‘ఓ ఇద్దరు చాలు ... ఐదు తీస్కో, ఇరవై అడ్వాన్సు. పనయ్యాక బ్యాలెన్సు. ఇంతేనయ్యా నా కొటేషనూ’ అన్నాడతను. సిగరెట్ పొగ ఊదుతూ రెండో అతను... ‘కొటేషన్ పెంచాలి మాస్టారూ. ఐదుకి పనేం అవుతుంది?’ అన్నాడు విసుగ్గా. చాలాసేపు తెగలేదు బేరం. ఆఖరికి పదికి ఓకే అయింది. ‘సరే కానీయ్. రేపు ఫోటో, అడ్వాన్సు తీసుకో’ అనేసి వెళ్ళిపోయాడు మొదటి అతను.
తెల్లలుంగీ కట్టుకున్న డెబ్భై ఏళ్ల పెద్దమనిషి మార్నింగ్ వాక్ చేస్తున్నాడు. రహస్యంగా ఫోటోలు తీసుకున్నాడతను. వెంటనే వెళ్లి వాళ్ళిద్దర్నీ కలుసుకున్నాడు. ఫోటోలిచ్చి, ఇరవైవేలు అడ్వాన్సు ముట్టజెప్పాడు. విశు పండగనాడు పనిజరగాలన్నాడు. రివాల్వర్స్ని ఆయిలింగ్ చేసుకున్నారు షార్ప్ షూటర్స్. రెక్కీ నిర్వహించారు. రెండు రోజులు ఆ పెద్దమనిషి వేళాపాళల్ని ట్రాక్ చేయసాగారు.విశు పండగ రోజు రాత్రి తొమ్మిదింటికి వెళ్లి ఆ ఇంటి కాలింగ్ బెల్ నొక్కారు. ‘ఎవరు కావాలి?’ అంది పెద్ద కోడలు తలుపు తీసి. ‘మోహన్ సర్ లేరామ్మా?’ అన్నారు. తలూపి వెళ్ళిపోయింది. తెల్లలుంగీ పెద్ద మనిషి వచ్చి, ‘ఏం కావాలోయ్?’ అన్నాడు. ‘శానా ప్రాబ్లం అన్నా!’ అంటూనే... ఫటాఫటా గుళ్ళు పేల్చారు. కుప్పకూలిపోయాడతను. విశు పండక్కి మోగుతున్న టపాకాయల చప్పుళ్ళు, తూటాల శబ్దాన్ని మింగేశాయి.
కొచ్చి నగరమంతటా సంచలనం రేగింది, లిక్కర్ కింగ్ మిథిలామోహన్ దారుణ హత్యతో పోలీసు వర్గాలు కంగు తిన్నాయి. కోయంబత్తూరులో కలిశారు. పది లక్షలు తీసుకుని వెళ్ళిపోయారు షార్ప్ షూటర్స్. మిథిలా మోహన్ నల్గురు కొడుకులూ తక్షణం హంతకుల్ని పట్టుకోవాలని ఆందోళనకి దిగారు. ‘ఇది కొటేషన్ హత్య, ఎవరిచ్చి ఉంటారు కొటేషన్?’ అన్న పోలీసుల ప్రశ్నకి సమాధానం లేదు వాళ్ళదగ్గర. మిథిలా మోహన్ మృతకాయంలో ఐదు గుళ్ళు దొరికాయి. కిల్లర్స్ కారులో వచ్చినట్టు తేలింది. ఫైరింగ్ శబ్దాల్ని కవర్ చేసుకోవడానికి టపాకాయల పండగ రోజు పనికానిచ్చుకున్నట్టు అర్ధమైంది. కేసు క్రైం బ్రాంచ్‌కి బదిలీ అయింది. ఏ ఆధారాలూ లేని కేసు ఇది. దీంతో... ఒకరిద్దరు అనుమానితుల్ని పట్టుకుని ప్రశ్నించసాగారు. దుబాయిలో మార్టిన్ అనేవాడు లిక్కర్ కింగ్‌ని తానే చంపానని వాగుతున్నట్టు సమాచారం అందింది. వెంటనే రప్పించారు.
అవన్నీ తాగుబోతు మాటలని అర్థమైంది. మోహన్ అసిస్టెంట్నీ, ట్రక్ డ్రైవర్నీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కాదని తెలిసి, వదిలేశారు. రఫీ అనే లిక్కర్ స్మగ్లర్ని మోహన్ చాలా ఇబ్బంది పెట్టేవాడని తెలిసింది. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడిక్కూడా హత్యతో సంబంధం లేదని తేలింది. అంతలో మోహన్ పెద్ద కొడుకు మనోజ్, యాంటిసిపేటరీ బెయిల్‌కి దరఖాస్తు చేశాడని తెలిసి, హడావిడి పడ్డారు. ట్రక్ డ్రైవర్ అన్వర్ దీనికి సంబంధించిన రహస్య సమాచారం అందించాడు. మనోజ్ దగ్గర రెండు రివాల్వర్స్ ఉన్నాయనీ, అందుకే పిటీషన్ వేశాడనీ అన్వర్ వాదన. ఆ రివాల్వర్స్లో ఒకటి లైసెన్స్ రెన్యూవల్ కోసం కలెక్టర్‌కి సరెండరై వుంది. దాన్ని పరీక్షకి పంపారు. అది హత్యాయుధం కాదని తేలింది. తన దగ్గర రెండో రివాల్వర్ ఉండటం అబద్ధమని వాదించాడు మనోజ్.
మోహన్ చిన్నకొడుకు మనీష్ అయితే, ఇక ఈ కేసును సీబీఐకి అప్పగించాలని గట్టిగా డిమాండ్ చేశాడు. ఇంకో లిక్కర్ స్మగ్లర్ సంతోష్ కుమార్ పేరూ ప్రస్తావనకు వచ్చింది. అతణ్ణి పదహారు సార్లు పిలిపించి ప్రశ్నించారు. లాభం లేకపోయింది. దిండిగల్ పాండ్యన్ అనే కిల్లర్‌ని అనుమానించారు. అతను అప్పటికే తమిళనాడులో వేరే కేసులో ఎన్కౌంటర్లో మృతి చెందాడని తేలింది. లంక ముఠా ఈ కొటేషన్ హత్యకి పాల్పడినట్టు ఇన్ఫార్మర్లు ఉప్పందించారు. అదీ తప్పని నిర్ధరణ అయింది. సతీష్ కాలియా పేరు మీడియాలో వినపడసాగింది. ఛోటా రాజన్ మాఫియా షార్ప్ షూటర్ సతీష్ కాలియా... పక్కాగా నమ్మకం కలిగింది. ముంబయి పోలీసుల్ని ఆశ్రయించింది కేరళ క్రైం బ్రాంచ్. ‘జైల్లో పడున్నాడుగా వాడు!’ అన్నారు ముంబాయి పోలీసులు.