతో పనిచేస్తున్న నలుగురికీ మరింతగా డబ్బు ఆశ చూపించి, తను పనిచేస్తున్న హోంనుంచి వాళ్ళని తీసుకొచ్చాడు. సొంతంగా వ్యవహారం ఆరంభించాడు. బిజినెస్, టైమ్ రెండూ కలిసొచ్చాయి. అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు అతని దగ్గర పనిచేసేవాళ్ళు ముప్ఫైముందికిపైగా ఉన్నారు. చంద్రమౌళి నిర్వహిస్తున్న ‘ఆదరణ’ హోంసర్వీసెస్కి మంచి పేరు వచ్చింది.
గిరిధర్ ‘ఆదరణ’ హోంలోచేరి మూడునెలలైంది. మొదటినెల ట్రైనింగ్. రెండోనెల ఒకరింటికి హెల్పర్‌గా వెళ్ళాడు. మంచిపేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏదైనా అవకాశం రాగానే గిరిధర్నే పంపుతానని మాటిచ్చాడు చంద్రమౌళి. అందుకే అందరికన్నా ఆతృతగా ఎదురుచూస్తున్నాడు గిరిధర్.ఎక్కడైనా పనిచేసినప్పుడే అక్కడివాళ్ళకి డబ్బు ఇస్తాడు చంద్రమౌళి. పని లేనినెల, వాళ్ళకి హోంలో భోజనం వసతివరకే. అందుకే చంద్రమౌళికన్నా ఎక్కువగా వాళ్ళే పనికోసం ఎదురుచూస్తారు.ఈనాటి నగరజీవితంలో మనిషి అవసరం రకరకాలు.
ఆయా కుటుంబాల పరిస్థితుల్నిబట్టి స్థితిగతుల్నిబట్టి అవసరాలుంటాయి. పెద్దదిక్కు ఎవరూలేని, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే, వాళ్ళపిల్లల్ని చూడటానికి ఆయాలాంటి బేబీ సిట్టర్స్ కావాలి. పెద్దదిక్కూ, పిల్లలూ, పెద్ద దిక్కులేని ఇద్దరూ లేని కొందరు భార్యాభర్తలు ఉద్యోగాలతో అలసిపోతే వంట మనిషి కావాలి. అందరూ తమ తమ పనులమీద బైటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో మిగిలిపోయే ఒంటరి వృద్ధులకి తోడుగా ఉండి, మంచి చెడ్డలు చూసే మనిషి అవసరాలు మరోరకం.